పిఠాపురం కూటమిలో పరువు తీస్తున్న ’ఫొటో‘ చిచ్చు
x

పిఠాపురం కూటమిలో పరువు తీస్తున్న ’ఫొటో‘ చిచ్చు

వర్మ వర్సెస్ దొరబాబు.. సన్యాసం వరకు వెళ్లిన సవాళ్లు


పిఠాపురం పీఏడీఏ (PADA) కార్యాలయం వేదికగా సాగాల్సిన అభివృద్ధి సమీక్ష.. ఒక్కసారిగా రాజకీయ రణరంగంగా మారింది. ప్రభుత్వ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో మాయమవ్వడం.. కూటమిలోని అంతర్గత విభేదాల సెగను బట్టబయలు చేసింది. సీఎం ఫోటో లేకపోవడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులను నిలదీస్తుండగానే.. జనసేన నేతలు తుమ్మలబాబు, పెండెం దొరబాబులు ఆయనపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ప్రోటోకాల్ విషయంలో మొదలైన ఈ ఫోటో రగడ.. తోపులాటలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకు వెళ్లి.. చివరకు రాజకీయ సన్యాసం తీసుకుంటామనే స్థాయికి చేరడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

ఫోటో రగడ.. అంతర్గత విభేదాల బహిరంగ వేదిక
పైకి కేవలం ఒక ఫోటో వివాదంగా కనిపిస్తున్నా, దీని వెనుక లోతైన రాజకీయ ప్రతీకారం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో టికెట్ కేటాయింపుల దగ్గరి నుండి పిఠాపురం నియోజకవర్గ ఆధిపత్యం వరకు.. ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గంలో పట్టు కోసం సాగిస్తున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం, తాజాగా పీఏడీఏ కార్యాలయంలో ఒక ఫ్లెక్సీ సాకుతో ఒక్కసారిగా బాహాబాహీకి దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన తోపులాట, పరస్పర దూషణలు.. కూటమిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని బట్టబయలు చేశాయి.
కూటమి ఐక్యతపై ప్రశ్నచిహ్నం
రాష్ట్రస్థాయిలో కూటమి నేతలు స్నేహహస్తం చాచుకుంటున్నా, పిఠాపురం లాంటి కీలక నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని వర్మ తన అస్త్రంగా మార్చుకుంటే, దానిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన నేతలు దూకుడు ప్రదర్శించడం.. కూటమిలో అన్నీ సవ్యంగా లేవు అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపింది. అధికారుల సాక్షిగా జరిగిన ఈ ఘర్షణ, కేవలం ప్రోటోకాల్ పొరపాటు కాదు.. ఇది వర్గపోరుకు పరాకాష్ట అని స్పష్టమవుతోంది. ఈ విభేదాలకు ఆజ్యం పోసేలా సాగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
వర్మకు పెండెం దొరబాబు బహిరంగ సవాల్
పీఏడీఏ కార్యాలయంలో జరిగిన ఘర్షణ అనంతరం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మపై నిప్పులు చెరిగారు. వర్మ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ ప్రస్థానంలో మాయని మచ్చ లేదని, ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేశానని దొరబాబు స్పష్టం చేశారు. వర్మ కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే, ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై బురదజల్లుతున్నారని.. ఈ తరహా బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇకపై సాగవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్యాసం తీసుకుంటా.. నిరూపించగలవా?
కేవలం ఖండించడమే కాకుండా, వర్మకు దొరబాబు ఒక భారీ సవాల్‌ను విసిరారు. నాపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా, నేను ఈ క్షణమే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను.. రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని ఆయన ప్రకటించడం పిఠాపురం రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. రాజకీయ లబ్ధి కోసమే ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న వర్మ, ఆధారాలు చూపి మాట్లాడాలని.. లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దొరబాబు హెచ్చరించారు. ఈ సవాల్‌తో పిఠాపురంలో నైతికత వర్సెస్ రాజకీయ ఆరోపణల యుద్ధం పరాకాష్టకు చేరింది.
దేవాలయంలో ప్రమాణానికి సిద్ధం
కేవలం రాజకీయ సవాళ్లతోనే ఆగకుండా, పెండెం దొరబాబు ఈ వివాదాన్ని దైవ సాక్షిగా తేల్చుకునే స్థాయికి తీసుకెళ్లారు. తనపై వస్తున్న ఆరోపణలు వ్యక్తిత్వ హననంలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, తన నిజాయితీని నిరూపించుకోవడానికి స్థానిక దేవాలయంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఎస్వీఎస్ఎన్ వర్మ కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే బురదజల్లుతున్నారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. పిఠాపురం గడ్డపై పట్టు కోసం ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
అభివృద్ధి వేదికపై ఆధిపత్య నీడలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం కూటమి నేతలంతా ఒక్కతాటిపై నిలిచినట్లు పైకి కనిపించినా, క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరు మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని ఈ 'పీఏడీఏ' (PADA) ఘటన నిరూపించింది. ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన వేదిక కాస్తా, రాజకీయ పంతాలు నెగ్గించుకునే రణరంగంగా మారడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య ఉన్న ఇగోలు భవిష్యత్తులో కూటమి సమన్వయంపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని సామాన్య కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరులో అభివృద్ధి ఎక్కడ వెనుకబడిపోతుందోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Read More
Next Story