కేరళ సీఎం రేసులో కాంగ్రెస్‌లో హీట్..
x

కేరళ సీఎం రేసులో కాంగ్రెస్‌లో హీట్..

సతీసన్, వేణుగోపాల్, చెన్నితాల మధ్య తీవ్ర పోటీ


Click the Play button to hear this message in audio format

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ లోపల నాయకత్వ చర్చలు వేడెక్కుతున్న వేళ, వీడీ సతీసన్‌కు మద్దతుగా ఆయన అనుచరులు బహిరంగంగా ర్యాలీలు నిర్వహించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

సతీసన్‌కు మద్దతుగా ర్యాలీలు..

వీడీ సతీసన్‌ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూర్‌లో భారీ ప్రదర్శన చేపట్టారు. నెట్టూర్ సతీసన్ స్వస్థలం కావడంతో అక్కడ ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడగట్టారు.

“ఎన్నికల పోరాటానికి నాయకత్వం వహించిన వారే రాష్ట్రాన్ని పాలించాలి” అనే నినాదాలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సతీసన్ కీలక పాత్ర పోషించారని, యూడీఎఫ్ విజయానికి ఆయనే ప్రధాన కారణమని మద్దతుదారులు చెబుతున్నారు. కొచ్చి సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించేందుకు ఆయన అనుచరులు సిద్ధమవుతున్నారు.

సీఎల్పీ సమావేశంలో హైడ్రామా..

ఇదే సమయంలో తిరువనంతపురంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరిగింది. ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ కొత్తగా ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించారు. శాసనసభాపక్ష నాయకుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు.

సీఎం రేసులో ముగ్గురు ప్రధాన నేతలు

ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 1. వీడీ సతీసన్ - గత ఐదేళ్లుగా అసెంబ్లీలో యూడీఎఫ్‌కు నాయకత్వం వహించారు. ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని దూకుడుగా నడిపించి పార్టీకి విజయాన్ని అందించారని అనుచరులు చెబుతున్నారు.

2. కేసీ వేణుగోపాల్ - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, అనేక మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

3. రమేష్ చెన్నితాల - సీనియర్ కాంగ్రెస్ నేతగా, దీర్ఘకాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా చెన్నితాల కూడా పోటీలో కొనసాగుతున్నారు. పార్టీ వ్యవస్థపై ఆయనకు మంచి పట్టు ఉందని మద్దతుదారులు చెబుతున్నారు.

యూడీఎఫ్ ఘన విజయం..

140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ ఒక్కటే 63 స్థానాలు సాధించింది. అయితే ఇంతటి మెజారిటీ వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి ఎంపికలో పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి.

పార్టీ లోపల పెరుగుతున్న ఉద్రిక్తత..

సీఎం ఎంపికపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా టెన్షన్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సతీసన్ రాజకీయ వ్యూహం, ప్రచార శైలి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఒక వర్గం భావిస్తుండగా, జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉన్న వేణుగోపాల్‌కు కూడా గట్టి మద్దతు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక చెన్నితాల అనుభవాన్ని కూడా కొందరు ఎమ్మెల్యేలు ప్రధానంగా పరిగణిస్తున్నారు.

తుది నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే..

కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన తర్వాత, సీఎం ఎంపికపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకోనుంది. దీంతో కేరళ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ నాయకత్వంపైనే కేంద్రీకృతమైంది.

Read More
Next Story