టిప్పు సుల్తాన్‌ను శివాజీతో పోల్చిన MPCC చీఫ్ సప్కల్
x

టిప్పు సుల్తాన్‌ను శివాజీతో పోల్చిన MPCC చీఫ్ సప్కల్

మహారాష్ట్రలో రాజకీయ దుమారంతో కేసు నమోదు..


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ వ్యాఖ్యలపై పూణేలో కేసు నమోదైంది. బీజేపీ పూణే నగర అధ్యక్షుడు ధీరజ్ ఘాటే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సప్కల్ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 192, 196(1), 196(2), 352, 356(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ఇంతకు ఆ వివాదాస్పద వ్యాఖ్యలేంటి?

ఫిబ్రవరి 14న మాలేగావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, ఆదర్శాలను టిప్పు సుల్తాన్ అనుసరించారని సప్కల్ అన్నారు “శివాజీ మహారాజ్ స్వరాజ్య ఆలోచనను ప్రవేశపెట్టారు. దాన్ని అనుసరించి, టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిపై యుద్ధం చేశాడు. ధైర్యానికి ప్రతీకగా ఆయనను శివాజీ మహారాజ్‌తో సమానంగా చూడాలి” అని కూడా అనడంతో రాజకీయంగా పెద్ద వివాదానికి దారితీశాయి.


బీజేపీ తీవ్ర అభ్యంతరం..

సప్కల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. బీజేపీ పూణే చీఫ్ ధీరజ్ ఘాటే మాట్లాడుతూ.. “శివాజీ మహారాజ్‌ను దేవుడిగా భావించే హిందువుల మనోభావాలను ఇది దెబ్బతీస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను పెంచుతాయి” అని అన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సప్కల్ వ్యాఖ్యలను ఖండించారు. “మహారాష్ట్ర ప్రజలు ఈ పోలికను సహించరు. సప్కల్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు.


కాంగ్రెస్ ‘డబుల్ స్టాండర్డ్స్’ ఆరోపణ

ఇక కాంగ్రెస్ నేతలు బీజేపీపై ద్వంద్వ ఆరోపణలు చేస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ మాట్లాడుతూ.. గతంలో బీజేపీ నాయకులే టిప్పు సుల్తాన్ గురించి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. “ఇప్పుడు రాజకీయ లాభాల కోసం టిప్పు సుల్తాన్‌ను ప్రతికూలంగా చిత్రీకరిస్తున్నారు” అని ఆరోపించారు.

టిప్పు సుల్తాన్ గురించి గతంలో అధికారిక వేదికలపైనా బీజేపీ నేతలు ప్రస్తావించారని, ఇప్పుడు మాత్రం వేరే విధంగా మాట్లాడుతున్నారని సావంత్ అన్నారు. “ఇది కపటత్వం కాకపోతే ఏమిటి?” అని ప్రశ్నించారు.


రాజకీయంగా వేడెక్కిన వాతావరణం

శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో అత్యంత గౌరవనీయ వ్యక్తి కావడంతో ఆయనను ఇతర చారిత్రక వ్యక్తులతో పోల్చడం ప్రతి సారి రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఈసారి టిప్పు సుల్తాన్ పేరు జోడించడంతో వివాదం మరింత తీవ్రమైంది. ప్రస్తుతం ఈ అంశం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది.

Read More
Next Story