
తమిళనాడుకు కొత్త టీమ్..
విజయ్ కేబినెట్‌లో సినీ, రాజకీయ, వ్యూహాత్మక ముఖాలు..
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మాజీ ఏఐఏడీఎంకే నేతలు, యువ ఎమ్మెల్యేలు, వ్యూహకర్తలతో 9 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు.
తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం..
దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యం కొనసాగిన తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త మార్పు కనిపిస్తోంది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయ్, తమిళగ వెట్రి కజగం (టీవీకే) తరఫున ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కేబినెట్‌లో సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, యువ ఎమ్మెల్యేలు, సినీ రంగానికి చెందినవారు చోటు దక్కించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.
కేబినెట్‌లో ఎవరు ఎవరు?
1. కేఏ సెంగోట్టయ్యన్
టీవీకే కేబినెట్‌లో అత్యంత సీనియర్ నాయకుడు సెంగోట్టయ్యన్. ఎంజీఆర్, జయలలితల కాలం నుంచి ఏఐఏడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. 2025లో ఏఐఏడీఎంకేను వీడి విజయ్ పార్టీలో చేరారు. 2026 ఎన్నికల్లో గోబిచెట్టిపాలయం నుంచి గెలిచి మరోసారి తన రాజకీయ బలం చూపించారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కింది.
2. ఆదవ్ అర్జున..
విజయ్‌కు అత్యంత సన్నిహిత వ్యూహకర్తల్లో ఆదవ్ అర్జున ఒకరు.విల్లివాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీవీకే ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసిన ప్రధాన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.
3. ఎన్ ఆనంద్ (బస్సీ ఆనంద్)
టీవీకే ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బస్సీ ఆనంద్, విజయ్‌కు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు. త్యాగరాయనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, పార్టీ అధికార ప్రతినిధిగానూ కీలకంగా వ్యవహరించారు.
4. డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్
డాక్టర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్‌రాజ్ ఇప్పుడు రాజకీయాల్లో కీలక ముఖంగా మారారు. టీవీకే విధాన, ప్రచార విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తిరుచెంగోడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
5. రాజ్‌మోహన్
టీవీ, సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌మోహన్, తన ప్రసంగాలతో ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎగ్మోర్ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. డీఎంకే అభ్యర్థిపై విజయం సాధించడం ఆయనకు పెద్ద రాజకీయ బ్రేక్‌గా మారింది.
6. పి వెంకటరమణన్
విజయ్‌కు చాలా కాలంగా వ్యక్తిగత మేనేజర్‌గా పనిచేసిన వెంకటరమణన్, ఇప్పుడు మంత్రి అయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన, టీవీకే కోశాధికారిగానూ వ్యవహరించారు. మైలాపూర్ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
7. టికె ప్రభు
వృత్తిరీత్యా దంతవైద్యుడు అయిన టికె ప్రభు, కారైకుడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లో కొత్తవారైనా, ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకుని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
8. ఎస్ కీర్తన
29 ఏళ్ల కీర్తన ఈ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలు. శివకాశి నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతంగా ఆమె ఎంపికను చూస్తున్నారు.
9. ఆర్ నిర్మల్‌కుమార్
బీజేపీ నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన నిర్మల్‌కుమార్, తరువాత టీవీకేలో చేరారు. దక్షిణ తమిళనాడులో పార్టీ బలోపేతానికి పనిచేసిన ఆయన, తిరుప్పరన్‌కుండ్రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కొత్త కేబినెట్‌పై ఆసక్తి
విజయ్ మంత్రివర్గంలో సీనియర్లతో పాటు కొత్త ముఖాలకు కూడా అవకాశం ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అనుభవం, యువత, వ్యూహాత్మక నాయకత్వం కలయికతో ఈ కేబినెట్‌ను రూపొందించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎలా పనిచేస్తుందనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

