డీలిమిటేషన్‌పై ఏపీ నేతల నిశ్శబ్దం వెనుక రాజకీయ లెక్కలు
x

డీలిమిటేషన్‌పై ఏపీ నేతల నిశ్శబ్దం వెనుక రాజకీయ లెక్కలు

దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు ఏపీ ‘గొడుగు’ పట్టడం లేదు. పాలకులు తమ స్వార్థం చూసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు రెండు ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వైపు కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పార్లమెంట్ సీట్లు తగ్గుతాయని, ఉత్తర భారత ఆధిపత్యం పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ డ్రాఫ్ట్ పత్రాలను కాల్చి నిరసన తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందరూ డీలిమిటేషన్ వ్యవహారంపై మౌనం వహిస్తున్నారు. బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఏపీ కూటమి మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి ప్రధాని నరేంద్ర మోదీని అభినందించాలని ఆదేశించారు. ఈ విచిత్ర ధోరణి వెనుక ఏం ఉంది? ఇది ఏపీ ప్రజలకు మేలు చేస్తుందా? లేదా దీర్ఘకాలిక విపత్తుకు దారి తీస్తుందా?

డీలిమిటేషన్ ను సమర్థిస్తున్న పాలక పార్టీలు

2026 డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభ సీట్లను 543 నుంచి సుమారు 850కి పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఇందులో ఒక మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని కూడా ఉంది. దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించాయని, కానీ ఉత్తరం జనాభా పెరిగిందని, ఫలితంగా దక్షిణ సీట్లు తగ్గి రాజకీయ బలం తగ్గుతుందని వాదిస్తున్నాయి. కానీ ఏపీలోని అన్ని పార్టీలు (ఎన్‌డీఏ కూటమి, వైఎస్ఆర్‌సీపీ) ఈ బిల్లును సమర్థిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి “ప్రో-రాటా” (నిష్పత్తి) పెంపు హామీ తీసుకున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ దీన్ని “కొత్త నాయకులకు అవకాశం”గా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా “50 శాతం ఏకరీతి పెంపు ఉత్తమం” అని మద్దతు తెలిపారు. ఏపీ అసెంబ్లీ సీట్లు కూడా 50 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది రాజకీయ నాయకులకు కొత్త సీట్లు, కొత్త అవకాశాలు అందిస్తుంది.

ఎందుకు ఈ నిశ్శబ్దం?

ఏపీ రాజకీయాల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి ఫండ్స్, ప్రాజెక్టులు ప్రధానం. ఎన్‌డీఏ కూటమి కేంద్రంతో ఉన్న సన్నిహితత్వం వల్ల రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు, రైల్వే, పోర్టు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు వస్తాయని లెక్క. వైఎస్‌ఆర్‌సీపీ కూడా ఎన్నికల తర్వాత కేంద్రంతో ఢీకొనాలని ఆశించడం లేదు. దక్షిణ ఐక్యత కంటే రాష్ట్ర స్వార్థం ముందు. కానీ విమర్శకులు ఇది “దక్షిణ ఫెడరల్ స్ఫూర్తికి గుండుకొట్టడం” అంటున్నారు.

ప్రజలకు మేలా? విపత్తా?

స్వల్పకాలికంగా ఏపీకి మేలు చేస్తుందని అనుకోవచ్చు. ఎక్కువ సీట్లు, మహిళల రిజర్వేషన్ వల్ల కొత్త నాయకత్వం, అభివృద్ధి. కానీ దీర్ఘకాలికంగా దక్షిణ రాష్ట్రాల రాజకీయ బలం తగ్గితే, కేంద్ర నిర్ణయాల్లో ఏపీ గొంతు కూడా బలహీనపడవచ్చు. జనాభా ఆధారంగా మాత్రమే కాకుండా, ఆర్థిక సహకారం, జన నియంత్రణ విజయాలను కూడా పరిగణించాలనే దక్షిణ రాష్ట్రాల వాదన సమంజసం. ఈ విషయంలో ఏపీ నాయకులు మౌనం వహించడం ప్రజలకు అన్యాయం చేస్తుందని వామపక్షాలు మాత్రమే కాక, నిష్పక్షపాత మేధావులు కూడా హెచ్చరిస్తున్నారు. అన్ని పార్టీలు (వామపక్షాలు తప్ప) బాధ్యులే.

పలువురి అభిప్రాయాలు

డా. వి. హనుమంతరావు (Vuthpulla Hanumantha Rao) (రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ, రాజకీయ విశ్లేషకుడు)

“ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ప్రాగ్మాటిక్. కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటే రాష్ట్రానికి డబ్బు, ప్రాజెక్టులు వస్తాయి. డీలిమిటేషన్‌లో సీట్లు పెరగడం ఏపీకి లాభం. కానీ దక్షిణ ఐక్యతను వదిలేసి ఒంటరిగా నడవడం దీర్ఘకాలికంగా ఫెడరల్ న్యాయానికి హాని. ప్రజలు ఇప్పుడు సంతోషపడవచ్చు, కానీ రేపు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ గొంతు బలహీనమవుతుంది.”

పవన్ కల్యాణ్ (జనసేన అధినేత, ఏపీ డెప్యూటీ సీఎం)

డీలిమిటేషన్‌ను స్వాగతించారు. అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు సుమారు 50 శాతం పెరిగి, కొత్త నాయకులకు (సుమారు 100 మందికి) అవకాశాలు వస్తాయని, ప్రజా హితం దృష్టిలో ఉంచి రూల్-బేస్డ్ అప్రోచ్ అవసరమని అన్నారు.

సజ్జల రామకృష్ణ రెడ్డి (వైఎస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ)

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్టీ సమర్థిస్తుందని, దేశవ్యాప్తంగా 50 శాతం సీట్ల పెంపు దక్షిణ రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరిస్తుందని, ఏకరీతి పెంపు ఉత్తమమని చెప్పారు.

వై.ఎస్. షర్మిల (ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు)

డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు లేఖ రాసి, ఏపీ రాజకీయ, ఆర్థిక హితాలకు హాని కలిగించవచ్చని, అన్ని పార్టీల ఎంపీలు ఏకమై వ్యతిరేకించాలని, అసెంబ్లీలో స్పెషల్ సెషన్ పిలవాలని డిమాండ్ చేశారు.

జీ. ఈశ్వరయ్య (సీపీఐ స్టేట్ సెక్రటరీ)

డీలిమిటేషన్‌ను వ్యతిరేకించారు. మహిళా బిల్లును సమర్థిస్తున్నా, దాన్ని డీలిమిటేషన్‌కు ముసాయిదాగా ఉపయోగించడం దక్షిణ రాష్ట్రాలకు హానికరమని, చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ స్పష్టమైన స్టాండ్ తీసుకోవాలని హెచ్చరించారు.

ప్రజలు ఈ నిర్ణయాల వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో కాలమే చెప్పాలి. కానీ దక్షిణ భారత ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతిన్నా, ఏపీ ప్రజలు మాత్రం అభివృద్ధి ఆశతో ఉన్నారు. ఇది మంచి మార్గమా లేదా రాజకీయ చాతుర్యమా? చర్చించాల్సిన సమయం ఇదే.

Read More
Next Story