రాజకీయాల్లో వెన్నుపోటు అనే పదానికి నిలువుటద్దంగా నిలిచే 1995 నాటి పరిణామాలు.. తెలుగుదేశం చరిత్రలో ఎప్పటికీ చెరగని మాయని మచ్చ. నాడు కన్నతండ్రిని గద్దె దించి, వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఎన్టీఆర్‌ను అవమానపరుస్తుంటే.. ఒక కుమార్తెగా నారా భువనేశ్వరి ఎందుకు మౌనం వహించారన్న ప్రశ్నను నందమూరి లక్ష్మీపార్వతి మరోసారి తెరపైకి తెచ్చారు. చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజు వేడుకలను సాత్విక సేవగా ప్రదర్శించుకుంటున్న వేళ.. ఆయన రాజకీయ సామ్రాజ్య పునాదుల వెనుక ఉన్న ద్రోహాన్ని, అందులో సొంత బిడ్డల మౌన ముద్రను లక్ష్యంగా చేసుకుని లక్ష్మీపార్వతి సంధించిన అస్త్రాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కన్న తండ్రి ఎన్టీఆర్ ని బ్రతికుండగానే చంపేసిన కుట్రలో భువనేశ్వరి కూడా భాగస్వామి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు.. నారా కుటుంబం చెబుతున్న విలువల ముసుగును ప్రశ్నిస్తున్నాయి.
సొంత తండ్రికి అన్యాయం జరుగుతుంటే..
చంద్రబాబు నాయుడు కేవలం అధికారాన్నే కాకుండా, ఎన్టీఆర్ కన్నబిడ్డలను కూడా ఆయనకు దూరం చేశారని లక్ష్మీపార్వతి అత్యంత ఘాటుగా విమర్శించారు. ఎన్టీఆర్ కడుపున పుట్టిన బిడ్డల మధ్య చిచ్చు పెట్టి, వారిని తండ్రికి వ్యతిరేకంగా మార్చడం ద్వారా ఆయనను మానసికంగా కుంగదీశారని ఆమె ఆరోపించారు. చివరకు ఎన్టీఆర్ మరణానికి కూడా ఈ ఒంటరితనం, ఆవేదనే కారణమని పేర్కొంటూ.. చంద్రబాబును ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వ్యక్తిగా ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలో కుటుంబ బంధాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నిరూపించారని ఆమె విశ్లేషించారు.
భువనేశ్వరి పాత్రపై సూటి ప్రశ్న
ఈ మొత్తం వెన్నుపోటు ఎపిసోడ్‌లో నారా భువనేశ్వరి పాత్రపై లక్ష్మీపార్వతి సూటిగా నిలదీశారు. తన తండ్రికి అంత తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించి వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు ఒక కుమార్తెగా భువనేశ్వరి ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేది అన్యాయం, దుర్మార్గం అని ఒక్కసారైనా భువనేశ్వరి అడ్డుపడిందా? అని లక్ష్మీపార్వతి అడిగిన ప్రశ్నలు నారా కుటుంబం పాటిస్తున్న మౌనం వెనుక ఉన్న లోతైన అర్థాలను వెలికితీస్తున్నాయి.
