
Pawan and Chandrabau
స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు చెదిరితే నష్టం ఎవరికీ?
2024 ఎన్నికల సీట్ల సర్దుబాటు ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని జనసేన ఎందుకు అంటోందీ?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో పాలక NDA మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు గురించి వాదోపవాదనలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం-జనసేన మధ్య సీట్ల పంపకం ఈ చర్చకు కేంద్ర బిందువు గా మారింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపిణీ ఎలావుండబోతుందో తెలుగుదేశం ప్రకటిస్తే దాన్ని తోసిపుచ్చతూ; 2024 సార్వత్రిక ఎన్నికల సీట్ల సర్దుబాటు ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదంటూ జనసేన నుంచి వచ్చిన అనంగికార ప్రతిస్పందనలు కూటమి రాజకీయాల్లో వేడిని పెంచాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు,పదవులు పంపకంలో జనసేన ఎంత త్యాగం చేసిందో, ఎలా సర్దుకు పోయిందో,ఎంత నష్టపోయిందో ఈ సందర్భం మళ్ళీ చర్చకు వచ్చింది.ఎలయన్స్ రాజకీయాల్లో ఎన్నికలప్పుడు పార్టనర్స్ మధ్య తియ్యటి మాటలు వుంటాయి. ఎన్నికల్లో ప్రాణవాయువు లాగా సాయపడిన చిన్న పార్టీలని అధికారంలోకి వచ్చాక విస్మరించటం కూడా సాధారణం అయిపోయింది. పెద్ద భాగస్వాముల నియంతృత్వంతో చరిత్ర లో ఎన్నో కూటములు కూలిపోయినాయి. అటువంటి చాయలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి.వచ్చే స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలకి సంబందిచి ఇప్పటికే వచ్చిన ప్రకటనలు కూటమి పక్షాల మధ్య టెన్షన్స్ పెంచుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పెద్ద భాగస్వాములు న్యాయబద్దంగా వ్యవహరించక పొతే దాని ప్రభావం 2029 అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిపాదించినట్లుగా ప్రచారంలోకి వచ్చిన 80:15:5 సీట్ల సర్దుబాటు ఫార్ములాను జనసేన పార్టీ (JSP) అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా తిరస్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపిణీ లో 2024 ఫార్ములాలో ఉండదని ,జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బ తినని రీతిలో పోటీ ఉంటుందని ప్రకటించారు.సంకీర్ణ ప్రభుత్వంలో ఉమ్మడి నిర్ణయం లేకుండా తెలుగుదేశం నుంచి ఇలా ఏకపక్ష ప్రకటన రావటం ప్రజల్ని , రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆక్సిజన్ లా పనిచేసిన జనసేన,పూర్తి అండగా వున్నా బిజెపి ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తుంది
2024 పొత్తు వద్దని పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి:
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడు అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనని కలిసిన తరవాత JSP-TDP కలిసి వెళతాయి అని ప్రకటించాడు.NDA ఆవిర్భావానికి అక్కడే బీజాలు పడినప్పటికి అనేకమంది అయన మద్దతు దారులు, ముఖ్యంగా జనసేనని అభిమానించే కాపు వర్గం TDPతో పొత్తుని తీవ్రంగా వ్యతిరేకించారు.నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య విబేధాలు, రంగా హత్య ఉదంతం , “అలాగా” జనం అని వచ్చిన వ్యాఖ్యానాలు,సంప్రదాయ వైరుధ్యాలు మొదలైన అంశాలెన్నిటినో పొత్తుకి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకి తెచ్చారు. 2014 పవన్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన తరవాత జనసేన శ్రేణులు ఎదుర్కొన్న రాజకీయ నిర్లక్ష్యాన్ని, అవమానాలను వారు ఉటంకించారు. పొత్తుకి వెళ్ళొద్దని పవన్ కళ్యాణ్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చివరికి సీట్ల పంపిణీ దగ్గరైన పొత్తు చర్చలు విఫలం కావాలని వారు కోరుకున్నారు. అంతటి వ్యతిరేక వాతావరణంలో కూడా పవన్ కళ్యాణ్ తన అనుచరుల్ని కన్వీన్స్ చేసుకుని చంద్రబాబు కి మద్దతుగా నిలబడ్డాడు.ఆయన నిర్ణయం చరిత్ర మలుపు తిప్పటంలో ఒక మైలు రాయి అని చెప్పాలి.
