
విజయ్..జగన్ దోస్తీ వెనుక ’రెడ్డి‘ వ్యూహం ఉందా?
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి డియర్ బ్రదర్ విజయ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ సృష్టించిన ప్రభంజనం ద్రవిడ రాజకీయాలను షేక్ చేసింది. అయితే విజయ్ అరంగేట్రం చేసిన తొలి ప్రయత్నంలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదృశ్య హస్త’ ఉందనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ గెలిచిన వెంటనే జగన్ ఆయనను డియర్ బ్రదర్ అని సంబోధిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలపడం ఈ అనుబంధాన్ని మరింత బలపరిచింది. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సాధించిన ఈ చారిత్రాత్మక విజయం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు. దీని ప్రకంపనలు ఏపీలోనూ బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా సినీ నటుడు విజయ్ విజయానికి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఉన్న అంతర్గత స్నేహం, సామాజిక సమీకరణాలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విజయ్ గెలిచిన వెంటనే జగన్ తన సందేశంలో నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు.. ప్రజా సేవలో దేవుడు మీకు తోడుగా ఉండాలి అని పేర్కొనడం కేవలం మర్యాదపూర్వకమైన ట్వీట్ మాత్రమే కాదు, దీని వెనుక లోతైన రాజకీయ, సామాజిక బంధం ఉందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. ఈ బ్రదర్లీ బాండింగ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ రెడ్డి సామాజిక వర్గ సమీకరణమేనా అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.
రెడ్డి సెంటిమెంట్.. విజయ్ గెలుపులో కీలకం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన ఘనవిజయం వెనుక సామాజిక సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చెన్నై మహానగరంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో విస్తరించి ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఈసారి విజయ్‌కు అండగా నిలిచిందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ పట్ల ఉన్న వీరాభిమానం, ఆయనతో విజయ్‌కు ఉన్న అంతర్గత స్నేహం వెరసి.. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా తమిళగ వెట్రి కజగం (TVK) వైపు మళ్లాయని ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల వైపు మొగ్గు చూపే ఈ వర్గం, ఈసారి జగన్ అభీష్టం మేరకు దళపతి వైపు నిలబడటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
క్షేత్రస్థాయిలో వైసీపీ సైన్యం..
ఈ ఎన్నికల్లో విజయ్ గెలుపు కోసం కేవలం స్థానిక క్యాడర్ మాత్రమే కాదు, సరిహద్దు ప్రాంతాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిశ్శబ్దంగా పనిచేశాయనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చెన్నై వంటి నగరాల్లో వైసీపీకి ఉన్న బలమైన నెట్‌వర్క్, జగన్ పట్ల ఉన్న సానుకూలతను విజయ్ గెలుపుకు అనుకూలంగా మలచడంలో కీలక పాత్ర పోషించాయి. అంతర్గతంగా జరిగిన ఈ సమన్వయం కారణంగానే, ఊహించని విధంగా పలు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు భారీ మెజారిటీలను సాధించగలిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే, విజయ్ సాధించిన ఈ విక్టరీ వెనుక జగన్ సైన్యం ఒక అదృశ్య శక్తిలా పనిచేసిందన్న వాదనలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
లీలా ప్యాలెస్ వేడుక..పొలిటికల్ మాస్టర్ ప్లానా?
ఈ రాజకీయ బంధానికి అసలైన పునాది ఫిబ్రవరి 2026లో చెన్నైలోని ప్రతిష్టాత్మక లీలా ప్యాలెస్‌లో పడిందని రాజకీయ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త వైఎస్ సునీల్ రెడ్డి తనయుడు సాహిల్ రెడ్డి వివాహ వేడుకకు విజయ్ స్వయంగా హాజరుకావడం అప్పట్లో ఒక సంచలనం. ఆ వేడుకలో జగన్ పక్కనే కూర్చుని, విజయ్ చర్చలు జరపడం కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదని, అది ఒక రహస్య రాజకీయ వ్యూహరచనకు వేదికైందని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఆనాడు కుదిరిన ఆ బాండింగ్ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ ప్రభంజనానికి, జగన్ బ్రదర్లీ అభినందనలకు దారితీసిందనే చర్చ జోరుగా సాగుతోంది.
వ్యాపార, సామాజిక శక్తుల ఏకీకరణ..
