ఏపీలో ప్రతిపక్షం లేని రాజకీయం?
x

ఏపీలో ప్రతిపక్షం లేని రాజకీయం?

ఢిల్లీ ఫార్ములా.. ఆంధ్రప్రదేశ్ లో అమలు


కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కాంగ్రెస్‌ను బలహీనపరిచి, రాహుల్ గాంధీని పప్పు గా ట్రోల్ చేస్తూ ప్రతిపక్షం మాటలకు విలువ లేకుండా చేయడానికి ఎలాంటి మైండ్ గేమ్ ఆడారో.. నేడు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్‌పై సరిగ్గా అదే దిల్లీ ఫార్ములాను ప్రయోగిస్తున్నారు. ఇరు ప్రాంతాల్లోనూ కేవలం రాజకీయ పోరాటం జరగడం లేదు. అక్కడ ఈడీ, ఐటీ నోటీసులతో కాంగ్రెస్‌ను ఆర్థికంగా కట్టడి చేస్తే.. ఇక్కడ మద్యం, ఇసుక విచారణలతో వైసీపీ మూలాలను దెబ్బతీస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీని దేశానికి పనికిరాడని సోషల్ మీడియా ద్వారా డీమోరలైజ్ చేసినట్లుగానే, మరోవైపు జగన్‌ను సైకో అని, వైసీపీని గొడ్డలి పార్టీ అని ముద్ర వేసి కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ, వారి డిజిటల్ గొంతుకలను నొక్కేస్తున్నారు.



వలసల సుడిగాలి.. మారిన రివెంజ్ గేమ్
కానీ, ఈ అణచివేత రాజకీయం ఈరోజే పుట్టలేదు. దీనికి పెద్ద చరిత్రే ఉంది. చట్టసభలలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే వ్యూహాన్ని ఏపీలో ఇరు పార్టీలూ మార్చి మార్చి వాడుకున్నాయి. వెనక్కి వెళ్తే.. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు వైసీపీకి చెందిన ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను, టీడీపీలోకి లాక్కుని, అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి పార్లమెంటరీ సాంప్రదాయాలకు తొలి గండి కొట్టారు. దీనికి రివెంజ్ అన్నట్లుగా.. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్‌ తో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా, చంద్రబాబును జైలుకు పంపడం, జీవోల ద్వారా ప్రతిపక్షాల సభలను బ్యాన్ చేయడం చూశాం. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఈ రివెంజ్ గేమ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ.. వైసీపీకి ప్రతిపక్ష హోదా, పీఏసీ ఛైర్మన్ పదవి దక్కకుండా చేయడమే కాకుండా, కీలక వైసీపీ ఎంపీలను, ఎమ్మెల్సీలను టీడీపీలోకి చేర్చుకుంటూ జగన్‌ను రాజకీయంగా ఒంటరిని చేస్తున్నారు.
రాజ్యాంగ నైతికత.. అంతిమంగా ప్రజలకే నష్టం
భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే రక్షణ కవచం. బ్రేకులు లేని వాహనం ఎంత ప్రమాదకరమో.. బలమైన ప్రతిపక్షం లేని ప్రభుత్వాలు అంతకంటే డేంజర్. నిరంకుశంగా మారే అవకాశం ఉంది. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ, నేడు 2024 తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వం.. ఇలా ఏపీలో అధికారంలో ఎవరున్నా.. ప్రశ్నించే గొంతును నొక్కేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల చట్టసభలలో ప్రజాస్వామ్య సాంప్రదాయాలు పూర్తిగా నశిస్తున్నాయి. అసలైన ప్రజా సమస్యలు పక్కకు పోయి, కేవలం రాజకీయ కక్షసాధింపులే పరమావధిగా మారుతున్న ఈ తరుణంలో, ప్రతిపక్షాల గొంతు నొక్కితే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే.
Read More
Next Story