
జనసేనలో స్థానిక కలకలం..
క్షేత్రస్థాయిలో జనసేన మార్క్ వ్యూహం ఏంటి?
కూటమి ప్రయోజనాలే జనసేన ప్రయోజనాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పొత్తులతోనే ముందుకెళ్తామన్న ఆయన వ్యాఖ్యలు జనసేన పార్టీలో అంతర్గత అసంతృప్తికి దారితీశాయి. గత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే జనసేన ఒక అడుగు వెనక్కి వేసిందని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు కూడా దాదాపు అదే స్వరంతో క్షేత్రస్థాయి ఎన్నికలకూ ఇదే సూత్రం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి సమావేశంలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని, ప్రతి పార్టీకి కేటాయించే స్థానాలు అక్కడి స్థానిక పరిస్థితులు, బలాబలాలపై ఆధారపడి ఉంటాయని చెబుతూనే, కూటమిని బలోపేతం చేయడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు.
అయితే, అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం జనసేనలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వంలో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఎన్నో ఏళ్లుగా సొంత డబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ, పార్టీ జెండా మోసి క్షేత్రస్థాయిలో పార్టీని బతికించిన తమకు.. అధికారం వచ్చాక కనీసం చిన్నపాటి పదవులు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా దక్కకపోవడంపై కిందిస్థాయి నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధపడ్డామని, కనీసం ఈ స్థానిక పోరులోనైనా తమకు న్యాయం జరగకపోతే రాజకీయ భవిష్యత్తు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌లో పెరుగుతున్న అసహనాన్ని, ఆందోళనలను గమనించిన జనసేన పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి కీలక స్పష్టతనిచ్చింది. సార్వత్రిక ఎన్నికల నాటి సీట్ల పంపకాల ఫార్ములాను.. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తింపజేయలేమని పార్టీ స్పష్టం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన 80-15-5 వంటి నిష్పత్తి ఫార్ములాను ఇక్కడ కూడా వర్తింపజేస్తామని అనుకోవడం పొరపాటని, స్థానిక సంస్థల ఎన్నికల విధానం, వ్యూహాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని అధిష్ఠానం కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి క్షేత్రస్థాయి స్థానంలోనూ రాజీ పడకుండా కచ్చితంగా పోటీ చేస్తుందని పార్టీ తేల్చిచెప్పింది. ఒకవైపు కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు పార్టీ ఉనికి దెబ్బతినకుండా బలంగా ఉన్న అన్ని స్థానాల్లో గట్టిగా పట్టుబట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరి అధిష్ఠానం ఇచ్చిన ఈ తాజా స్పష్టతతో ద్వితీయ శ్రేణి నాయకులు శాంతిస్తారా? లేదా క్షేత్రస్థాయిలో ఈ సీట్ల సర్దుబాటు కూటమి పార్టీల మధ్య మరిన్ని సవాళ్లకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.
Next Story

