రాజకీయమే గెలిచింది.. రక్తబంధాలు ఓడిపోయాయి!
x

రాజకీయమే గెలిచింది.. రక్తబంధాలు ఓడిపోయాయి!

ముద్రగడ, వైఎస్ కుటుంబాల్లో మానవీయ విషాదం!


అధికారం, పదవులు, రాజకీయ సిద్ధాంతాల పోరాటం కేవలం ఓట్లు, సీట్లకు మాత్రమే పరిమితం కాకుండా, అత్యంత పవిత్రమైన రక్తాబంధాలను ఎలా బలితీసుకుంటాయనే దానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే సజీవ సాక్ష్యం. లీడర్లు సమాజంలో రాజకీయాలను శాసిస్తారేమో కానీ, ఆ లీడర్ల ఇళ్లల్లో మాత్రం ఆ రాజకీయమే బంధాలను శాసిస్తుంది, విడదీస్తుంది, చివరకు మానవత్వాన్ని సైతం బలితీసుకుని తనే విజేతగా నిలుస్తుంది. కాపు సామాజికవర్గ అగ్రనేత ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఆయన అంత్యక్రియల వేళ సొంత కుమార్తె క్రాంతి దక్కని తన తండ్రి ఆఖరి చూపులు, ఎదుర్కొన్న అవమానం, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలిన వైఎస్సార్ కుటుంబంలో అన్నచెల్లెళ్ల (జగన్-షర్మిల) మధ్య నడుస్తున్న సుదీర్ఘ వైరం.. ఈ రెండూ కన్నప్రేమ, అనురాగాలపై ’రాజకీయం‘ సాధించిన క్రూరమైన విజయానికి నిదర్శనాలు.



ముద్రగడ పద్మనాభం కుటుంబంలో వచ్చిన చీలికకు 2024 ఎన్నికల నాటి భిన్న రాజకీయ వైఖరులే ప్రధాన కారణం. వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన అనే రెండు వేర్వేరు రాజకీయ జెండాలు ఆ తండ్రీకూతుళ్ల మధ్య ఎంతటి శాశ్వతమైన గోడను నిర్మించాయంటే, పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచిన కుమార్తె క్రాంతి మొహాన్ని ఎప్పటికీ చూడనని ముద్రగడ బ్రతికున్నప్పుడే ప్రకటించారు. ఆ రాజకీయ పంతం ఆయన మరణానంతరం కూడా బంధాలను శాసించింది. తన అంత్యక్రియలకు కుమార్తెను రానివ్వకూడదనే ఆయన ముందస్తు ఆదేశాల వల్ల.. కన్నతండ్రి భౌతికకాయాన్ని ముట్టుకోవడానికి కూడా ఒక కుమార్తె పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. ’క్రాంతి గో బ్యాక్‘ అంటూ సొంత బంధువుల నినాదాలు, తండ్రి మృతదేహాన్ని తాకనివ్వని తల్లి ఆక్రోశం నడుమ కేవలం రెండు నిమిషాల కడచూపు కోసం ఒక కుమార్తె గుండెలు పగిలేలా ఏడ్చిన దృశ్యం రాజకీయ క్రూరత్వానికి పరాకాష్ట.
మరోవైపు వైఎస్సార్ కుటుంబంలో జరిగిన పరిణామాలు కూడా అధికారం, రాజకీయ ఆకాంక్షల ముందు సొంత రక్తసంబంధీకులు ఎలా పరాయివాళ్లుగా మారిపోతారో స్పష్టం చేస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం తల్లీ విజయమ్మ, చెల్లెలు షర్మిల వీధి పోరాటాలు చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ, అధికారం సిద్ధించిన తర్వాత తలెత్తిన రాజకీయ ప్రాధాన్యతలు, ఆస్తి వివాదాలు, వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలు వారి మధ్య నయం చేయలేని గాయాలను మిగిల్చాయి. ఏ చెల్లెలైతే అన్న కోసం రోడ్లపైకి వచ్చిందో, అదే చెల్లెలు చివరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారి సొంత అన్న జగన్‌ను గద్దె దించడానికి ప్రత్యక్షంగా తలపడేలా రాజకీయం పాచికలు వేసింది.
ఈ రెండు కుటుంబాల గాథలు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట కేవలం నాయకుల వ్యూహాలకు మాత్రమే కాదు, వారి ఇళ్లలోని రక్తసంబంధాలకు కూడా వర్తిస్తుంది. ముద్రగడ ఇంట్లో భావోద్వేగ పంతం కన్నకూతురిని దూరం చేస్తే, వైఎస్సార్ ఇంట్లో రాజకీయ ఆధిపత్య పోరాటం తోడబుట్టినవారిని కోర్టు మెట్లు ఎక్కించింది. గెలిచిన రాజకీయ జెండాలు, సాధించిన పదవుల వెనుక.. ఓడిపోయిన కన్నప్రేమ, కరిగిపోయిన అనురాగాలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో ఎవరైనా రాజకీయాలను శాసిస్తారేమో కానీ, లీడర్ల ఇళ్లల్లో మాత్రం ఆ రాజకీయమే బంధాలను శాసించి, చివరకు మానవత్వాన్ని సైతం బలితీసుకుని తనే విజేతగా నిలుస్తుంది.
Read More
Next Story