ముగ్గురికి మూడు విమానాలా? ఇదెక్కడి పొదుపు?
x

ముగ్గురికి మూడు విమానాలా? ఇదెక్కడి పొదుపు?

ఈ దుబారా ఏంది బాబూ? అమరావతి నుంచే పొదుపు మొదలుపెట్టండి అంటూ మాజీ మంత్రి సాకె శైలజానాథ్ విమర్శలు గుప్పించారు.


రాష్ట్ర ఖజానా అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న విచ్చలవిడి ఖర్చులు సామాన్యుడిని విస్మయానికి గురిచేస్తున్నాయని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఈ దుబారా ఏంది బాబూ అంటూ సూటిగా ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం నిజంగా పొదుపు పాటించాలనుకుంటే ఆ మార్పు అమరావతి నుంచే మొదలవ్వాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు ప్రజలపై భారాలు మోపుతూ, మరోవైపు రాజధాని నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అద్దాలకు, ఆర్భాటాలకు తగలేస్తున్న తీరును విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతున్నా కూటమి సర్కార్ తీరు మారలేదని, విలాసాల కోసం కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాజెక్టుల పేరుతో సాగుతున్న ధనయజ్ఞంపై నిలదీసిన ఆయన, ప్రధాని మోదీ చెప్పిన పొదుపు సూత్రాలను చంద్రబాబు తన సొంత విమాన ప్రయాణాలు, ఆర్భాటపు ఈవెంట్ల నుంచే ప్రారంభించాలని హితవు పలికారు. రాజధాని ముసుగులో జరుగుతున్న ఈ దుబారాకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని శైలజానాథ్ హెచ్చరించారు.

ముగ్గురు నేతలు.. మూడు విమానాలు..ఇదెక్కడి పొదుపు?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు నిత్యం హైదరాబాద్‌కు విడివిడిగా మూడు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంపై శైలజానాథ్ మండిపడ్డారు. ముగ్గురూ ఒకే పనిపై వెళ్తున్నప్పుడు కలిసే వెళ్లొచ్చు కదా? మూడు విమానాలు, వాటి ఇంధనం, సిబ్బంది ఖర్చు ప్రజల సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణల్లో వీరికి ఉన్న క్యాంప్ ఆఫీసుల నిర్వహణ భారం రాష్ట్రంపై పడటం లేదా అని నిలదీశారు. ప్రధాని మోడీని కలిసినప్పుడు ఈ దుబారా గురించి ఆయన ఏమీ చెప్పలేదా అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సెక్రటేరియట్ కంటే 15 రెట్లు ఖరీదా?
అమరావతి రాజధాని నిర్మాణ వ్యయంపై శైలజానాథ్ సంచలన విమర్శలు చేశారు. ఇక్కడ ఒక్క సెక్రటేరియట్ కట్టే ఖర్చుతో తెలంగాణలో 15 సెక్రటేరియట్లు కట్టవచ్చని, అంతటి భారీ వ్యయం చేయడం వెనుక ఆంతర్యం ఏంటని అడిగారు. చదరపు అడుగుకు రూ. 20 వేల ఖర్చు చూస్తుంటే ఇది రాజధాని నిర్మాణమా లేక ధనయజ్ఞమా అనిపిస్తోంది. ఉన్న భవనాలనే వాడుకుంటే అప్పుల భారం తగ్గుతుంది కదా అని సూచించారు.
పింఛన్ పంపిణీకి పబ్లిసిటీ ఈవెంట్ అవసరమా?
ప్రతినెలా ఒకటో తేదీన ఇచ్చే పింఛన్ల పంపిణీ కోసం టీవీలు, పత్రికల్లో కోట్లాది రూపాయల ప్రకటనలు, భారీ హోర్డింగులు పెట్టడం వృథా ఖర్చు అని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు, కానీ పబ్లిసిటీ మాత్రం కొండంత చేస్తున్నారు అని విమర్శించారు. అలాగే వైయస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, లూథ్రా వంటి ఖరీదైన లాయర్లకు ఫీజులు చెల్లించడం కూడా దుబారా కిందికే వస్తుందని ఆయన ధ్వజమెత్తారు.
రాయలసీమకు వంద కోట్లు లేవు.. అద్దాలకు రూ. 2,540 కోట్లా?
రాయలసీమ ప్రాంతం సాగునీరు లేక ఎండిపోతుంటే, అమరావతి సెక్రటేరియట్‌కు అద్దాలు బిగించడానికి ఏకంగా రూ. 2,540 కోట్లు కేటాయించడం రాయలసీమ ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయి రైతులు కంటతడి పెడుతున్నారని, వంద కోట్లు ఇచ్చి వారిని ఆదుకోలేని ప్రభుత్వం, అమరావతిలో రోడ్ల కోసం కిలోమీటరుకు రూ. 50 కోట్లు ఎలా వెచ్చిస్తుందని ప్రశ్నించారు.
దుబారా తగ్గించుకోవాలనుకుంటే ఆచరణ సాధ్యం కాని అమరావతి ప్రాజెక్టుల కంటే, వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లడం రాష్ట్రానికి లాభదాయకమని శైలజానాథ్ స్పష్టం చేశారు. నేను, నా బినామీలు అనే ధోరణి వీడి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.
Read More
Next Story