ఇదేంటి బాలరాజు.. అప్పులైతే అక్రమాలు చేయాల్నా?
x

ఇదేంటి బాలరాజు.. అప్పులైతే అక్రమాలు చేయాల్నా?

పోలవరం ఎమ్మెల్యేకి జనసేన అధినేత పవన్ ‘4 వారాల’ అల్టిమేటం వెనుక అసలు కథ!


జనసేన పార్టీ అంతర్గత పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ, ఇన్నాళ్లూ పాలనపై పట్టు సాధించేందుకు సమయం కేటాయించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పార్టీని ‘సెట్‌రైట్’ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు ఆయన గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు పవన్ కళ్యాణ్ విధించిన '4 వారాల డెడ్‌లైన్' ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో "బాలరాజు రాజీనామా తప్పదా?" అనే చర్చ పోలవరం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
వన్-టు-వన్ భేటీ...
సాధారణంగా పార్టీ అధినేతలు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ, ఇటీవల ఎమ్మెల్యే బాలరాజుతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన వన్-టు-వన్ భేటీ ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. బాలరాజు చుట్టూ ముసురుతున్న వరుస వివాదాలపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. వాటన్నింటినీ సర్దుబాటు చేసుకోవడానికి కేవలం 4 వారాల సమయం (డెడ్‌లైన్) విధించడం కూటమి వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
బాలరాజును చుట్టుముట్టిన '3' వివాదాలు
పవన్ కళ్యాణ్ అంతలా సీరియస్ అవ్వడం వెనుక, బాలరాజు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడం వెనుక 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
1. రూ. 147 కోట్ల నిధులు - టెండర్ల రచ్చ
పోలవరం నియోజకవర్గంలోని పంచాయితీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 147 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అయితే క్షేత్రస్థాయిలో ఈ పనులు నత్తనడకన సాగుతుండటం ఒకెత్తయితే.. ఈ టెండర్ల కేటాయింపుల వెనుక అవినీతి, అక్రమాలు జరిగాయంటూ విపక్షాల నుంచి మాత్రమే కాకుండా సొంత పార్టీ (జనసేన) నుంచే ఆరోపణలు రావడం పవన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
2. ఫ్యామిలీ మ్యాటర్.. వ్యక్తిగత ఆరోపణలు
బాలరాజుకు కేవలం రాజకీయ, ఆర్థిక చిక్కులే కాకుండా, కుటుంబం నుంచి అంతకు మించిన తలపోటు ఉన్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఆయనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలు క్లీన్ ఇమేజ్ ఉన్న జనసేన పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని క్యాడర్ గుసగుసలాడుతోంది. పవన్‌తో జరిగిన భేటీలో ఈ 'ఫ్యామిలీ మ్యాటర్' పైనే గట్టిగా చర్చ జరిగిందని.. 4 వారాల్లోగా ఈ వ్యక్తిగత గొడవలను పూర్తిగా చక్కదిద్దుకోవాలని పవన్ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.
3. సీనియర్ల పక్కనబెట్టడం.. అధిష్టానానికి ఫిర్యాదులు
గత ఎన్నికల్లో బాలరాజు గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన సీనియర్ నాయకులను, ద్వితీయ శ్రేణి కేడర్‌ను ఆయన పక్కన పెట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న స్థానిక నేతలు.. ఎమ్మెల్యే వైఫల్యాలను సాక్ష్యాలతో సహా పార్టీ హెడ్ ఆఫీస్‌కు చేరవేస్తున్నారు. కేడర్‌ను కలుపుకుపోవడంలో బాలరాజు పూర్తిగా విఫలమయ్యారనేది అధిష్టానం నమ్ముతున్న గట్టి నిజాం.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పవన్ మార్క్ రిపేర్లు!
సవాల్‌తో కూడిన లక్ష్యం: త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానమైన పోలవరంలో క్లీన్‌స్వీప్ చేయాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి కీలక సమయంలో ఎమ్మెల్యే వివాదాల్లో ఉంటే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని పవన్ భావిస్తున్నారు.
ఎమ్మెల్యే బాలరాజుకు రాజీనామా తప్పదా?
ఇప్పుడు అందరి దృష్టి పవన్ ఇచ్చిన 4 వారాల డెడ్‌లైన్ పైనే ఉంది. ఈ లోగా బాలరాజు ముందు మూడు పెద్ద సవాళ్లు ఉన్నాయి.
కుటుంబ సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోవాలి.
రూ. 147 కోట్ల అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పరుగులు పెట్టించి అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టాలి.
అలకపాన్పున ఉన్న పార్టీ కేడర్‌ను ప్రసన్నం చేసుకుని యాక్టివేట్ చేయాలి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇచ్చిన గడువులోగా బాలరాజు తనపై వస్తున్న ఆరోపణలను క్లియర్ చేసుకోలేకపోతే, లేదా నియోజకవర్గంలో పరిస్థితి చక్కబడకపోతే.. పార్టీ ప్రతిష్ట కోసం ఆయన చేత రాజీనామా చేయించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
మరి సేనాని ఇచ్చిన ఈ ఆఖరి అవకాశాన్ని వాడుకుని బాలరాజు తనను తాను ప్రూవ్ చేసుకుంటారా? లేక పోలవరం జనసేనలో ఊహించని రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయా? అనేది రాబోయే నాలుగు వారాల్లో తేలిపోనుంది!
Read More
Next Story