ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే మనీలాండరింగ్ ఆరోపణలు
x

ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే మనీలాండరింగ్ ఆరోపణలు

జేపీ ఎదురుదాడి


Click the Play button to hear this message in audio format

కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం చెలరేగింది. రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై మనీలాండరింగ్ ఆరోపణలు చేశారు. ప్రతిగా బీజేపీ నాయకులు స్పందించారు. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.


ఆర్థిక పారదర్శకతేదీ?

బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా లేవని విమర్శించారు. ఇతర సంస్థలు పన్నులు చెల్లిస్తూ, లెక్కలు చూపుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.

“గురు దక్షిణ” పేరుతో నిధులు సేకరిస్తున్నారని, వాటి వినియోగంపై కూడా స్పష్టత లేదన్నారు. విదేశాల నుంచి కూడా నిధులు వస్తున్నాయని, ఇది పెద్ద మనీలాండరింగ్ నెట్‌వర్క్‌గా మారిందని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఖర్గే ఎలాంటి ఆధారాలను చూపలేదు.

“ప్రతి పౌరుడు పన్నులు చెల్లించాలి అంటారు. కానీ వారు మాత్రం పన్ను చెల్లించకుండా ఉండటం ఎలా సాధ్యం?” అంటూ ఖర్గే ప్రశ్నించారు. దాదాపు 2,500 సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధంగా ఉన్నాయని, వాటి ఆర్థిక వ్యవహారాలపై స్పష్టత ఉండాలని అన్నారు.


‘రిజిస్ట్రేషన్ ఎందుకు లేదు?’

ఆర్‌ఎస్‌ఎస్ రిజిస్ట్రేషన్ లేని సంస్థ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇతర క్లబ్బులు, సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుని పన్నులు చెల్లిస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం ఎందుకు చేయదని ప్రశ్నించారు. “రాజ్యాంగం కింద రిజిస్ట్రేషన్ అయ్యే వరకు వదిలిపెట్టను” అని స్పష్టం చేశారు.


బీజేపీ ఎదురుదాడి..

ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. “ముందుగా కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా చూసుకోండి” అంటూ ఖర్గేపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక కూడా స్పందిస్తూ.. “ఆర్‌ఎస్‌ఎస్‌ను దూషించడం ఆకాశంపై ఉమ్మివేయడం లాంటిది” అన్నారు. దశాబ్దాలుగా ప్రజల విశ్వాసం పొందిన సంస్థపై ఇలా ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.


ఖర్గే సమాధానం..

విమర్శలకు స్పందించిన ప్రియాంక్ ఖర్గే..తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. కళ్యాణ కర్ణాటక వెనుకబాటుతనానికి చారిత్రక కారణాలు ఉన్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేటాయింపులు తగ్గించడం వల్ల అభివృద్ధి దెబ్బతిందని విమర్శించారు.

ఈ వ్యవహారం ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో వేడెక్కింది. ఆర్‌ఎస్‌ఎస్ ఆర్థిక వ్యవహారాలపై పారదర్శకత ఉండాలన్న డిమాండ్ ఒకవైపు ఉండగా, బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఈ వాగ్వాదం ఇంకా మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More
Next Story