
కేజ్రీవాల్‌పై చద్దా ఘాటు విమర్శలు..
ముదురుతున్న ‘షీష్ మహల్ 2’ వివాదం
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆప్(AAP)ను వీడి బీజేపీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో AAP ఓటమికి ప్రధాన కారణం “షీష్ మహల్” ఆరోపణలేనని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. “ఢిల్లీలో ‘షీష్ మహల్ చిత్రాలు బయటకు వచ్చాయి. ఆప్ ఓటమికి అదే ప్రధాన కారణమైంది’’ అని పేర్కొన్నారు. ఆప్‌ను వీడి బీజేపీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై చద్దా తీవ్ర విమర్శలు చేశారు.
షీష్ మహల్‌పై రాజకీయ వాగ్వాదం..
కేజ్రీవాల్ విలాసవంతమైన జీవనశైలిని సూచించడానికి బీజేపీ “షీష్ మహల్” అనే పదాన్ని ఉపయోగిస్తోంది. “ఢిల్లీలో ఓటర్లు కేజ్రీవాల్‌ను షీష్ మహల్ నుంచి పంపించారు. ఇప్పుడు పంజాబ్ వెళ్లి, లోధి ఎస్టేట్‌లో ‘షీష్ మహల్ 2’ సిద్ధం చేశారు,” అని బీజేపీ నాయకుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు. కేంద్రం కేటాయించిన బంగ్లాను ఆధునీకరించడానికి కేజ్రీ ప్రైవేట్ డబ్బు వినియోగించారని కూడా బీజేపీ ఆరోపించింది.
“అవి ఫేక్ ఫోటోలు..
బీజేపీ ఆరోపణలను ఆప్ పూర్తిగా ఖండించింది. పార్టీ నాయకురాలు అతిషి..“ఆ చిత్రాలు నకిలీవి. పింటరెస్ట్ నుంచి తీసుకుని కేజ్రీవాల్‌ను అపఖ్యాతి పాలుచేయడానికి వాడుతున్నారు,” అని ఆరోపించారు.
“ఏమీ దొరకనప్పుడు, ఇంటర్నెట్ నుంచి ఫొటోలు డౌన్‌లోడ్ చేసి ఆరోపణలకు పాల్పడుతున్నారు. ఏఐతో తయారు చేసి ఉంటే మరింత నమ్మకంగా ఉండేది,” అని వ్యాఖ్యానించారు.
మలివాల్ వ్యాఖ్యలతో ముదిరిన వివాదం..
బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “కేజ్రీవాల్ రూ.100 కోట్ల విలువైన ఇల్లు కట్టుకున్నారు. ఆయన అవినీతికి అది ప్రతీక,” అని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని, అందుకే బీజేపీలో చేరానని చెప్పారు. మలివాల్ తనపై జరిగిన దాడిని కూడా ప్రస్తావించారు.
“2006 నుంచి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేశాను. అయినా తన ఇంట్లోనే ఒక గూండాతో నన్ను కొట్టించారు,” అని ఆమె ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని, రెండు సంవత్సరాల పాటు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.
పార్టీ సంస్కృతిపై కూడా విమర్శలు..
ఆప్ పాలనపై కూడా మలివాల్ విమర్శలు గుప్పించారు. పంజాబ్‌ను “వ్యక్తిగత ఏటీఎం”లా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, బీజేపీ పాలనను ప్రశంసిస్తూ, “మోదీ, అమిత్ షా దేశ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు,” అని పేర్కొన్నారు.
పెరుగుతోన్న రాజకీయ వేడి..
‘షీష్ మహల్ 2’ వివాదం నేపథ్యంలో బీజేపీ-ఆప్ మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. ఒకవైపు చద్దా, మలివాల్ వంటి మాజీ ఆప్ నేతల విమర్శలు, మరోవైపు ఆప్ నుంచి ఖండనలు..ఈ వివాదం రాబోయే రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

