బీజేపీకి ఎదురుదెబ్బ: పార్లమెంట్ ఓటింగ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు..
x

బీజేపీకి ఎదురుదెబ్బ: పార్లమెంట్ ఓటింగ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు..

డీలిమిటేషన్ బిల్లు ఓటమిని ప్రతిపక్ష విజయం అని పేరొన్న తమిళనాడు సీఎం..


Click the Play button to hear this message in audio format

పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లును ఓడించినందుకు ప్రతిపక్ష ఎంపీలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రశంసించారు. శనివారం (ఏప్రిల్ 18) ఆయన ఈ ఫలితాన్ని “విజయం”గా అభివర్ణించారు. ఈ విజయానికి ప్రతిపక్ష ఐక్యతే కారణమని స్పష్టం చేశారు. ఈ బిల్లు రాష్ట్రానికి మద్దతు ఇచ్చేవారు ఎవరు? ద్రోహం చేసినవారు? ఎవరు అన్నది బయటపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.

“ఈ డీలిమిటేషన్ బిల్లు మన మిత్రులు ఎవరు అనే విషయాన్ని మాత్రమే బయటపెట్టలేదు. తమిళనాడు ద్రోహులు ఎవరో కూడా బట్టబయలు చేసింది. వచ్చే ఎన్నికలకు ముందే ఆ ద్రోహం ఘోర పరాజయాన్ని చవిచూసింది,” అని స్టాలిన్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.

ఈ విషయంలో గట్టి వైఖరి తీసుకున్నందుకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షం ఐక్యంగా నిలబడటమే ఈ ఫలితానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

2029 నాటికి శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం, అలాగే లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచడం లక్ష్యంగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్‌సభలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుతో పాటు తీసుకొచ్చిన ఇతర బిల్లులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

స్టాలిన్ ఈ బిల్లును “నల్ల చట్టం”గా అభివర్ణిస్తూ, దీని వ్యతిరేకంగా తమ పోరాటం విజయవంతమైందని అన్నారు. “నేను ఈ రోజు మీ ముందు పూర్తి ఆనందంతో, నూతన శక్తితో నిలబడి ఉన్నాను. డీలిమిటేషన్ బిల్లు, ఆ నల్ల చట్టానికి వ్యతిరేకంగా మా పోరాటం విజయవంతమైంది,” అని ఆయన వీడియో సందేశంలో తెలిపారు.

ప్రతిపాదిత చట్టాన్ని రాజకీయ ఎత్తుగడగా పేర్కొన్న స్టాలిన్, “నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో ఈ బిల్లును తీసుకువచ్చారు. కానీ పార్లమెంటులో ప్రతిపక్షం దీనిని నిర్ణయాత్మకంగా తిరస్కరించింది,” అని అన్నారు.

“మహిళా రిజర్వేషన్ల ముసుగులో బీజేపీ ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. కానీ మహిళలే స్వయంగా ప్రతిఘటనకు నాయకత్వం వహించి, దానిని విజయవంతంగా ఓడించారు. వారికి నేను వందనం చేస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిణామాన్ని స్టాలిన్ ఒక కీలక మలుపుగా అభివర్ణించారు. “మనల్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించి ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టాలనుకున్న వారికి ఇది గట్టి చెంపదెబ్బ. గత 12 ఏళ్లలో తొలిసారిగా మోదీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ బిల్లులో ఓటమిని చవిచూసింది,” అని ఆయన అన్నారు.

ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో బీజేపీకి మరిన్ని రాజకీయ ఎదురుదెబ్బలు తగలవచ్చని స్టాలిన్ హెచ్చరించారు. “ఇది ఆరంభం మాత్రమే. దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుర్కోబోయే పరాజయాలకు ఇది ఆరంభం. ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ఇది ఆరంభం,” అని ఆయన అన్నారు.

డీఎంకే గత పోరాట చరిత్రను గుర్తుచేస్తూ, పార్టీ మళ్లీ పాత దృఢత్వంతో ముందుకు సాగుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు. “మనం 1950, 60వ దశకాల నాటి డీఎంకేను మళ్లీ చూడాల్సి రావచ్చు. ఈ రోజు నేను చూపించాను—డీఎంకే అంటే ఇదే,” అని అన్నారు.

అయితే పోరాటం ఇక్కడితో ముగియలేదని ఆయన హెచ్చరించారు. “ఈ రోజు మనం సాధించింది సగం విజయమే. 2001లో చేసినట్లే, వచ్చే 25 సంవత్సరాల పాటు, అంటే 2051 వరకు సీట్ల పునర్విభజనను రాజ్యాంగబద్ధంగా నిలిపివేయాలి,” అని ఆయన పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికలపై దృష్టి సారిస్తూ, బీజేపీ, దాని మిత్రపక్షాలపై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. “తమిళనాడు ప్రజలను వారి సొంత దేశంలోనే శరణార్థులుగా మార్చాలని ప్రయత్నించిన బీజేపీకి, వారి బానిస ఏజెంట్లైన ఏఐఏడీఎంకేకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఓటమిని చవిచూపిస్తాం,” అని అన్నారు.

ఇక లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఇది దేశ వ్యతిరేక చట్టం. మేము దీనిని అనుమతించము. మనమందరం కలిసి దీనిని ఓడిస్తాము,” అని ఆయన స్పష్టం చేశారు.

మొత్తంగా, డీలిమిటేషన్ బిల్లు ఓటమి దేశ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష ఐక్యత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read More
Next Story