లోకేష్ కట్టుబట్టల వ్యాఖ్యల వెనుక అసలు కథ ఏంటి?
x

లోకేష్ కట్టుబట్టల వ్యాఖ్యల వెనుక అసలు కథ ఏంటి?

అమరావతి గడ్డపై భావోద్వేగ రాజకీయం మరో సారి ‘ఓటుకు నోటు’ చర్చకు దారి తీసింది.


విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేదికగా మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 2014 విభజన కష్టాలను గుర్తుచేస్తూ.. అప్పుడు కూర్చోవడానికి సీఎంకు కుర్చీ కూడా లేదు.. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చాం అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ఆనాడు కనీసం సచివాలయం కూడా లేని నిస్సహాయ స్థితిలో ఆంధ్ర యూనివర్సిటీనే ఏపీ ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీకి ఆశ్రయమిచ్చిందని, మనకున్న అతిపెద్ద ఆస్తి కేవలం బ్రాండ్ చంద్రబాబు మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. అయితే, లోకేశ్ వినిపించిన ఈ నిస్సహాయత వెనుక నాటి వాస్తవ రాజకీయ పరిణామాలు మరోలా ఉన్నాయనే చర్చ ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్ల అవకాశం ఉన్నా, కోట్లాది రూపాయలతో ఆధునిక హంగులతో సీఎం ఛాంబర్ సిద్ధమైనా.. అకస్మాత్తుగా ఏపీ ప్రభుత్వం విజయవాడ బాట పట్టడానికి ఆనాడు సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసే ప్రధాన కారణం అనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి.

