
ఆంధ్ర విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య
లోక్ సభలో మంటలు రేపిన వ్యాఖ్య, కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ
పార్లమెంటులో జరిగిన డిలిమిటేషన్ బిల్లు చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వాఖ్యలు తెలంగాణ ఉద్యమకారులను, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్, బిఆర్ఎస్ మండిపడుతున్నాయి.
తేజస్వీ సూర్య ఏమన్నారంటే..
భారత్-పాక్ విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను పోల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఏపీలుగా విభజించిన తీరును ఆయన భారతదేశ విభజన (Partition of India) తో పోల్చారు. "కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరు.. గతంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని భారత్-పాక్‌లుగా విడగొట్టిన దానికంటే దారుణంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
కేటీఆర్ ఖండన.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను "మూర్ఖత్వంతో కూడినవి" అని కెటిఆర్ కొట్టిపారేశారు. తెలంగాణ ఏర్పాటు అనేది దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటం, వేలాది మంది యువకుల త్యాగాల ఫలితమే తప్ప ఎవరి భిక్ష కాదని స్పష్టం చేశారు. ఒక పవిత్రమైన ఉద్యమాన్ని రక్తసిక్తమైన దేశ విభజనతో పోల్చడం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని అన్నారు.
కాంగ్రెస్ (పొన్నం ప్రభాకర్): మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. పార్లమెంటులో తేజస్వీ సూర్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి, డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయన్న ఆందోళనల మధ్య ఈ 'విభజన' వ్యాఖ్యలు ప్రాంతీయ సెంటిమెంట్‌ను మరింతగా రాజేశాయి.
ఆ తర్వాత పార్లమెంటులో ప్రసంగించిన కడియం కావ్య కూడా సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ సూర్య తప్పుగా మాట్లాడితే ఉపసంహరించుకుంటామన్నారు. సూర్య కూడా మాట్లాడుతూ.. తనకు తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహన ఉందని, తన మాటల్ని తప్పుగా వ్యాఖ్యానించారని వివరించారు. కాంగ్రెస్ సభ్యులు వాళ్ల వ్యాఖ్యల్ని తప్పుబడుతూ సభలో వివాదానికి దిగారు. మల్లు రవి మాట్లాడుతూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద తెలంగాణ అంశం ఇవాళ లోక్ సభలో పెద్ద వివాదాస్పద అంశమైంది.
తెలంగాణ ఏర్పాటును ఇండియా- పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానించారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఇండియా-పాక్ విభజన లాంటిదైతే బీజేపీ ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దశాబ్దాల పోరాట ప్రతిఫలం. వేలాది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం. మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అవమానించడమే. తేజస్వి వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం వైఖరి ఏంటో చెప్పాలి. ప్రధాని కూడా ఎన్నోసార్లు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మారు. BJP, కాంగ్రెస్ ఎంపీలు గుడ్లప్పగించి చూడటం సిగ్గుచేటు’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Next Story

