కేరళలో కమ్యూనిస్టులకు జై కొట్టిన కవిత!
x
కేరళలో కమ్యూనిస్టులను గెలిపించమన్న కవిత

కేరళలో కమ్యూనిస్టులకు జై కొట్టిన కవిత!

రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే, కాంగ్రెస్ ను ఓడించండి, లెఫ్ట్ ను గెలిపించండన్న కల్వకుంట్ల కవిత


కేరళలో వామపక్ష కూటమికే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జైకొట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ఏ మాట పట్టించుకోవద్దని కేరళ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నదల్లా చీటింగ్, లూటింగ్ (మోసం, దోపిడీ) మాత్రమేనని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె మంగళవారం విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఆ వీడియో ఏముందంటే...

"జై తెలంగాణ, జై కేరళ. ఎల్లా మలయాళం సహోదరమ్ ఎంతే వందనం. వచ్చే రెండు రోజుల్లో ఓటు వేయబోతున్న కేరళ ప్రజలకు తెలంగాణ బిడ్డగా నేను ఇస్తున్న సందేశం ఇది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను విస్మరించిందని నేను విన్నవించాలనుకుంటున్నా. వారు మాకు 6 గ్యారెంటీలు ఇచ్చారు. వాటిలో కేవలం అర గ్యారెంటీ మాత్రమే ఇప్పుడు అమలు అవుతోంది. ఆ అర గ్యారెంటీ కూడా కేవలం ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే. అది తప్ప తెలంగాణలో మరే ఇతర గ్యారెంటీని నెరవేర్చలేదు.
నేను తెలంగాణకు చెందిన వ్యక్తిని. నేను తెలంగాణలోనే నివసిస్తున్నాను. నేను త్వరలోనే తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నాను. తెలంగాణ బిడ్డగా నేను మీకు హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎలాగైతే మోసం చేసిందో, మిమ్మల్ని కూడా అలాగే మోసం చేయబోతోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ యువతను మోసం చేశారు. బోనస్ ఇవ్వకుండా తెలంగాణ రైతులను మోసం చేశారు. పెన్షన్లు పెంచకుండా తెలంగాణ వృద్ధులను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు కల్పించకుండా తెలంగాణ వెనుకబడిన వర్గాలను మోసం చేశారు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతి, మోసమే. కాంగ్రెస్ పార్టీ ఈవేళ తెలంగాణను తమ పార్టీకి ఏటీఎం (ATM) లా వాడుకుంటోంది. ఇప్పుడు కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి వసూలు చేసిన అవినీతి సొమ్మే కేరళలో కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి.
కాబట్టి కేరళ ప్రజలకు నా విన్నపం ఏమిటంటే, అక్కడ ఉదారవాద ఆలోచనలను బతికించండి, కేరళలో లెఫ్ట్ (Left) ఫ్రంట్ ను బతికించండి. సీపీఎం నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్ అద్భుతంగా పని చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాటలను నమ్మవద్దని నేను మీ అందరికీ విన్నవిస్తున్నా. రేవంత్ రెడ్డి వాదనలు, కేరళలో ఆయన చేస్తున్న ప్రచారమంతా అసత్యాలు, అబద్ధాలే.
దయచేసి లెఫ్ట్ పార్టీకి ఓటు వేయండి, విజయన్ ఫ్రంట్ కు ఓటు వేయండి. కేరళ ప్రజలకు తెలంగాణ బిడ్డ చేస్తున్న వినయపూర్వకమైన విన్నపం ఇది. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై కేరళ."
Read More
Next Story