పొదుపు హుళక్కే!
సామాన్యుడిపై ధరల భారం.. పాలకులకు కోట్ల రూపాయల లగ్జరీ కార్లు
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును అందిపుచ్చుకున్నట్లు ఏపీ పాలకులు పెద్ద ఎత్తున బిల్డప్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌లు తాము కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకుంటున్నామని ప్రకటిస్తూ, మంత్రులు సైకిళ్లు తొక్కుతూ నాడు హంగామా చేశారు. కార్ పూలింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, విదేశీ ప్రయాణాల వాయిదా వంటి అనేక ఆంక్షల పాఠాలను ప్రజలకు బోధించిన రెండు రోజులకే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడుం విరిచారు. అయితే, ఈ ఆర్భాటపు పొదుపు సూత్రాలు కేవలం నెల రోజుల్లోనే పూర్తిగా హుళక్కే అని తేలిపోయింది.
ప్రజలను వ్యక్తిగత వాహనాలు ఆపేసి బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలంటూ నీతులు చెప్పిన కూటమి ప్రభుత్వం.. తెరవెనుక మాత్రం ప్రజాధనాన్ని విలాసాల కోసం ధారాళంగా ఖర్చు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఖజానా ఇబ్బందుల్లో ఉందనే కారణంతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు ముడిపెడుతున్న పాలకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కోసం గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా రూ. 28.30 కోట్ల భారీ నిధులను విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిధులతో మొత్తం 12 సరికొత్త అత్యంత విలాసవంతమైన, అత్యాధునిక వాహనాల కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విదేశీ పర్యటనలు వద్దు .. దేశీయ పర్యాటకానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రగల్భాలు పలికిన పెద్ద మనుషులే ఇప్పుడు ప్రత్యేక విమానాల్లో విదేశీ విహారయాత్రలు చేస్తున్నారు. పొదుపు పేరిట సాగిన ఈ మూడు రోజుల పొలిటికల్ డ్రామా, దానికి భిన్నంగా తెరవెనుక జరిగిన కోట్ల రూపాయల విలాసాల ఖర్చుల ద్విముఖ వైఖరిపై సామాన్య ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక క్షేత్రస్థాయిలో పొదుపు ఆచరణను గమనిస్తే, నెల తిరక్కుండానే వీఐపీల హంగామా అంతా మళ్లీ పాత పద్ధతికి వచ్చేసింది. రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి కూడా తమ కాన్వాయ్‌లోని అదనపు వాహనాల సంఖ్యను తగ్గించుకోలేదు సదా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాన్వాయ్ కారు హంగులు లేకుండా ప్రయాణించడం లేదు. పైగా ఈ నేతల వాహనాలు వెళ్లేటప్పుడు భద్రతా సిబ్బంది రోడ్లను క్లియర్ చేస్తూ, సామాన్య ప్రజలను ఎండలో గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిపివేస్తూ నరకం చూపిస్తున్నారు.

