ఇది మహిళా బిల్లు కాదు, మరేదోనని రాహుల్ ఎందుకన్నారు?
x

ఇది మహిళా బిల్లు కాదు, మరేదోనని రాహుల్ ఎందుకన్నారు?

ఈ బిల్లు పాస్ కాదని తెలిసి కూడా ఎందుకు ప్రవేశపెట్టారో బీజేపీకే తెలియాలి..


"మన జాతీయ దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర శక్తి. మనందరి జీవితాల్లోని మహిళలు మనల్ని ప్రభావితం చేశారు, మనకు ఎంతో నేర్పించారు. నిన్న నా సోదరి (ప్రియాంక గాంధీ) నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేనిది కేవలం 5 నిమిషాల్లో సాధించింది.. అది అమిత్ షా ముఖంలో చిరునవ్వు పూయించడం!" అని రాహుల్ చమత్కరించారు.
తన బాల్యంలో ఇందిరా గాంధీ నేర్పిన ఒక పాఠాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు: "చిన్నప్పుడు నాకు కుక్కలంటే చాలా భయం ఉండేది. ఒకరోజు మా అమ్మమ్మ నన్ను పిలిచి, చీకట్లో తోటలో వదిలేసి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత వచ్చి 'నీకు దేనిపై భయం?' అని అడిగింది. నేను కుక్కలని చెబితే.. ఆమె 'నువ్వు వాటికి భయపడటం లేదు, నీ మనసులోని ఊహలకు భయపడుతున్నావు. నిజం అనేది చీకట్లో ఉంటుంది, అక్కడికి వెళ్లే ధైర్యం లేకపోతే నీ భయాలను జయించలేవు' అని చెప్పింది. ఇది నాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా పెద్ద పాఠం."
బిల్లుపై విమర్శలు...
మహిళల వెనుక దాగుడుమూతలు: "నిజం చెప్పాలంటే.. ఇది మహిళల బిల్లు కాదు, మరేదో! మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. ఇది మహిళలను అడ్డం పెట్టుకుని భారతదేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నం. మీరు నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. కానీ ఈ బిల్లు ఉద్దేశం అది కాదు."
ఓబీసీ, దళిత వ్యతిరేక అజెండా: "ఈ దేశంలో దళితులు, ఓబీసీల పట్ల సమాజం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. నా ఓబీసీ సోదర సోదరీమణులకు అధికారం, ప్రాతినిధ్యం దక్కకుండా చేసేందుకే ఈ 'బైపాస్' ప్రక్రియను తెచ్చారు. ఇది 'సంవిధానం' (రాజ్యాంగం) పై 'మనువాదం' చేస్తున్న దాడి."
కుల గణన (Caste Census): "కుల గణన మొదలైందని అమిత్ షా చెబుతున్నారు. కానీ ఆ గణనను ఈ సభలో ప్రాతినిధ్యం కోసం వాడతారా లేదా? రాబోయే 10-15 ఏళ్ల వరకు వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కకుండా చేసేందుకే మీరు ఈ కుట్ర చేస్తున్నారు."
దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల భయం..
ప్రాతినిధ్యంపై దాడి: "బీజేపీ అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని లాగేసుకుంటామని మీరు చెబుతున్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య. దీన్ని మేము ఏమాత్రం ఒప్పుకోము."
యూనియన్ ఆఫ్ ఇండియాపై దాడి: "దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నా సోదర సోదరీమణులకు నేను హామీ ఇస్తున్నాను.. మీరు భయపడకండి. భారతదేశ సమాఖ్య వ్యవస్థపై (Union of India) దాడి చేయడానికి మేము వారిని అనుమతించము. మీ ప్రాతినిధ్యాన్ని తాకే ధైర్యం కూడా వారు చేయలేరు."
చరిత్రను గుర్తు చేస్తూ: "ఇదే ప్రశ్న గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిల ముందుకూ వచ్చింది. కానీ వారు ఇలాంటి అన్యాయం జరగకుండా చూశారు."
సభలో గందరగోళం...
రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. కాంగ్రెస్ గతంలో బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుందని, రాజీవ్ గాంధీ ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని విమర్శించడంతో సభలో గందరగోళం నెలకొంది.
Read More
Next Story