15 ఏళ్లు చంద్రబాబే సీఎం? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
x

15 ఏళ్లు చంద్రబాబే సీఎం? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?

రాజ్యాధికారం చేక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఏకమవుతున్న కాపులు


2024 ఎన్నికల్లో జనసేన సాధించిన చారిత్రాత్మక 100% స్ట్రైక్ రేట్ వెనుక కాపు సామాజిక వర్గం నిలబడిన తీరు అసాధారణమైనది. అయితే అదే సామాజిక వర్గం ఇప్పుడు సరికొత్త రాజకీయ అంతర్గత మథనంలో పడింది. పవన్ కళ్యాణ్‌ను కింగ్ మేకర్‌గా నిలబెట్టిన కాపు నేతలు, యువత ఆయనను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇటువంటి తరుణంలో, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధించాలంటే మరో 10 నుండి 15 ఏళ్ల పాటు నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఆ వర్గంలో ఒక రకమైన నిరాశను, అసంతృప్తిని రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నప్పటికీ, దశాబ్దాలుగా తమ సామాజిక వర్గానికి చెందిన నేతను అత్యున్నత పీఠంపై చూడాలనుకుంటున్న పెద్దల ఆకాంక్షలకు ఇది గొడ్డలిపెట్టుగా మారిందనే భావన వ్యక్తమవుతోంది.



ఈ అసంతృప్తి తీవ్రత తాజాగా విజయవాడలో జరిగిన కాపు సామాజిక వర్గ నేతల సంచలన సమావేశంలో స్పష్టంగా బహిర్గతమైంది. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా నేతలు భావోద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకున్నారు. మన నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, ఆయన ఎన్నికల ఖర్చుల కోసం మా సొంత ఆస్తులను తాకట్టు పెట్టడానికైనా సిద్ధం అంటూ కొందరు నేతలు వెల్లడించడం విశేషం. పవన్ కళ్యాణ్ కేవలం ఒక కూటమి భాగస్వామిగా లేదా డిప్యూటీ సీఎంగా సరిపెట్టుకోకుండా, రాష్ట్ర రథసారథిగా ఎదగాలనే బలమైన కోరిక, పంతం ఈ సామాజిక వర్గంలో ఎంత గాఢంగా ఉందో విజయవాడ సమావేశ నిర్ణయాలు నిరూపిస్తున్నాయి.
ఈ అంతర్గత ఘర్షణను , వ్యూహాత్మక అసమ్మతిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిపక్ష వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది. వైసీపీకి చెందిన కాపు నేతలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, పవన్ కళ్యాణ్ కాపుల ఆకాంక్షలను, ఓట్లను చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టారు అంటూ విమర్శలు తీవ్రం చేస్తున్నారు. నిన్నటివరకు జనసేన వైపు ఏకపక్షంగా ఉన్న కాపు మద్దతును తిరిగి వైసీపీ వైపు తిప్పుకోవడానికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామాజిక వర్గం స్పష్టంగా రెండుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరో వైపు కాపులంతా ఒక తాటిపైకి వచ్చి జనసేనకు, పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపే అంశంలో కూడా మర్పు కనిపిస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎంగా చూడాలనే ఆకాంక్షఆ కాపుల్లో బలంగా పెరుగుతోంది.
Read More
Next Story