వైస్రాయ్ అవమానం.. మాయని మచ్చ
చారిత్రక సాక్ష్యంగా నిలిచిన వైస్రాయ్ హోటల్ ఘటనను లక్ష్మీపార్వతి మరోసారి గుర్తు చేశారు. కన్నతండ్రిని అవమానపరుస్తూ చంద్రబాబు ఆయనపై చెప్పులతో దాడి చేయిస్తుంటే, ఆ దారుణాన్ని కళ్లారా చూస్తున్న భువనేశ్వరి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, చంద్రబాబును అడ్డుకోలేదని ఆరోపించారు. తండ్రి ఆవేదన కంటే భర్త అధికారమే ముఖ్యమని ఆమె భావించారా? అని విమర్శిస్తూ.. తండ్రి పక్షాన నిలబడలేని కుమార్తెకు విలువల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నైతికత లేని రాజకీయం
సొంత తండ్రికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లారా చూస్తూ కూడా మౌనం వహించిన భువనేశ్వరికి, విలువల గురించి మాట్లాడే అర్హత లేదని లక్ష్మీపార్వతి తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబుకు మొదటి నుంచీ రాజకీయ విలువలు లేవని, ఆయన చేసే ప్రతి అక్రమానికి భువనేశ్వరి వత్తాసు పలకడం ద్వారా ఆ దుర్మార్గంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారని ఆరోపించారు. విలువలు లేని తల్లిదండ్రులకు పుట్టిన నారా లోకేష్‌కు మాత్రం సంస్కారం, విలువలు ఎలా వస్తాయి? అని ఆమె ఎద్దేవా చేశారు. తల్లిదండ్రుల రాజకీయ వారసత్వంతో పాటు వారిలోని నైతిక రాహిత్యాన్ని కూడా లోకేష్ పుణికిపుచ్చుకున్నారని లక్ష్మీపార్వతి తన విమర్శనాస్త్రాలను సంధించారు.
ఎన్టీఆర్ పేరుతో అధికారం..
ఎన్టీఆర్ ఆశయాల గురించి గానీ, ఆయన పేరును వాడుకునే హక్కు గానీ నారా కుటుంబానికి లేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయనను వెన్నుపోటుతో వేధించి, మరణానంతరం కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం ఆయన ఫోటోలను వాడుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఆమె ధ్వజమెత్తారు. అధికారం కోసం తండ్రిని బలితీసుకున్న వారు, ఇప్పుడు అదే తండ్రి ఆశయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని విమర్శిస్తూ.. నారా కుటుంబం ప్రదర్శించే సేవ, సంప్రదాయం అంతా ఒక ముసుగు మాత్రమేనని ఆమె కుండబద్దలు కొట్టారు.
చారిత్రక గాయం.. నేటి రాజకీయం
1995 నాటి ఆ పరిణామాలు కేవలం ఒక అధికార మార్పిడి మాత్రమే కాదు.. అవి నందమూరి, నారా కుటుంబాల మధ్య మూడు దశాబ్దాలుగా నిరంతరం సాగుతున్న ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి పునాది. ఒకవైపు చంద్రబాబు నాయుడు తనను తాను ఎన్టీఆర్ ఆశయాలకు వారసుడిగా, ఆయన కన్న కలలను నిజం చేసే సారథిగా చిత్రించుకుంటూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ, మరోవైపు ఆ అధికారం పల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ని వంచించి, ఆయన మనోవేదనకు కారణమై పొందిన అపవిత్ర రాజ్యాధికారం అని భావిస్తూ లక్ష్మీపార్వతి చేస్తున్న పోరాటం ఏపీ రాజకీయాల్లో ఎప్పటికీ ఒక పజిల్‌లాగే మిగిలిపోయింది. ఈ చారిత్రక గాయం మాసిపోకుండా ఉండటమే నేటి రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన కోణం.
సేవా ముసుగు వెనుక మౌన ద్రోహం?
నారా కుటుంబం ప్రస్తుతం ప్రదర్శిస్తున్న అన్నదానాలు, విరాళాలు, సామాజిక సేవా కార్యక్రమాల వెనుక ఉన్న నైతిక ముసుగును తొలగించడమే లక్ష్మీపార్వతి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నారా భువనేశ్వరి మౌనాన్నితన తండ్రి ఎన్టీఆర్ పట్ల చేసిన ద్రోహంగా అభివర్ణించడం ద్వారా, ఆమె కేవలం రాజకీయ విమర్శలు చేయడం లేదు. నారా కుటుంబం నిర్మించుకున్న సెంటిమెంట్ పునాదులను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. బతికున్నప్పుడు కన్నతండ్రిని కాపాడుకోలేని వారు, ఇప్పుడు ఆయన ఫోటోలకు పూలమాలలు వేసి చేసే సేవలో నిజాయితీ ఎక్కడ ఉంది? అన్న ఆమె ప్రశ్న.. నారా కుటుంబం ప్రచారం చేసుకుంటున్న విలువలపై ఒక బలమైన సందేహాన్ని రేకెత్తిస్తోంది.