
రఘువీరా వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి
కిరణ్ కుమార్ రెడ్డిని ఏకేసిన రఘువీరా!
నీ మాత్రం తెలివి తేటలు రాహుల్ కు ఉంటే నిన్నెందుకు సీఎం ను చేస్తారంటూ ఎద్దేవా
మృదుస్వభావిగా, వివాదాలకు దూరంగా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే రఘువీరారెడ్డి ఈసారి మాత్రం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “పార్టీ ఫిరాయించడం తప్పు కాదు... కానీ ఒక్క రాజ్యసభ సీటుకోసమో, గవర్నర్ గిరీ కోసమో ఇంతలా రాహుల్ గాంధీపై విషం కక్కాలా?” అంటూ ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నయా బీజేపీ నాయకుడు, నా మిత్రుడు, నా పాత సహచరుడు, ప్రస్తుతం సెఫాలజిస్ట్ గా మారిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటూ వ్యంగంగా మొదలు పెట్టిన రఘువీరారెడ్డి ఓ రేంజ్ లో కిరణ్ కుమార్ రెడ్డిని ఆడుకున్నారు. "నీ మాత్రం తెలివి తేటలు వాళ్లకు ఉంటే నిన్ను ఎందుకు సీఎం ను చేస్తారు? వాళ్ల కుటుంబంలో ముగ్గుర్ని ఎందుకు దేశం కోసం పోగొట్టుకుంటారు" అంటూ విరుచుకుపడ్డారు.
ఓట్ల తొలగింపుపై కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రఘువీరా.. వ్యక్తిగత వ్యంగ్యం, రాజకీయ విమర్శ, భావోద్వేగాన్ని కలిపి ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. “ముగ్గుర్ని పోగొట్టుకోవడం కంటే ఆ ఫ్యామిలీ ఇంకేం త్యాగం చేయాలి? నీలాగా సీఎం పదవి పోగానే వేరే పార్టీ పంచన చేరి విమర్శలు చేయాలా?” అంటూ నేరుగా కిరణ్‌ను టార్గెట్ చేశారు.
“నీకు ఉన్నంత తెలివి రాహుల్‌కి లేదు లే!”
ఈ వీడియోలో ఎక్కువగా వైరల్ అవుతున్న వ్యాఖ్య ఇదే. “అవును కిరణ్ కుమార్ రెడ్డి గారూ... నీకు ఉన్నంత తెలివితేటలు రాహుల్ గాంధీకి లేవులే. వాళ్లకు కూడా నీలాంటి లౌక్యం ఉంటే... నిన్ను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేవాళ్లే కాదు” అంటూ రఘువీరా సెటైర్లు పేల్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. “అర్హత కంటే విశ్వాసాన్ని చూసి పదవి ఇచ్చారు. కానీ అదే విశ్వాసాన్ని మీరు వెన్నుపోటుతో తిరిగి ఇచ్చారు” అన్నట్టుగా రఘువీరా వ్యాఖ్యానించారు.
సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి బీజేపీ దాకా...
రాష్ట్రం విడిపోయాక మీరేదో చెప్పు గుర్తుతో పోటీ చేశారనుకుంటా అని ఆటపట్టిస్తూనే తనను నమ్ముకున్న వాళ్లు నట్టేట మునిగారు అనే అర్థంలో మాట్లాడారు.
రాష్ట్ర విభజన సమయంలో సీఎం పదవికి రాజీనామా చేసి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి వచ్చింది. అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లో చేరి.. చివరికి బీజేపీ గూటికి వెళ్లారు.
ఈ రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ రఘువీరా.. “పదవి ఉన్నంతకాలం కాంగ్రెస్‌లో ఉండి, పదవి పోయాక పార్టీని తిట్టడం చాలా ఈజీ” అని చురకలంటించారు. “నీలాగా సీఎం కుర్చీ పోగానే పార్టీ మారి, అదే పార్టీ నాయకత్వాన్ని దూషించడం అందరికీ రాదు” అని కూడా వ్యాఖ్యానించారు.
రాజ్యసభ సీటా? గవర్నర్ ఆశలా?
రఘువీరా వీడియోలో అత్యంత రాజకీయంగా చర్చకు దారి తీసిన అంశం ఇదే. “ఒక్క రాజ్యసభ సీటుకోసమో, గవర్నర్ పదవికోసమో ఇంతలా రాహుల్ గాంధీపై విషం కక్కడం అవసరమా?” అని ఆయన ప్రశ్నించడం ద్వారా.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత రాజకీయ వైఖరి వెనుక పదవి ఆశలే ఉన్నాయనే సంకేతం ఇచ్చినట్టైంది.
"మన ఇద్దరి మధ్యా ఏరా, పోరా అనే సాన్నిహిత్యం ఉండేది ఒకప్పుడు.. ఇప్పుడు మీరు వేరేపార్టీలో ఉన్నారు, అయినా నేను తప్పబట్టను గాని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మీరు విమర్శించారే అది చూస్తుంటేనే బాధ కలుగుతోంది.." అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీలో చేరిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌పై, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ అవకాశవాదంలో భాగమేనని కాంగ్రెస్ వర్గాలు ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
వైరల్ అవుతున్న వీడియో.. కాంగ్రెస్‌లో జోష్
రఘువీరారెడ్డి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. “ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసిన వ్యక్తిగా కిరణ్ అసలు రాజకీయ స్వరూపాన్ని రఘువీరా బట్టబయలు చేశారు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి వర్గం మాత్రం ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించలేదు.
Next Story

