
టీడీపీ రాజు లోకేష్, రారాజు దేవాన్ష్?
పార్టీ కమిటీల్లో ’వారసత్వ‘ ముద్ర..రగిలిపోతున్న సీనియర్లు.
తెలుగుదేశం పార్టీలో బుధవారం ప్రకటించిన నూతన కమిటీల కూర్పు ఒక సంచలన మార్పుకు నాంది పలికింది. పార్టీ పగ్గాలు ఇకపై పూర్తిగా వారసుడి చేతుల్లోనే ఉంటాయని, పసుపు కోటలో లోకేష్ రాజ్యాంగమే శాసనమని ఈ నియామకాలు విస్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు వారసుడు దేవాన్ష్ వరకు ఎదురులేకుండా సాగాలన్న వ్యూహంతోనే ఈ కమిటీలను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. అయితే, దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం ధారపోసిన సీనియర్ నేతలను కేవలం నామమాత్రపు పదవులకే పరిమితం చేస్తూ, లోకేష్ మార్క్ టీమ్‌కు పట్టాభిషేకం చేయడం ఇప్పుడు టీడీపీలో అంతర్గత ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వారసత్వ ముద్ర పాత తరం నేతలకు మింగుడుపడకపోయినా, అధిష్టానం మాత్రం తన పంథాను మార్చుకోకపోవడం గమనార్హం.
వారసుడికి క్లియర్ లైన్
ఊహించినట్లుగానే, ఆశించిన రీతిలోనే తెలుగుదేశం పార్టీ పగ్గాలను నారా లోకేష్‌కు అప్పగించే దిశగా చంద్రబాబు కీలక అడుగు వేశారు. లోకేష్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా, పార్టీలో ఆయన మాటే ఇక సుప్రీం అని విస్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇది కేవలం పదవి ఇవ్వడం మాత్రమే కాదు, పసుపు దళంపై లోకేష్ ముద్రను శాశ్వతం చేస్తూ, భవిష్యత్తు నాయకత్వానికి చంద్రబాబు పూర్తిస్థాయిలో రెడ్ కార్పెట్ పరిచినట్లు కనిపిస్తోంది.
లోకేష్ కోటరీకి పట్టాభిషేకం
ఈ కమిటీల కూర్పులో లోకేష్‌కు అత్యున్నత పదవి దక్కడం ఒక ఎత్తయితే, ఆయన వ్యక్తిగత, ఆయనకు నిత్యం నీడలా ఉంటూ రాజకీయ వ్యవహారాలను తెరవెనుక ఉండి నడిపించే కోటరీకి అగ్రతాంబూలం దక్కడం మరో ఎత్తు. లోకేష్ నీడలా ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబెట్టే, టీడీపీలో ఏ మాత్రం అనుభవం లేని కిలారి రాజేష్‌కు ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం పార్టీ వర్గాలను, ఆ పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి కష్టపడి పని చేస్తున్న శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. అటు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన సానా సతీష్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించడం ద్వారా, పార్టీ మొత్తం ఇకపై లోకేష్ టీమ్ కనుసన్నల్లోనే నడవాలన్న వ్యూహం ఈ కూర్పులో అడుగడుగునా కనిపిస్తోంది.
ప్రశ్నార్థకంగా మారిన సీనియర్ల ప్రాధాన్యత
ఈ నియామకాల ద్వారా చంద్రబాబు పార్టీలో ఒక సరికొత్త తరానికి పునాది వేశారు. అయితే, లోకేష్ సన్నిహితులకు కీలక పదవులు కట్టబెట్టడం వల్ల, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారు ప్రాధాన్యత కోల్పోతున్నారన్న చర్చ మొదలైంది. పార్టీ నిర్వహణ నుండి విధాన నిర్ణయాల వరకు అంతా టీమ్ లోకేష్ చేతుల్లోకి వెళ్లడంతో, సీనియర్లు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
టీడీపీ నూతన కమిటీల కూర్పు వెనుక చంద్రబాబు మార్క్ రాజకీయ చదరంగం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కమిటీల ద్వారా ఆయన ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు లోకేశ్ టీమ్‌ను పటిష్టం చేస్తూనే, మరోవైపు మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న సీనియర్ నేతలకు పార్టీ పదవుల ముసుగులో చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో పదవులు ఇచ్చాం కాబట్టి, ఇక మంత్రి పదవుల గురించి ఆశలు వదులుకోవాలన్న సంకేతాన్ని అధిష్టానం సున్నితంగా పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
సోమిరెడ్డికి షాక్.. ఉద్ధండుల ప్రభావాన్ని తగ్గించే స్కెచ్
ఈ వ్యూహంలో భాగంగానే, గతంలో పొలిట్‌బ్యూరోలో కీలక పాత్ర పోషించి, పార్టీ విధాన నిర్ణయాల్లో చక్రం తిప్పిన సీనియర్లలో ఒకరైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని కేవలం ఒక అధికార ప్రతినిధి స్థాయికి పరిమితం చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. అలాగే మరి కొంత మంది సీనియర్ నాయకులు బొండా ఉమా, కన్నా లక్ష్మీనారాయణ, కళా వెంకట్రావు, కూన రవి కుమార్ వంటి ఉద్ధండులకు సైతం ప్రాధాన్యత లేని పదవులను అప్పగించారు. ఈ నేతలందరూ మంత్రి పదవులను బలంగా ఆశిస్తున్న వారు కావడంతో, పార్టీ పదవుల పేరుతో వారి రాజకీయ ప్రభావాన్ని తగ్గించి, మంత్రివర్గ రేసు నుంచి వారిని చాకచక్యంగా తప్పించారనే వాదనకు బలం చేకూరుతోంది.
