
ఏపీ రాజకీయాల్లో ఈ ఆడిటర్ ఎవరి లెక్కలు సరిచేస్తారో..?
ట్రబుల్ షూటర్ నుంచి సొంత ఫ్లాట్ ఫాం మీదికి. విజయసాయి కొత్త పార్టీ
దాదాపు ఏడాదిగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు వేణంబాకం విజయసాయిరెడ్డి కొత్తగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు.
"ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా, ప్రజల కోసం నిలబడి, చట్టసభలో మాట్లాడేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నా" అని విజయసాయిరెడ్డి మూడు ముక్కల్లో పార్టీ లక్ష్యాన్ని వివరించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన పార్టీకి ఆశించిన ఆదరణ ఉంటుందా? లేక తనకు రెండో స్థానం నేత హెదా కల్పించిన వైసీపీపై ఎంత ప్రభావం ఉంటుందనే అంశంపైనే రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది.
విజయసాయి.. ఏ పార్టీ పునాదులు కదిలిస్తారో..?
క్షేత్రస్థాయిలో ప్రజాదరణ సాధించడం సాధ్యమేనా? వైసీపీకి ఎలాంటి ముప్పు ఉంటుంది?
ఏపీలో ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన, బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుంది. బీజేపీ దాదాపు అదే కోవలో కూటమి పార్టీల ఊతంతో ముందడుతు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీని స్థాపించ, ఓట్ల సాధనకు ముందు, క్షేత్ర స్థాయిలో ప్రజాదరణ సాధించండి విజయసాయిరెడ్డికి సవాల్ తో కూడుకున్న అంశం అనే విషయంలో సందేహం లేదు.
రాష్ట్రంలో మూడేళ్లకు జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి పునాదులు పటిష్టం చేసుకునే లక్ష్యంగానే పార్టీ ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ కార్యాచరణ, విధివిధానాలు ఈ నెలాఖరులో విజయవాడలో ప్రకటించనున్నట్లు విజయసాయిరెడ్డి బుధవారం తిరుమలలో ప్రకటించారు. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు విజయసాయిరెడ్డి ప్రస్థానం పరిశీలిద్దాం..
కడప జిల్లాకు ప్రధానంగా దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంతో విజయసాయిరెడ్డికి అనుబంధం ఉంది. ఆయన చలువతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, 2006లో విజయసాయిరెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా రాజకీయ అరంగేట్రం చేశారని చెప్పావచ్చు. వైఎస్ కుటుంబానికి అంతరంగికుడిగా వ్యవహరించిన నేపథ్యం ఉంది. వైఎస్ఆర్ తండ్రి వైఎస్. రాజారెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె సమీపంలోని మంగంపేట గనులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఆర్థిక లావాదేవీలు చూడడంతో ఆడిటర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించిన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్. జగన్ పార్టీ ప్రారంభించిన తరువాత విజయసాయిరెడ్డి అత్యంత కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో వైఎస్. జగన్ కు సంబంధించిన వ్యాపార కలాపాల్లో ఆడిటింగ్ లో కీలకంగా వ్యవహరించారు. రాజకీయంగా కూడా ఆయన నంబర్ 2 స్థాయి నేతగా నిలిచారు. వైఎస్. జగన్ కూడా ఆయనకు అంతటి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కుటుంబంతో ఉన్న అనుబంధం, ట్రబుల్ షూటర్ గానే సాయిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ క్రమంలోనే
వైఎస్. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి అక్రమాస్తుల తోపాటు 11 కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నారు. జగన్ తో పాటు ఆయన కూడా జైలు జీవితం అనుభవించారు. వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు, గనులు, ప్రాజెక్టులు, ప్రత్యేక మినహాయింపులు పొందిన వ్యాపార సంస్థలతో జరిగిన వ్యవహారాలతో జగన్ మీడియా సంస్థలకు పెట్టుబడులు సాధించారనే ( క్రిడ్ ఫ్రో కో ) కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈడీ తోపాటు సీబీఐ 11 చార్జిషీట్ల వరకు దాఖలు చేసింది. అయినా, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా
ఏడాదిగా ఊగిసలాట..
