
డీలిమిటేషన్ బిల్లులకు జైకొట్టిన టీడీపీ, వైసీపీ
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు సభ్యులు చేసిన వాదనను తోసిరాజని ఏపీలోని మూడు పార్టీలు కేంద్రం బిల్లులకు జై కొట్టాయి.
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన), మహిళా రిజర్వేషన్ బిల్లులపై శుక్రవారం జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు ఐక్యరాగం వినిపించాయి. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP), జనసేన పార్టీలు కేంద్రం తెచ్చిన బిల్లులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగకూడదు: మిథున్ రెడ్డి
వైసీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బిల్లులను సమర్థిస్తూనే, రాష్ట్రానికి సంబంధించిన కీలక డిమాండ్లను కేంద్రం ముందుంచారు.
ప్రాంతీయ అసమానతలు: డీలిమిటేషన్ ప్రక్రియ శాస్త్రీయంగా జరగాలని, ఎక్కడా ప్రాంతీయ అసమానతలు తలెత్తకూడదని కోరారు. ఈ ప్రక్రియ విపక్షాలను అణగదొక్కే రాజకీయ సాధనంగా మారకూడదని హెచ్చరించారు.
మహిళా భద్రత & రిజర్వేషన్: "వైసీపీ హయాంలో ఏపీలో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మహిళలను వేధిస్తూ దొరికిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా అంశం: డీలిమిటేషన్ చర్చలో మిథున్ రెడ్డి 'ప్రత్యేక హోదా' అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన ఈ హామీని చట్టంలో లేదనే సాకుతో మర్చిపోవడం సరికాదని, ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు.
2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా బిల్లులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
జనాభా స్థిరీకరణ: ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధిని విజయవంతంగా నియంత్రించిందని, అలాగే విభజన తర్వాత భారీగా వలసలు జరిగాయని ఆయన గుర్తు చేశారు.
సీట్ల పెంపు ఫార్ములా: "ఒకవేళ 2026 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే ఏపీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ హోంమంత్రి చెప్పినట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం, అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% సీట్లు పెంచే ఫార్ములాను అమలు చేస్తే ఏపీకి లబ్ధి చేకూరుతుంది" అని విశ్లేషించారు. అందుకే ఈ బిల్లులను టీడీపీ సమర్థిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
లోక్‌సభలో ఏపీకి ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉండటంతో, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతు తెలపడం విశేషం. జాతీయ రాజకీయాల్లో దక్షిణాది ప్రాధాన్యత తగ్గకుండా చూస్తామన్న కేంద్ర హామీపై తెలుగు పార్టీలు నమ్మకం వ్యక్తం చేశాయి.
Next Story