నైరాశ్యంలో పాత తరం నేతలు
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడి, గెలుపులో కీలక పాత్ర పోషించిన సీనియర్లకు సముచిత స్థానం దక్కుతుందని భావిస్తే, తీరా పదవుల పంపకంలో వారికి మొండిచేయి ఎదురైంది. జూనియర్లు, లోకేశ్ సన్నిహితులు జాతీయ స్థాయి పదవుల్లో మెరుస్తుంటే, దశాబ్దాల అనుభవం ఉన్న తమను నామమాత్రపు హోదాలకే పరిమితం చేయడంపై సీనియర్ నేతలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పదవులతో సరిపెట్టి..పక్కన పెట్టేసి
ప్రభుత్వంలో కీలకమైన ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న భారీ ఆశావహుల జాబితాకు పార్టీ కమిటీల రూపంలో చంద్రబాబు ఒక తాత్కాలిక ఉపశమనం ఇచ్చారు. కానీ, లోతుగా పరిశీలిస్తే ఇది ఉపశమనం కంటే పక్కన పెట్టడమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, కంభంపాటి రామ్మోహనరావు, పీతల సుజాత, చింతకాయల విజయ్ వంటి ఎంతో మంది టీడీపీ కోసమే బతుకుతున్న నాయకులను కేవలం కార్యవర్గ సభ్యత్వాల దగ్గరే నిలిపివేయడం గమనార్హం. అధికారం వచ్చాక కీలక పదవుల్లో ఉంటామని భావించిన వీరికి, ఈ కమిటీ నియామకాలు ఒక రకమైన రాజకీయ విరామంగా మారాయన్న చర్చ మొదలైంది.
విస్మయానికి గురిచేసిన ప్రమోషన్
పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వారిని కాదని, అనూహ్యంగా కొత్త ముఖాలకు పెద్దపీట వేయడం పాత తరం నేతలను విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వివాదాస్పద ఘటనల ద్వారా వార్తల్లో నిలిచిన పిడుగురాళ్ల మాధవికి నేరుగా పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి ఘటనలో ఆమె ప్రదర్శించిన దూకుడే ఈ ప్రమోషన్‌కు కారణమని ప్రచారం జరుగుతోంది. కానీ, నిబద్ధతతో పార్టీని నమ్ముకున్న సీనియర్లను కార్యవర్గ సభ్యత్వాలకే పరిమితం చేసి, ఇలాంటి ఆవేశపూరిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ అంతర్గత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పాత తరం వర్సెస్ కొత్త శకం
మొత్తానికి, పాత తరం నేతల అనుభవాన్ని గౌరవించడం కంటే, ప్రస్తుతం లోకేష్ టీమ్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఈ నియామకాలు స్పష్టం చేస్తున్నాయి. జెండా మోసిన వాడికే అండగా ఉంటాం అన్న నినాదం ఇప్పుడు కేవలం ప్రకటనలకే పరిమితమైందా? అన్న సందేహం సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవుల రేసు నుంచి ఇలా తెలివిగా తప్పించడంపై లోపల రగిలిపోతున్న నేతలు, రాబోయే రోజుల్లో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
వారసత్వమే పరమావధిగా..
మొత్తానికి 29 మంది పొలిట్‌బ్యూరో, 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల నియామకంలో కష్టపడి పనిచేసిన క్యాడర్ కంటే, లోకేష్‌కు విధేయులుగా ఉండేవారికే పెద్దపీట వేశారు. భవిష్యత్తులో దేవాన్ష్ కాలం నాటికి పార్టీని లోకేష్ సన్నిహితుల గుప్పెట్లో ఉండేలా ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నారని, అందుకే సీనియర్లను మెల్లగా మార్గదర్శక మండలి వైపు మళ్లిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారసత్వ పోకడలు రాబోయే రోజుల్లో పార్టీలో ఎలాంటి విబేధాలకు దారితీస్తాయో వేచి చూడాలి.
Next Story