జగన్ తో విబేధించి వైసీపీకి, రాజ్యసభ సభ్వత్వానికి 2025 జనవరి 25వ తేదీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయానికి మాత్రమే పరిమితం అవుతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. ఇటీవల జార్ఘండ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికకు పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు తీసుకుని, చివరి నిమిషంలో విరమించుకోవడం వల్ల ఆయన బీజేపీకి మొగ్గు చూపుతున్నట్లు భావించారు. ఇదంతా ఏడాదిన్నర పాటు విజయసాయిరెడ్డి ఊగిసలాట ధోరణిలోనే వ్యవహరించారు.
ఇప్పుడు పార్టీ ఎందుకు?
ఏడాదిగా సాగుతున్న ఊహాగానాలకు తెర దించుతూ విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వ్యూహకర్తే అందులో సందేహం లేదు. ట్రబుల్ షూటర్ కూడా. పార్టీ ఏర్పాటు వెనుక ఆంతర్యం ఏమిటనేది ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది.
వైసీపీలో ప్రధానంగా జగన్ కు ఆంతరంగికుడిలా మెలిగిన వారిలో విజయసాయిరెడ్డి మొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఈయన పార్టీ ఏర్పాటుతో టీడీపీ కూటమిపై యుద్ధం ప్రకటించే అంతటి శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. ఆయన వల్ల వైసీపీకి ప్రధానంగా జగన్ కు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది ఓ అంశం కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాటి నుంచి అన్ని వ్యవహారాలు ఆయనకు తెలిసినవే. ఇక వైసీపీ ఏర్పాటు తరువాత విజయసాయిరెడ్డికి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఇదే ఆయన అస్త్రంగా వాడతారా? ఆయన ప్రారంభించే పార్టీలోకి ఎవరిని స్వాగతిస్తారు? వైసీపీ శ్రేణులు గమ్మునే ఉంటాయా? అసంతృప్తి నేతలను చేరదీస్తారా? అనే కోణాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఈక్వేషన్స్ ఎలా మారుతాయో..?
వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయసాయిరెడ్డి పార్టీ వల్ల వైసీపీ ఓటు బ్యాంకు లేదా నాయకత్వంలో చీలిక అనివార్యమైతే.. అది సహజంగానే అధికారంలో ఉన్న కూటమికి లాభిస్తుందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఓట్లు లేదా క్యాడర్ లో చీలిక వస్తుందా? అనేది కూడా ఓ ధర్మసందేహమే. కొత్త వేదిక కోసం నిరీక్షిస్తున్న అసంతృప్తి నేతలు, వైసీపీలో ప్రాధాన్యం దక్కక, విభేదాలతో దూరమైన ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ కు మాత్రమే వేదిక దొరికే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి ఉనికి కూడా చాటుకునేందుకు వీలుంటుంది. సొంత గొంతుక వినిపించడానికి అవకాశం లభిస్తుంది.
వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావడం, పార్టీ నిర్మాణం, వ్యూహ రచనలో కీలకపాత్ర పోషించిన విజయసాయి కీలక వ్యక్తి. ఆయన పార్టీ వల్ల వైసీపీ అంతర్గత వ్యవహారాలు, బలం, బలహీనతలపై ఆయనకు స్వతహాగా అవగాహన పట్టు ఉందనే విషయం తెలిసిందే. వాటిని ఆసరాగా చేసుకుని, బాంబుల్లాంటి మాటలు పేలిస్తే, మాత్రం వైసీపీకి ఇక్కట్లు తప్పవు. దీనికి ముందే ఆయన పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ఓటు బ్యాంకు సాధించడం అటుంచి, క్షేత్రస్థాయిలో ప్రజాదరణ, బలం సాధించడం కూడా సవాళ్లతో కూడుకున్నదే. పార్టీ జెండా, విధివిధానాలు, నాయకత్వం, నిర్మాణం, రాజకీయ ప్రణాళికపై స్పష్టత ఇచ్చిన తరువాతే పార్టీ అస్థిత్త్వం ఆధారపడి ఉంటుంది.
Next Story

