నెయ్యి స్కాంలో ఈ సెలక్టివ్ దర్యాప్తు ఏమిటీ స్వామీ?
x

నెయ్యి స్కాంలో ఈ 'సెలక్టివ్' దర్యాప్తు ఏమిటీ స్వామీ?

వైవీని వదిలేసి మిగతావారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు వదంతులు వినవస్తున్నాయి. దీని వెనకున్న పరమార్థమేమిటీ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే చేసిన ఆరోపణ లక్షలాది భక్తుల భావాలను గాయపరిచింది. ఆయన సర్కారే ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. చివరకది కోర్టు దాకా వెళ్లి సీబీఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు దారి తీసింది. అది చాలదన్నట్టు ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ను నియమించింది. ఇప్పుడా కమిషన్ నివేదికలో కొన్ని కీలక విషయాలు వెల్లడైనా, టీడీపీ సర్కారు దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కమిషన్ నివేదిక ప్రకారం, వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి ఆ పార్టీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు కారకులని తేలింది. వీరిద్దరూ ప్రత్యేక ఆహ్వానితులుగా కొనుగోలు కమిటీలో కొనసాగారు. నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలను సడలించడానికి వీరే మొదటి సిఫార్సులు చేశారు. డెయిరీలను రెండేళ్ల పాటు ఎంప్యానెల్ చేయాలన్న సూచనను బేఖాతరు చేశారు.
కొనుగోలు కమిటీ సమావేశాల్లో ఇతర సభ్యులు హాజరు కాకపోయినా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆర్థిక సలహాదారు ఒ.బాలాజీ, ఎం.రాములు వంటి వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని టెండర్ నిబంధనలను సడలించారని కమిషన్ స్పష్టం చేసింది. దీని వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు టీటీడీలోకి చొరబడి ఏళ్లపాటు సరఫరా చేయగలిగాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఆసక్తికరంగా ఈ ఇద్దరు నేతలపై చర్యలకు మాత్రం కమిషన్ సిఫార్సు చేయలేదు.
అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర
అంతకు మించి, టెండర్ నిబంధనలను సడలించే తీర్మానంపై అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతకం చేశారని వివరాలు ఉన్నాయి. నెయ్యి నమూనాలను సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌కి పంపించాలని ఆదేశించినా, ఫలితాలు ఏమయ్యాయో తెలుసుకోవాల్సిన బాధ్యత నిర్వర్తించలేదని కమిషన్ ప్రస్తావించింది. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతున్నా భోలే బాబా డెయిరీ నుంచి కొనుగోళ్లు కొనసాగాయి. ఆయన పీఏ చిన్నప్పన్న సుబ్బారెడ్డి లంచాలు డిమాండ్ చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
అయినప్పటికీ, సీబీఐ- ఎస్‌ఐటీ దర్యాప్తులో వైవీ సుబ్బారెడ్డిని నిందితుల జాబితాలో చేర్చలేదు. ఆయన, ఆయన భార్య స్వర్ణలతా రెడ్డి బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించాలని సిటీ కోరినా, కోర్టు ఆదేశాలు ఉన్నా, వాటిని పూర్తిగా పరిశీలించకుండానే దర్యాప్తు ముగించి ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. చిన్నప్పన్న వంటి వారి లావాదేవీలను కూడా పూర్తిగా కనుగొనకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
టీడీపీ సర్కారు ప్లాన్ మార్చినట్టా?
వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు కావడం, టీడీపీ సర్కారు హయాంలో ఈ విషయంలో ‘సాఫ్ట్’ వైఖరి అనుసరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కమిషన్ నివేదికలో ఎన్ని వైఫల్యాలు, అనుమానాస్పద నిర్ణయాలు వెల్లడైనా, ప్రధాన బాధ్యుల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డిని వదిలేసి మిగతా వారిపై ఫోకస్ చేయడం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎందుకు అనుమానం వస్తోందంటే..?
వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుత టీడీపీ సర్కారులోని కొందరితో సన్నిహిత సంబంధాలున్న మాట బహిరంగ రహస్యమే.ఇప్పుడాయన రాజ్యసభ సభ్యులు. సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కూడా ఆయనే. ఆయనపై స్పష్టమైన ఆరోపణలు (టెండర్ సడలింపు, ల్యాబ్ రిపోర్టులు, లంచం సంబంధిత పాత్ర) ఉన్నా, సిటీ దర్యాప్తులో ఆయన్ని నిందితుల జాబితాలో చేర్చకపోవడం, బ్యాంకు లావాదేవీలను పూర్తిగా పరిశీలించకపోవడం అనుమానాలు కలిగిస్తున్నాయి.
ఇప్పటి ఏకసభ్య కమిషన్ (దినేష్ కుమార్) చాలా వివరాలు తేల్చింది కానీ ప్రధాన ఆరోపితులపై చర్యలకు సిఫార్సు చేయలేదు. ఇది విచారణ పరిధిని చూపిస్తుంది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, టీటీడీ వంటి సంస్థల్లో ఇలాంటి కేసులు పూర్తి న్యాయం చేయడం చాలా అరుదు. ఒక వైపు రక్షించడం, మరో వైపు రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించడం జరుగుతుంది.
ఇలాంటి టెంపుల్ సంబంధిత స్కామ్‌లు దీర్ఘకాలం లాగుతాయి లేదా కొంతమందిని మాత్రమే బలి చేసి ముగిస్తారు. సుప్రీం కోర్టు లేదా హైకోర్టు నిరంతర పర్యవేక్షణ ఉంటే తప్ప. ఇప్పుడూ అదే జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ కుంభకోణం కేవలం సరఫరాదారుల తప్పిదం కాదని, పరిపాలనాపరమైన వైఫల్యాలు, నిబంధనల సడలింపు కూడా కారణమని కమిషన్ స్పష్టం చేసినా, దర్యాప్తు ఎంతవరకు న్యాయబద్ధంగా, పక్షపాత రహితంగా సాగుతుందన్నది ఇప్పుడు కీలకం. భక్తుల విశ్వాసం మీద జరిగిన ఈ దాడికి నిజమైన బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
(ఈ స్టోరీ ఏకసభ్య కమిషన్ నివేదికలోని వివరాలు, సిటీ దర్యాప్తు పరిణామాల ఆధారంగా రాసింది.ఇది రాజకీయ-పరిపాలనా విశ్లేషణ మాత్రమే.)
Read More
Next Story