
తమిళనాడు: అన్నామలై ఎందుకు తప్పుకున్నారు?
అసంతృప్తే కారణమా? పార్టీ వ్యూహంలో భాగమా?
తమిళనాడు(Tamil Nadu)లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ(BJP) మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై తనకు అప్పగించిన ఎన్నికల బాధ్యతల నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి అనారోగ్యాన్ని కారణంగా చూపినా.. ఆయన నిర్ణయం వెనుక అసంతృప్తి, పార్టీ వ్యూహాం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ కార్యక్రమంలో ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పరిణామాలన్నింటిని విశ్లేషిస్తే అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. పార్టీ ప్రచారంలో అన్నామలై పాత్రను ఉద్దేశపూర్వకంగా తగ్గించారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వం అన్నామలైను మెయిన్ క్యాంపెయినర్‌గా చూపేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతకర్త ఎస్. గురుమూర్తి వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. అన్నామలైను తాత్కాలికంగా పక్కన పెట్టి, 2031 నాటికి కీలక బాధ్యతలు అప్పగించవచ్చన్న సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఐదేళ్ల పాటు ఓపికగా ఉండగలడా? అన్నది వేచిచూడాలన్నారు.
పరిమిత నియోజకవర్గాల అప్పగింతే కారణమా?
234 అసెంబ్లీ నియోజకవర్గాలకు 72 మందిని ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించారు. అయితే అన్నామలైకి కేవలం ఆరు నియోజకవర్గాల బాధ్యతలు మాత్రమే ఇవ్వడాన్ని గమనించాలని శ్రీనివాసన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన నాయకుడికి పరిమితంగా బాధ్యతలు ఇవ్వడం అన్నామలై అసంతృప్తిని కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు.
సింగనల్లూరు నియోజకవర్గ అంశం కూడా వివాదానికి దారితీసింది. అక్కడ పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు అన్నామలై “ప్రచారం కూడా చేయను” అని స్పష్టంగా చెప్పడం మిత్రపక్షాలు, ప్రత్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అన్నామలై తండ్రి చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి బాగోగులు చూసుకోవాల్సి ఉన్నందున, తనను తప్పించాలని కోరడం వెనక రాజకీయ అనుమానాలకు తావిస్తోందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
అన్నామలై కొత్త పార్టీ పెడతారా? లేక నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలుపుతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి కేవలం ప్రచారాలేనని శ్రీనివాసన్ స్పష్టం చేశారు.
అన్నామలైకు యువతలో ప్రత్యేక ఆకర్షణ ఉందని, ఆయన శైలి, స్పష్టమైన మాట తీరు ఆయనను ఇతర నాయకుల నుంచి భిన్నంగా నిలబెట్టింది. అయితే అదే ఆకర్షణ ఇప్పుడు ఓటర్లలో భ్రమలకు దారితీయవచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా చూస్తే.. తమిళనాడులో బీజేపీ 2026 కంటే 2031 లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని శ్రీనివాసన్ అన్నారు. 2026 ఎన్నికలు కూడా పార్టీకి కీలకమే. ముఖ్యంగా ఓట్ షేర్‌కు పరీక్షగా నిలుస్తాయని చెప్పారు. మొత్తంమీద అన్నామలై ప్రచారం నుంచి వైదొలగడం బీజేపీకి, అలాగే తమిళనాడులో ఎన్డీఏ కూటమికి ప్రతికూల పరిణామంగా మారే అవకాశముందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

