
ఊహాత్మక చిత్రం
పవన్ ఎందుకు వెనకబడ్డారు? విజయ్ ఎందుకు గెలిచారు?
ఇద్దరు పవర్ స్టార్ల కథ. ఒకరు 'కింగ్', మరొకరు 'కింగ్ మేకర్'!
ఇద్దరూ సూపర్, పవర్ స్టార్లే.. ఇద్దరూ పార్టీలు పెట్టారు.. ఒకరు రెండేళ్లలో అధికారంలోకి వచ్చారు. మరొకరు పుష్కర కాలమైనా ఆ దరిదాపులకు రాలేదు. వారే ఒకరు విజయ్ మరొకరు పవన్ కల్యాణ్. ఒకరు తమిళనాడు మరొకరు ఆంధ్రప్రదేశ్. ఇద్దరూ లక్షలాది యువతను ఓలలాడించిన వారే. సొంత పార్టీలు స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. కానీ, వారి ప్రయాణాలు మాత్రం భిన్న దిశల్లో సాగాయి.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన TVK పార్టీతో అద్భుతం సృష్టించాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఇప్పటికీ తీవ్ర చర్చనీయాంశంగానే ఉంది. ఒకరు రెండేళ్లలోనే అధికారం వైపు అడుగులు వేస్తే, మరొకరు 12 ఏళ్లు దాటినా ‘కింగ్‌మేకర్’ పాత్రకే పరిమితం అయ్యారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కథ కాదు- రాజకీయ వ్యూహాలు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు, సమయస్ఫూర్తి మధ్య జరిగే పోరాటం.
విజయ్ వ్యూహం: రాజ్యాధికారం..
విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కటే సందేశం ఇచ్చాడు- “నన్ను గెలిపించండి, నేను మీకు నాయకత్వం వహిస్తాను.” ఎవరి మద్దతు కోసం ఆగలేదు. ఎవరికీ సపోర్ట్ అడగలేదు. తనను తాను స్పష్టమైన ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రకటించుకున్నారు. ప్రస్తుత జెన్-జీ యువత, మిలెనియల్స్, మధ్య తరగతిని నేరుగా ఆకట్టుకున్నారు. జనాకర్షక పథకాలతో మహిళలతో సహా అన్ని వర్గాల తన వైపు ఆకర్షించాడు. ఫలితం- TVK రెండేళ్లలోనే అతి పెద్ద శక్తిగా అవతరించి, తమిళనాడు రాజకీయ యవనికపై తన పేజీని లిఖించుకున్నారు. కొత్త శకానికి శ్రీకారం చుట్టారు.
పవన్ కళ్యాణ్ మార్గం: సామాజిక మార్పు
2014లో జనసేన ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ కి విజయ్ కంటే ఎక్కువ హైప్, క్రేజ్ ఉంది. భారీ సభలు, అపారమైన జన సమ్మోహనం చూసి అందరూ ఆయనా త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని భావించారు.
కానీ పవన్ స్పష్టంగా చెప్పారు..
“నా ఆలోచనా విధానంతో 100 మంది నాయకులు సిద్ధమైతే మార్పు తెస్తాను.”
అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేయడం లేదని, సామాజిక మార్పు, ప్రజా చైతన్యం తన ప్రధాన ధ్యేయమని పదే పదే ప్రకటించారు.
-2014లో కులాల ఐక్యత కోసం TDPకు మద్దతిచ్చారు.
-2019లో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు.
-2024లో మళ్లీ చంద్రబాబుకు మద్దతిచ్చి “నేను కింగ్‌మేకర్” అని బ్రాండ్ చేసుకున్నారు.
ఇక్కడే ప్రధాన వ్యత్యాసం కనిపించింది. ఒక సూపర్‌స్టార్ తనను తాను “ప్రెజర్ గ్రూప్” లేదా “కింగ్‌మేకర్”గా ప్రకటించుకోవడం వల్ల ప్రజల మనసులో ఆయనపై ఒక డిపెండెన్సీ ఇమేజ్ ఏర్పడింది.
రెండు వ్యూహాల మధ్య ప్రధాన తేడా ఏంటంటే..
విజయ్- అధికారమే లక్ష్యంగా చేసుకున్నాడు.
పవన్- సామాజిక మార్పును లక్ష్యంగా చేసుకున్నారు.
ఒకరు త్వరగా ఫలితాలు చూపించాలని చూస్తే, మరొకరు దీర్ఘకాలికంగా ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఒకరు జనాకర్షక పథకాలతో ముందుకెళ్తే, మరొకరు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై దృష్టి సారించారు.
విజయ్ తనను తాను ముఖ్యమంత్రిగా ప్రెజెంట్ చేసుకుంటే, పవన్ మాత్రం ‘మార్పు తెచ్చే నాయకుడు’గా మాత్రమే కనిపించారంటున్నారు జనసేన పార్టీ నాయకులు.
పవన్ కోల్పోయిన అవకాశం
2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో స్వతంత్ర, శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే అపూర్వ అవకాశం ఉంది. ఆ సమయంలో ఆయన పాపులారిటీ విజయ్ కంటే తక్కువేమీ కాదు. కానీ పదేపదే ఇతరులకు మద్దతు, పొత్తులు, కింగ్‌మేకర్ ఇమేజ్ ఆయన సొంత రాజకీయ శక్తిని కుంచించివేసింది. చివరకు ఆయన్ను కొన్ని వర్గాలు- తన సొంత సామాజిక వర్గ నాయకుడనే ఇమేజ్ కు కుదించేశాయి.
రాజకీయాల్లో అధికారం ఒక లక్ష్యం. కానీ అది ఏకైక లక్ష్యం కాకపోవచ్చు. విజయ్ అధికారం వైపు వేగంగా పయనించాడు. పవన్ మాత్రం అధికారం కంటే ముందు సమాజంలో మార్పు రావాలని నమ్ముతున్నారని ఆ పార్టీ నాయకుడు గుండా రామకృష్ణ.
ప్రశ్న ఇక్కడ ఉంది.. అధికారం సాధించడం ద్వారా మార్పు వస్తుందా? లేదా సమాజంలో మార్పు ద్వారా అధికారం వస్తుందా? ఏ లక్ష్యాన్ని సాధించడం వల్ల ప్రజలకు ఎక్కువ మేలు చేయగలుగుతామనేది వారి వారి లక్ష్యాలు, ఉద్దేశాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు కమ్యూనిస్టు పార్టీలు వందేళ్లుగా చేయలేని పనిని ఓ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ 8 ఏళ్లలో చేశారు. ఇలా, ఏ పార్టీ అయినా తమకున్న లక్ష్యాలను బట్టి ముందుకు సాగుతుంది.
పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ఆయన విజయం లేదా వైఫల్యం కేవలం ఎన్నికల ఫలితాలతో కాకుండా, ఆయన కోరుకున్న సామాజిక మార్పు ఎంతవరకు సాధ్యమైందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
సూపర్‌స్టార్ పవర్ ఉంటే చాలదు- ఆ పవర్‌ను ఏ దిశలో, ఏ వ్యూహంతో, ఏ లక్ష్యంతో వినియోగిస్తారనేదే చివరికి చరిత్ర నిర్ణయిస్తుంది.
Next Story

