
రాహుల్ లోక్‌సభలో చెప్పిన ఆ '16' కథ ఏమిటంటే..
గూగుల్ ను గాలిస్తున్న నెటిజన్లకు చిక్కిన జవాబు ఏంటంటే..
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రధానప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిన్న డీలిమిటేషన్ బిల్లుపై మాట్లాడిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. రాహుల్ తన ప్రసంగంలో అనేక పొడుపుకథలు, పిట్ట కథలు చెప్పినప్పటికీ చివర్లో ఆయన చూపిన 16వ నెంబరు ఏమిటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాట్ జీపీటీ, గూగుల్ ఏఐ, గోర్క్ తో పాటు గూగుల్ అంతటా దీనిపై శోధన సాగుతోంది.
ఇంతకీ ఈ 16 మిస్టరీ ఏమిటీ?
"బిజెపికి ఒక భ్రమ ఉంది.. తామే భారత ప్రజలమని, తామే సాయుధ దళాలని వారు అనుకుంటున్నారు. కానీ మీరు (బీజేపీ) ఒక రాజకీయ సంస్థ మాత్రమే. మేము మిమ్మల్ని విమర్శిస్తున్నాం, దేశాన్ని కాదు.
చివరగా ఒక పజిల్ ఇస్తాను. నిన్న నేను ప్రధానమంత్రి ప్రసంగం చూశాను. చాలా బలహీన స్వరంతో, విసిగిపోయినట్లుగా ఆయన మాట్లాడారు. నిన్న తేది ఏప్రిల్ 16. ఈ '16' అనే నంబర్‌లోనే అన్ని సమాధానాలు ఉన్నాయి. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం, జరగబోయేది అంతా ఆ 16 నంబర్‌లోనే ఉంది. భారతీయులు ఆ పజిల్‌ను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు." అని రాహుల్ గాంధీ అన్నారు.
అప్పటి నుంచి ఈ '16' నంబర్ ఏమిటీ అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ పెను సంచలనంగా మారింది. ఆయన ఏప్రిల్ 17, 2026న లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ఫోన్‌లో తేదీ ఏప్రిల్ 16 అని చూశానని, ఆ '16' అనే అంకెలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉందని వ్యాఖ్యానించారు.
దీనిపై నడుస్తున్న చర్చ ఏమిటంటే...
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీల సంఖ్య ఈ '16'. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈ బలంతోనే మోదీ సర్కార్ నడుస్తోంది.
ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయని ఆందోళన ఉంది.
ఒకవేళ దక్షిణాదికి చెందిన TDP ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని రాహుల్ హింట్ ఇచ్చి ఉండవచ్చు. ఎన్డీయే కూటమిలో ఈ 16 మంది ఎంపీలు అత్యంత కీలకం కాబట్టి, వారి నిర్ణయమే "సమాధానం" అని ఆయన ఉద్దేశం కావచ్చు.
ఎప్స్టీన్ ఫైల్స్ లో ఈ 16 ఉంది...
కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా (X) ఖాతాలో "SIXTEEN" అని రాసి ఉన్న ఒక పోస్ట్ పెట్టింది. అందులో "Sixteen sounds a lot like Epstein, doesn't it?" (16 అనేది ఎప్స్టీన్ లాగా వినిపిస్తోంది కదా?) అనే క్యాప్షన్ ఇచ్చారు.
అమెరికాకు చెందిన జెఫ్రీ ఎప్స్టీన్ ఒక సెక్స్ ట్రాఫికర్. మైనర్లను అత్యాచారం చేసినట్టు అరెస్ట్ అయి జైల్లోలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. ఇతనికి సంబంధించి వచ్చిన కొన్ని రహస్య ఫైల్స్ లేదా వీడియోలకు, భారత ప్రభుత్వానికి లేదా కీలక వ్యక్తులకు ఏదైనా సంబంధం ఉందని ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్నారా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుత కేంద్ర మంత్రి ఒకరికి ఈ సెక్స్ కుంభకోణంలో సంబంధం ఉందన్న ఆరోపణలు సంచలనం రేపాయి.
'రాజీ పడ్డ' విదేశీ ఒప్పందాలు...
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అమెరికాతో జరిగిన ఒక ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ, "ఏ ప్రధానమంత్రి అయినా రాజీ పడితే (compromised) తప్ప ఇలాంటి ఒప్పందంపై సంతకం చేయరు" అని అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ వెబ్‌సైట్ నుండి తొలగించిన 16 రహస్య ఫైల్స్ గురించి ఆయన మాట్లాడుతున్నట్లు కొందరు అనుమానిస్తున్నారు.
రాజ్యాంగంలోని 16వ అధికరణం..
రాహుల్ ప్రసంగం అంతా సమాన ప్రాతినిధ్యం (OBC, దళితులకు వాటా) చుట్టూ సాగింది. రాజ్యాంగంలోని Article 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి చెప్తుంది. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల విభజన ద్వారా ఈ సమానత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆయన సూచించి ఉండవచ్చు.
మరోపక్క, ఆర్టికల్ 131 రాజ్యంగ సవరణ వీగిన తర్వాత ఎన్డీఏ బలం 16 తగ్గింది. బహుశా దాన్ని గురించి ముందే తెలియడం వల్ల రాహుల్ ఈ మాట అన్నాడా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులు దీని గురించి అడిగినప్పుడు, రాహుల్ గాంధీ నవ్వుతూ "అదొక పొడుపుకథ, ఇప్పుడే సమాధానం చెప్పను. మీరే ఆలోచించండి" అని అన్నారు. దీనివల్ల సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల థియరీలతో (Sweet 16 నుండి పొలిటికల్ అల్టిమేటం వరకు) విపరీతమైన చర్చలు చేస్తున్నారు.
Next Story