హైటెక్ హంగుల నుంచి విజయవాడ బాట వరకు
వాస్తవానికి, విభజన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను వదిలి రాలేదు. 2014 జూన్ 2న విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున, ఏపీ పాలనా యంత్రాంగం అంతా అక్కడే కేంద్రీకృతమై ఉండేలా పక్కా ప్రణాళికలు జరిగాయి. లోకేశ్ పేర్కొన్నట్లు కుర్చీ లేని పరిస్థితి కాకుండా, అప్పట్లో ముఖ్యమంత్రి కోసం అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్యాలయాలను సిద్ధం చేశారు.
రూ. 10 కోట్ల హైటెక్ సీఎం ఛాంబర్
హైదరాబాద్ సచివాలయంలోని ఎల్‌-బ్లాక్‌ (L-Block) ఎనిమిదో అంతస్తును ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంగా ఎంపిక చేసి, వాస్తు దోషాల నివారణకు సమూల మార్పులు చేశారు. సుమారు రూ. 10 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ఛాంబర్‌ను దేశంలోనే అత్యంత ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. భద్రత కోసం బులెట్ ప్రూఫ్ గ్లాస్ కిటికీలు, పటిష్టమైన కాంక్రీట్ గోడలు, అధునాతన క్యాబినెట్ కాన్ఫరెన్స్ హాల్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో అత్యున్నత స్థాయి నుంచి పాలన సాగించేందుకు కావాల్సిన అన్నీ హంగులూ అప్పట్లో సిద్ధమయ్యాయి.
లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో విలాసవంతమైన క్యాంప్ ఆఫీస్
సచివాలయమే కాకుండా, రాజ్‌భవన్ రోడ్డులోని చారిత్రక లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను ముఖ్యమంత్రి తాత్కాలిక క్యాంప్ ఆఫీస్‌గా ఎంపిక చేశారు. దీని ఆధునీకరణ, భద్రతా చర్యల కోసం ప్రభుత్వం సుమారు రూ. 45 లక్షలకు పైగా ఖర్చు చేసింది. గెస్ట్ హౌస్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, సమీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఛాంబర్లను సైతం ఏర్పాటు చేశారు. రాజధాని లేకపోయినా, పరిపాలన సాగించడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు హైదరాబాద్‌లో సుసంపన్నంగా ఉన్నాయనడానికి ఈ ఖరీదైన ఏర్పాట్లే నిదర్శనం. అయితే, ఇంతటి భారీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా, కేవలం రెండు ఏళ్లలోనే ఆ హైటెక్ సౌకర్యాలను వదిలి అమరావతికి తరలివెళ్లడం వెనుక అసలు కథ ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి రాజధానిని వీడటానికి అసలు కారణం ఇదేనా?
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్ల పాటు అధికారం చలాయించే చట్టబద్ధమైన హక్కు ఉన్నప్పటికీ, కేవలం రెండేళ్లలోనే (2016 నాటికి) ఏపీ ప్రభుత్వం హడావుడిగా విజయవాడ బాట పట్టడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. 2015లో తలెత్తిన సంచలనాత్మక ఓటుకు నోటు కేసు ఈ పరిణామాలన్నింటికి ప్రధాన కారణమని అప్పట్లో రాజకీయ పక్షాలన్నీ బల్ల గుద్ది చెప్పాయి. ఈ అంశంలో నారా చంద్రబాబు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్, ఆపై బయటకు వచ్చిన ఆడియో టేపులు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీశాయి. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, నిఘా నీడలో పాలన సాగించడం సురక్షితం కాదనే భయం అప్పటి ఏపీ పాలకుల్లో బలపడింది. హైదరాబాద్‌లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతాయని భావించిన చంద్రబాబు నాయుడు, మౌలిక వసతులు లేకపోయినా సరే.. సొంత గడ్డ నుంచే పాలన సాగించడం ఉత్తమమని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతి (వెలగపూడి)లో తాత్కాలిక సచివాలయ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమైంది. లోకేశ్ చెబుతున్నట్లు కూర్చోవడానికి కుర్చీ లేక కాదు.. తన తండ్రి, సీఎం చంద్రబాబు వెలగబెట్టిన పనుల వల్లే హైదరాబాద్‌లోని రూ. 10 కోట్ల హైటెక్ ఛాంబర్‌ను వదిలి అమరావతికి తరలివచ్చారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
భావోద్వేగం..సానుభూతి కోసమేనా ఈ వ్యాఖ్యలు?
మంత్రి లోకేశ్ అన్నట్లుగా విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, భౌగోళికంగా తీవ్రంగా నష్టపోయిన మాట అక్షర సత్యం. విభజన జరిగిన కొత్తలో సొంత గడ్డపై సచివాలయం, అసెంబ్లీ వంటి కనీస వసతులు లేవు కాబట్టే, పాలనాపరమైన అనివార్యతతో తొలి కేబినెట్ భేటీని ఏయూలో నిర్వహించారు. అయితే, కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు అనడం రాజకీయంగా ప్రజల సానుభూతిని పొందేందుకు చేసిన ఒక భావోద్వేగ ప్రకటనగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ఒకవైపు హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఎల్‌-బ్లాక్‌లోని సీఎం కార్యాలయాన్ని, లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను సర్వాంగ సుందరంగా ఆధునీకరించుకున్న తరుణంలోనే.. కేవలం రాజకీయ కారణాల వల్ల వాటిని వదులుకోవాల్సి వచ్చింది.
తెలంగాణలో తన రాజకీయ ప్రాభల్యం పెంచుకోవడమే లక్ష్యంగా సాగించిన ప్రయత్నాల్లో భాగంగా వెలుగుచూసిన ఓటుకు నోటు కేసు, ఆ తర్వాతి రాజకీయ ఒత్తిళ్లే అమరావతికి అర్ధాంతరంగా తరలిరావడానికి ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. ఇన్ని వాస్తవాలు కళ్లముందు ఉండగా, వాటన్నింటినీ పక్కన పెట్టి కట్టుబట్టలతో వచ్చామంటూ మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఉమ్మడి రాజధానిని ఏ పరిస్థితుల్లో, ఎవరి వల్ల వదిలి రావాల్సి వచ్చిందనే చారిత్రక నిజాన్ని ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిపేసి, కేవలం బాధిత ముద్రతో రాజకీయ లబ్ధి పొందేందుకే లోకేశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. భావోద్వేగానికి, వాస్తవానికి మధ్య ఉన్న ఈ సన్నని గీతను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో వేచి చూడాలి.
Read More
Next Story