విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడికి కీలక పదవి..
x

విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడికి కీలక పదవి..

2024లోనే విజయ్ తమిళనాడులో పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతారని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని అంచనా వేసిన రాధన్ పండిట్ వెట్రివెల్‌..


Click the Play button to hear this message in audio format

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ తనకు అత్యంత సన్నిహితుడిగా భావించే జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌కు కీలక పదవి ఇచ్చారు. ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజకీయ అంచనాలు చెప్పడంలో, ప్రముఖులతో ఆధ్యాత్మిక సంబంధాలు కొనసాగించడంలో రాధన్ పండిట్ వెట్రివెల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల నుంచే ఆయనకు మద్దతుగా నిలిచారు. 2024లోనే విజయ్ తమిళనాడులో పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతారని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అంచనా వేశారు.

అంచనాలు నిజమయ్యాయా?

విజయ్ జాతకంలో “సునామీలా రాజకీయ శక్తి ఉంది” అని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. 2026 ఎన్నికల నాటికి విజయ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా మారుతారని కూడా ఆయన చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే అంచనాలు నిజమవడంతో, విజయ్ ప్రభుత్వం ఆయనకు కీలక రాజకీయ బాధ్యత అప్పగించడం ఆసక్తికరంగా మారింది.

రాధన్ పండిట్ వెట్రివెల్‌కు జ్యోతిష్యం, ఆధ్యాత్మిక రంగాల్లో నాలుగు దశాబ్దాలకు‌పైగా అనుభవం ఉందని మీడియాల్లో వార్తలొచ్చాయి. ప్రాచీన జ్యోతిష్య జ్ఞానం, ఆధ్యాత్మిక సాధనల ద్వారా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తుంటానని ఆయన చెబుతున్నారు.

పొలిటీషియన్స్‌తో సత్సంబంధాలు..

రాధన్ పండిట్ వెట్రివెల్‌కు రాజకీయ నాయకులతో కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించినట్లు సమాచారం. 1991లో జయలలిత చారిత్రాత్మక విజయాన్ని కూడా ముందుగానే అంచనా వేసినట్లు చెబుతారు.

ఇక విజయ్ రాజకీయ ప్రయాణంలో కూడా రాధన్ పండిట్ వెట్రివెల్ కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. విజయ్ పార్టీ టీవీకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. తొలి ఎన్నికల్లోనే ఈ స్థాయి విజయం సాధించడం తమిళ రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం.

ఈ నేపథ్యంలో విజయ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా భావిస్తున్న రాధన్ పండిట్ వెట్రివెల్‌ను సీఎం కార్యాలయంలో రాజకీయ OSDగా నియమించడం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read More
Next Story