
’గొడ్డలి పార్టీ‘ నినాదం వెనుక ఉన్న చంద్రబాబు రాజకీయ వ్యూహం ఏమిటి?
వైసీపీని, జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం దాడిని పెంచింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ఉపయోగిస్తున్న గొడ్డలి పార్టీ నినాదం కేవలం ఒక తాత్కాలిక విమర్శ కాదు, అది ఒక దీర్ఘకాలిక నెగెటివ్ బ్రాండింగ్ వ్యూహం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతాన్ని క్షేత్రస్థాయి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, వైసీపీ అంటేనే ఫ్యాక్షన్, దాడులు, హింసకు కేరాఫ్ అడ్రస్ అనే ముద్ర వేయడం చంద్రబాబు వ్యూహంలో అత్యంత కీలకమైన భాగంగా భావిస్తున్నారు. సాధారణంగా గొడవలకు, అరాచకాలకు దూరంగా ఉంటూ ప్రశాంతతను కోరుకునే మహిళా ఓటర్లు, కుటుంబాలు, తటస్థ ఓటర్ల మనస్సులో ప్రత్యర్థి పార్టీ పట్ల ఒక శాశ్వతమైన భయాందోళనను సృష్టించడానికి ఈ పదాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు . వైసీపీ నేతలు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు మృగ్యమవుతాయనే పర్సెప్షన్‌ను నిరంతరం సజీవంగా ఉంచడం ద్వారా ఆ పార్టీకి తిరిగి కోలుకునే అవకాశం లేకుండా చేయడం ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