ఈ వివాహ వేడుక మరో కోణంలో కూడా విజయ్ రాజకీయ ప్రస్థానానికి మార్గం సుగమం చేసింది. సునీల్ రెడ్డి కుటుంబానికి, తమిళనాడులోని పారిశ్రామిక దిగ్గజమైన మురుగప్ప గ్రూప్‌కు వియ్యం కుదరడం (సాహిల్ రెడ్డి .. వేదికల వివాహం) ద్వారా ఆర్థికంగా, సామాజికంగా బలమైన శక్తులు విజయ్ వైపు మొగ్గు చూపేలా చేశాయి. రాజకీయాలకు ఆర్థిక అండదండలతో పాటు, క్షేత్రస్థాయిలో ఒక బలమైన సామాజిక వర్గ మద్దతు అవసరమైన తరుణంలో.. ఈ 'వైఎస్ బ్రాండ్' కనెక్షన్ విజయ్‌కు కొండంత అండగా నిలిచింది. పారిశ్రామిక శక్తుల నుంచి రెడ్డి సామాజిక వర్గ ఓట్ల వరకు అన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చేలా ఈ వివాహ వేడుక అప్రకటిత రాజకీయ వేదికగా మారిందని, అదే విజయ్‌ను ద్రవిడ కోటలో విజేతగా నిలిపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్..విజయ్ కాంబినేషన్ వెనుక మాస్టర్ ప్లాన్
వైఎస్ జగన్ తన ట్వీట్‌లో విజయ్‌ను డియర్ బ్రదర్ అని సంబోధించడం వెనుక కేవలం మర్యాదపూర్వకమైన శుభాకాంక్షలు మాత్రమే లేవని, దీని వెనుక భవిష్యత్తులో దక్షిణాదిలో ఒక బలమైన రాజకీయ కూటమిని ఏర్పరచుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత ఒంటరిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, వ్యవస్థను ఎదిరించి నిలిచిన జగన్ పోరాట శైలికి.. ఇప్పుడు విజయ్ అవలంబిస్తున్న తీరుకు చాలా దగ్గర సారూప్యతలు ఉన్నాయి. ఈ సింగిల్ వర్సెస్ సిస్టమ్ అనే భావజాలం ఇద్దరినీ ఏకం చేయడమే కాకుండా, దక్షిణాది రాజకీయాల్లో ఒక సరికొత్త జగన్..విజయ్ ప్రభంజనానికి నాంది పలికింది. యువ ఓటర్లను ఆకర్షించే సత్తా ఉన్న ఈ ఇద్దరు నాయకుల మధ్య కుదిరిన ఈ అంతర్గత బంధం, భవిష్యత్తులో పొరుగు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను శాసించే స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.
విజయ్ విజయ తీరాలకు చేర్చిన సైలెంట్ వేవ్
ఈ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే.. విజయ్ సాధించిన ఘనవిజయంలో రెడ్డి సామాజిక వర్గం , వైఎస్ జగన్ మద్దతు ఒక సైలెంట్ వేవ్ లా పనిచేసిందని అర్థమవుతోంది. తమిళనాడు జనాభాలో ఏడు శాతం వరకు ఈ సామాజిక వర్గం వారు ఉంటారని అచంనా. వీరు ఆర్థికంగా, పారిశ్రామికంగా బలపడిన వారు. రాజకీయాల్లో కూడా ఈ సామాజిక వర్గం ప్రభావం ఎంతగానో ఉంటుంది. జగన్ సంకేతాల మేరకు తమిళనాడులోని వైసీపీ ప్రభావిత ఓటర్లు, రెడ్డి సామాజిక వర్గ ప్రతినిధులు అంతర్గతంగా విజయ్ గెలుపు కోసం శ్రమించడం ఒక వ్యూహాత్మక విజయంగా చెప్పవచ్చు. తన ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో జగన్ పాటించే ధైర్యం, రాజీలేని పోరాట పటిమ విజయ్‌ను కూడా ఆకర్షించి ఉండవచ్చు. ఫలితంగా, ఇద్దరు రాజకీయ సోదరుల మధ్య కుదిరిన ఈ బాండింగ్.. తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను దాటుకుని సరికొత్త రాజకీయ గమ్యాన్ని ముద్దాడింది. ఈ వినూత్న సమీకరణం కేవలం ఒక ఎన్నికల గెలుపుతో ఆగిపోకుండా, ప్రాంతీయ పార్టీల ఏకీకరణకు ఒక దిక్సూచిగా నిలవబోతోందని స్పష్టమవుతోంది.
పొలిటికల్ బ్రదర్స్ కలయికపై ఉత్కంఠ
ద్రవిడ రాజకీయాల అజేయ కోటను బద్దలు కొట్టడంలో విజయ్ తనదైన శైలిలో దూసుకుపోగా, ఆయన వెనుక వైఎస్ జగన్ మద్దతు, రెడ్డి సామాజిక వర్గం అండదండలు ఉన్నాయనేది ఇప్పుడు తమిళ, తెలుగు రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత బలమైన వాదన. ఈ అదృశ్య హస్తం గురించి చర్చలు జరుగుతున్న వేళ, ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగనున్న విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంపైనే నెలకొంది. దశాబ్దాల రాజకీయ వ్యవస్థను ఎదిరించి నిలబడిన తన డియర్ బ్రదర్ విజయ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారా అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఒకవేళ జగన్ ఆ వేదికపై కనిపిస్తే, అది కేవలం ఇద్దరు మిత్రుల కలయిక మాత్రమే కాదు.. దక్షిణాది రాజకీయాల్లో ద్రవిడ ముద్రను దాటుకుని ఒక సరికొత్త యూత్ ఐకాన్ కూటమికి అధికారిక ప్రకటన కానుంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో జగన్ చేసిన అభినందనల ట్వీట్ వైరల్ అవుతుండటంతో, లీలా ప్యాలెస్ వేదికగా మొదలైన ఈ బాండింగ్ చెన్నై వేదికగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏ రకమైన కొత్త హంగులు అద్దబోతుందోనని యావత్ రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.
Next Story

