మీవాడంటే మీవాడు?
x

మీవాడంటే మీవాడు?

రావణ్ అరెస్ట్‌పై టీడీపీ, వైసీపీల పొలిటికల్ బ్లేమ్ గేమ్


యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని కుల, మత సమీకరణాలకు దారితీసింది. ఈ వివాదంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రమైన బ్లేమ్ గేమ్ మొదలైంది. ఒకవైపు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ వ్యవహారం వెనుక పూర్తిగా వైసీపీ హస్తం ఉందని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఆ పార్టీ పెద్దలు రావణ్‌ను వెనకుండి నడిపించారని ఆరోపించారు. మరోవైపు, వైసీపీ మాజీ మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఈ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. రావణ్ అసలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని, అతను గతంలో ఎప్పుడూ చంద్రబాబు లేదా లోకేష్‌లను విమర్శించలేదని, అతని వెనుక ఉన్నది పక్కాగా టీడీపీనే అని వారు రివర్స్ ఎటాక్ చేశారు. అంతేకాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక కమ్మ సామాజికవర్గ వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్‌గా చిత్రీకరించేందుకు టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా కుట్రలు పన్నాయని మండిపడ్డారు.



ఏపీలో ప్రస్తుతం ఈ రాజకీయ బురదజల్లుడు మమూలుగా మరిపోయింది. భారతీయ సంస్కృతిని, హిందూత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ప్రశ్న రావణ్‌ను సమర్థించడం ఎంతమాత్రం సరికాదని, అది హిందూత్వంపై జరిగే దాడిగానే భావించాల్సి ఉంటుందని మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇలాంటి విద్వేషాలు నింపే వారిని వెలివేయాలని పిలుపునిస్తూ, అతని వెనుక ఎవరున్నారో ఆలోచించాలంటూ ట్వీట్ చేశారు. అయితే, రాజకీయ పార్టీలన్నీ ఈ అరెస్ట్ ఎపిసోడ్‌ను వాడుకుంటూ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న తరుణంలో, ప్రశ్న రావణ్ భార్య ఇది వరకే అసలు క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఏ పార్టీ అజెండా కోసమో ఆయన పని చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం సమాజంలో ఉన్న సమస్యలపై మాత్రమే ఆయన ప్రశ్నిస్తున్నారని, తమ పొలిటికల్ మైలేజ్ కోసం తమ కుటుంబానికి రాజకీయ రంగులు పూయవద్దని ఆమె నెత్తీనోరూ బాదుకున్నారు. ఒకవైపు భర్త ఏ పార్టీ వాడు కాదని భార్య బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ... ఇరు పార్టీల నేతలు మాత్రం రావణ్ మీవాడంటే మీవాడు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
Read More
Next Story