చంద్రబాబు అరెస్ట్ తరవాత పరిణామాలు
మరోవైపు అప్పటి దాకా జగన్ ధాటికి విలవిలలాడి పోతున్న TDP వర్గాలకి పవన్ కళ్యాణ్ ప్రకటన కొత్త శక్తిని ఇచ్చింది.చంద్రబాబుని పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకోచ్చే దారిలో టిడిపి నుండి బలమైన ప్రతిఘటనే లేదంటే నాటి TDP నిస్ప్రుహ ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుని కలవటానికి పవన్ కళ్యాన్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన క్షణం నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక సంచలనం నమోదైంది. ఈ పరిణామం చంద్రబాబుకు లభించిన తొలి బలమైన రాజకీయ మద్దతుగా నిలవడమే కాకుండా, అరెస్ట్ ద్వారా మైలేజ్ పొందాలనుకున్న అధికార YCP వ్యూహాలను తిప్పికొట్టింది.మరోవైపు పొత్తులో 50 సీట్లకి తగ్గోద్దని ఆయనపై ఒత్తిడి పెరిగుతున్నా కూటమి మనుగడ మరియు ఓట్ల చీలిక నివారణే లక్ష్యంగా 21 సీట్లకి సర్డుకుపోయాడు. ఆరోజు వున్నా పరిస్థితికి పవన్ 50-60 సీట్ల కి పట్టుపడితే టిడిపి ఒప్పుకొక తప్పేదికాదని కూడా విశ్లేషణలు వచ్చాయి. రాష్ట్రంలో గెలుపోటములను శాసించే 20 శాతం కాపు సామాజిక వర్గ ఓటు ఆయన మూలంగానే కూటమికి బదిలీ అయ్యిందనేది జగమెరిగిన సత్యం. ఆయనే లేకపోతె అందులో ఎక్కువ శాతం ఓటు YCPకి వెళ్ళిపోయేది . చివరకు టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేని భారతీయ జనతా పార్టీ (BJP)ని సైతం ఈ పొత్తులోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ సాగించిన దౌత్యం, 2024 ఎన్నికల విజయానికి అత్యంత బలమైన పునాదిగా నిలిచింది.
ఆ పొత్తు వల్ల ఎవరికీ ఎక్కువ ప్రయోజనం:
పాలకుల కక్షల వల్ల 2019-2024 మధ్య TDPకి వెన్నుదన్నుగా వున్న ఒక సామాజిక వర్గం అత్యంత ఒంటరితనాన్ని ఎదుర్కొన్న విషయం అందరికి తెలుసు. ఆ సామాజిక వర్గంలోని కాంట్రాక్టర్లకి బిల్స్ అందేవి కాదు. అధికారంలోని వారి వేదింపులు తట్టుకోలేక ఆ వర్గంలోని వారు కొందరు హైదరాబాద్,బెంగుళూరు వలసలు వెళ్ళారని జనం చెప్పుకున్నారు.చంద్రబాబు సహితం పబ్లిక్ గా కన్నీరు పెట్టుకున్న పరిస్థితులు సమాజం చూసింది.చివరికి ఆయన్ని జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే.అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒంటిచేత్తో పొత్తుని ఏర్పాటు చేసాడు. పొత్తు ఇద్దరికీ అధికారాన్ని తెచ్చినప్పటికి, వ్యూహాత్మకంగా మరియు సంస్థాగతంగా,TDPకి మాత్రం ఫ్రెష్ లైఫ్ ఇచ్చిందని గుర్తించాలి. పవన్ కళ్యాణ్ చొరవతో పొత్తు కుదరని పక్షంలో ఆపార్టీ తన గత 40 శాతం ఓటు బ్యాంకును సైతం కాపాడుకోలేని క్లిష్ట స్థితిని ఎదుర్కొనేది. జనసేన పరిస్థితి అది కాదు.ఒక వేళ ఓడిపోయినా ఆ పార్టీ స్థితిలో పెద్ద మార్పు వుండేది కాదు. పొత్తు వల్ల 21 మంది ఆపార్టీ నుంచి MLAలు అవ్వటం కొంత బోనస్ లాంటిది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఎప్పటికి చరిత్ర మరిచి పోలేని పాత్రని పవన్ కళ్యాన్ పోషించాడు.కానీ ఏరుదాటాక తెప్ప తగలబెట్టటం రాజకీయాల్లో ఒక సాధారణ అలవాటు అయిపోవటం అత్యంత విషాద కరమైన వాస్తవం.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిణామాలు:
