మహిళా బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు: చంద్రబాబు కీలక ప్రకటన
x

మహిళా బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు: చంద్రబాబు కీలక ప్రకటన

మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని సీఎం పిలుపు.


చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందని, దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అమరావతిలో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, జనసేన నేతలు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు. మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న పార్టీల అసలు రంగును బయటపెట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

అసెంబ్లీ వేదికగా చర్చ.. 10 రోజుల్లో సమావేశాలు
రాబోయే పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సమావేశాల వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక చర్చ చేపడతామని వెల్లడించారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పక్షాలు సమర్థించాయని ఆయన గుర్తు చేశారు. మొదటి నుంచి మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, దీనిని అసెంబ్లీ ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
ముగ్గురు నేతలతో కీలక కమిటీ ఏర్పాటు
మహిళా రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు చంద్రబాబు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఇందులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా నిరసనలు, ప్రెస్ మీట్లు నిర్వహించి ఇండియా కూటమి వైఖరిని మహిళలకు వివరించనున్నారు.
మూడు నగరాల్లో భారీ బహిరంగ సభలు
కేవలం అసెంబ్లీ చర్చలకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నిడదవోలులో నిరసన ర్యాలీ విజయవంతమైన విషయాన్ని పీవీఎన్ మాధవ్ ప్రస్తావించగా, ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి మహిళా బిల్లు ప్రాధాన్యతను వివరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read More
Next Story