సత్యవేడు: టీడీపీలో విచిత్రమైన పొలిటికల్ ట్రాక్..
ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీలో ఉంటూనే లేనట్టుగా, లేనట్టే ఉంటున్నట్లు..
చిత్తూరు జిల్లాలో సత్యవేడు నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎస్సీ నియోజకవర్గం టీడీపీలో 'పవర్ వార్' ఎక్కువైంది.
"టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త కూరపాటి శంకరరెడ్డి సారధ్యంలోనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పనిచేయాలి" అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. దీంతో తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించిన ఎమ్మెల్యే ఆదిమూలం ఆశలు ఆవిరి అయ్యాయి.
సొంత జిల్లాలో ఈ వ్యవహారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఓ మహిళతో సన్నిహితంగా మెలిగిన వ్యవహారంపై రగడ చోటుచేసుకున్న నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హోదాలో హాజరవుతున్నారు. సమస్య సమసిపోయిన తరువాత కూడా జిల్లా పర్యటనకు వచ్చిన సమయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారు.
కడప పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మిగతా ఎమ్మెల్యేలతో పాటు ఆదిమూలం కూడా కలిశారు.
"ఈ సమయంలో ఆదిమూలంను చూపించి అధికారులకు ముఖ్యచంత్రి చంద్రబాబు సూచనలు ఇవ్వడం ప్రత్యేకంగా" కనిపించింది.
నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత తగ్గడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయగా.. సీఎం సానుకూలంగా స్పందించి గ్రూపుల సర్దుబాటుపై హామీ ఇచ్చారని పార్టీ వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే తెరవెనుక చర్చలు జరిపి ఆదిమూలం కొడుకు కోనేటి సుమన్‌కు బీఎల్‌ఏ ఇన్‌ఛార్జ్ పదవి ఇచ్చారు. ఈ ఉత్సాహంతోనే ఆదిమూలం మళ్లీ పోలీసు ఎస్కార్ట్, కాన్వాయ్‌తో నియోజకవర్గంలో పర్యటించడం ప్రారంభించారు. ఆ వీడియోలు వైరల్ గా మారాయి.
సమన్వయకర్త ఆగ్రహం
సత్యవేడు నియోజకవర్గంలో తనను కాదని అధికారిక హోదాలో పర్యటించడంపై టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త కూరపాటి శంకరరెడ్డికి ఆగ్రహం తెప్పించినట్లు కనిపించింది. దీంతో రెండు రోజుల కిందట తిరుపతి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా నేతలతో శంకరరెడ్డి, ఆయన వర్గం కలిసింది. వారితో కలిసి మీడియాతో మాట్లాడిన టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడారు.
"పార్టీ కార్యకర్తలే కాదు. నాయకులు కూడా క్రమశిక్షణకు లోబడే పనిచేయాలి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి శంకరరెడ్డి సారధ్యంలోనే పని చేయాలి" అని పనబాక లక్ష్మి తెల్చి చెప్పారు. మినహా, ఆదిమూలం టీడీపీలో కొనసాగుతున్నారా? లేదా? క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించడంపై మాత్రం వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
ఆదిమూలం టీడీపీలో ఉన్నట్లా? లేనట్లా?
సాంకేతికంగా కోనేటి ఆదిమూలంపై విధించిన సస్పెన్షన్‌ను పార్టీ అధిష్టానం అధికారికంగా పూర్తిగా ఎత్తివేయలేదు. కానీ, ఆయన కూటమి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడికి పదవి ఇవ్వడం ద్వారా హైకమాండ్ ఒక మెట్టు దిగి సర్దుబాటుకు ప్రయత్నించినప్పటికీ, సత్యవేడు పార్టీ పగ్గాలు మాత్రం పూర్తిగా శంకర్ రెడ్డి చేతిలోనే ఉంచాలని డిసైడ్ అయింది. అంటే ఆదిమూలం ప్రస్తుతం పార్టీలో ‘ఉంటూనే లేనట్టుగా.. లేనట్టే ఉంటూ ఉన్నట్టుగా’ ఒక విచిత్రమైన పొలిటికల్ ట్రాక్‌లో సాగుతున్నారు.
Next Story