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నామినేటెడ్ పదవుల్లో, రేషన్ షాపు కేటాయింపుల్లో జనసేన వారికి సరైన వాట దక్కలేదని ఆ పార్టీ క్షేత్ర స్థాయి లో కార్యకర్తలు, నాయకులు మొదటి నుండి ఆరోపిస్తునే వున్నారు. లెక్కలు చూస్తే అది నిజమే అని తేలిపోతుంది కూడా . పొత్తులో ఆ పార్టీనుంచి గెలిచిన MLAలు తమని పట్టించుకోవటల్లేదని , తమ పనులు జరగటల్లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించటల్లేదని ఇంకో ఆరోపణ. చివరకి శిలాఫలకాలు, ఫ్లెక్షిల మీద పవన్ కళ్యాణ్ పేరు, ఫోటోలు వెయ్యకుండా వదిలేస్తున్నారని జనసైనికులు ఘర్షణలకి దిగాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్నా వాళ్ళను కొంత ఓపిక పట్టమని పవన్ కళ్యాణ్ సర్దిచేప్పుకొస్తున్నట్టు తెలుస్తుంది. కూటమికి ఇబ్బంది కలగకూడదనే ఒకేఒక కారణంతో ఆయన సర్డుకుపోతున్నట్టు అర్ధమౌతుంది.గత అనుభవాల ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ బలానికి అనుకూలంగానే సీట్లు తీసుకోవాలని, రాష్ట్రం మొత్తానికి ఒకే ఫార్ములా కుదరదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది.గతంలో కంటే తమ పార్టీ పని తీరు, క్రమశిక్షణ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందిదని, నిర్మాణ పరంగా పరిణతి చెందినదని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల ఆత్మగౌరవం కాపాడేవిధంగానే పోటీ ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించటం ఆ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. క్షేత్ర స్థాయిలో తన కార్యకర్తలకి తగిన అవకాశాలు కల్పించాలని పవన్ కళ్యాణ్ ధృఢ సంకల్పంతో వున్నట్టు అర్ధం అవుతున్నది.స్థానిక ఎన్నికల్లో బలంగా నిలబడి జనసేనని బలోపేతం చేసుకునే దిశగా జనసేన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. గతంలో కూటమి ఐక్యత కోసం చేసిన త్యాగాలు ఇప్పుడు ఉండవని పరోక్షంగా ఆయన చెప్పినట్టు ఇక్కడ అర్ధం చేసుకోవాలి . న్యాయబద్దంగా వుండి సాయం చేసినవారికి వుండే నైతిక బలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో కనిపిస్తుంది.ఆయన మౌనం బద్దలు కాకముందే జరిగిన పొరపాట్లు దిద్దుకుంటే మంచిదే.
ఒకవేళ స్థానిక ఎన్నికల్లో జనసేనకి సరైన ప్రాధాన్యత దక్కక పొతే మాత్రం అది 2029 అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చెయ్యొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద మనసు చేసుకుని పనిచేసాడో ప్రజలు చూసారు. ఎన్నికల తరవాత అంతకంటే ఎక్కువ పెద్ద మనసు కూటమిలో కీలక స్థానంలో వున్నవారు పవన్ కళ్యాణ్ పట్ల చూపాలని ప్రజలు ఆశించటం సహజం. న్యాయమ కూడా . కానీ పరిస్తితి అలా లేనట్టు గా ప్రజలు చర్చించుకుంటున్నారు.త్యాగం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో సానుభూతి వుంది. ఆయనకి అన్యాయం జరిగినట్లు కనబడితే కూటమికి మంచిది కాదు. ఇప్పటికే కూటమి మీద ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఇంకోవైపు YCP గ్రాఫ్ పెరుగుతూనే వుంది . మిత్రుల మధ్య పరిస్థితి మారకపోతే 2019 ఫలితాలు 2029లో పునారావృతం కావచ్చు.ఆకలితో వున్న పులిలా ఉన్న ycp పనితీరు ఈ సారీ తరవాత స్థాయి లో ఉంటుందని ఊహించటం పెద్ద కష్టం కాదు.
(గమనిక- ఇందులో వ్యక్తం చేసినవన్నీ రచయిత అభిప్రాయాలే)
Next Story

