ఆపరేషన్ దక్షిణాది: బీజేపీ మాస్టర్ ప్లాన్..పవన్‌కు పగ్గాలు?
x

ఆపరేషన్ దక్షిణాది: బీజేపీ మాస్టర్ ప్లాన్..పవన్‌కు పగ్గాలు?

ఒకవైపు ఈడీ దాడులు.. మరోవైపు పవన్ గ్లామర్


ఉత్తర భారతదేశాన్ని ఇప్పటికే తన గుప్పిట్లోకి తెచ్చుకుని, తూర్పు భారత దేశంలోనూ (పశ్చిమ బెంగాల్) భారీగా పట్టు సాధించిన బీజేపీ.. ఇప్పుడు తన తదుపరి వ్యూహాత్మక లక్ష్యంగా దక్షిణాది రాష్ట్రాలపై (Operation South) పూర్తి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ అస్తిత్వం, సిద్ధాంతాలు బలంగా ఉండటంతో, ఉత్తరాది శైలి రాజకీయాలు ఇక్కడ నేరుగా వర్కవుట్ కావని ఢిల్లీ పెద్దలు గుర్తించారు. అందువల్ల, ఇక్కడి కమ్యూనిస్ట్ కోటలను బద్దలు కొట్టడమే కేంద్రంలోని కమలనాథుల ప్రధాన ఎజెండాగా మారింది. సిద్ధాంతపరంగా తమకు పూర్తి వ్యతిరేకమైన లెఫ్ట్ కూటమిని వీకెన్ చేస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ కూటమిని నీరుగార్చడం పెద్ద లెక్క కాదనేది బీజేపీ ఆలోచన. ఇందులో భాగంగానే కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు జరగడం కేవలం అవినీతిపై దర్యాప్తు మాత్రమే కాకుండా, అక్కడి ప్రతిపక్షాలను రాజకీయంగా, నైతికంగా డిఫెన్స్‌లో పడేసే వ్యూహంగా విశ్లేషించవచ్చు. ఇదే వ్యూహంతో తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు కొత్తగా ఎదుగుతున్న టీవీకే (TVK) పార్టీలను సైతం కట్టడి చేసేందుకు ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు.



దక్షిణాదిలో కేవలం దర్యాప్తు సంస్థల భయంతోనే రాజకీయం చేయలేమని, ప్రజలను కనెక్ట్ చేసే ఒక బలమైన స్థానిక ముఖం (Local Face) అవసరమని బీజేపీ హైకమాండ్ బలంగా నమ్ముతోంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సినిమా నటుడిగా సౌత్ ఇండియా మొత్తం విపరీతమైన క్రేజ్ ఉండి, సులభంగా మీడియా అటెన్షన్ తెచ్చుకోగల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బీజేపీ తన ప్రధాన పొలిటికల్ అస్త్రంగా ఎంచుకుంది. ఇటీవల ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన జనసేన ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ ఢిల్లీలో జాతీయ భావం పేరుతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం దీనికి బలమైన సంకేతం. జనసేన అధ్యక్షుడిగా ఉంటూనే, అంతర్గతంగా బీజేపీ సిద్ధాంతాలను, కేంద్ర ఎజెండాను దక్షిణాది ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లే ఒక అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కల్యాణ్‌ను జాతీయ పెద్దలు రంగంలోకి దించుతున్నారు. దీని ద్వారా ప్రాంతీయ శక్తులపై ఒక రకమైన మానసిక మైండ్ గేమ్‌ను బీజేపీ నడుపుతోంది.

అయితే, ఈ విసృత ప్రచార వ్యూహంలో ఒక పెద్ద ఆచరణాత్మక ఇబ్బంది ఉంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ హోదాతో ఆయన పక్క రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు లేదా తెలంగాణలో తరచూ పొలిటికల్ పర్యటనలు చేస్తే.. సొంత రాష్ట్ర పాలనను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారంటూ స్థానిక ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ విమర్శలన్నింటికీ ఒకే ఒక్క దెబ్బతో చెక్ పెట్టాలనేదే ఢిల్లీ పెద్దల మాస్టర్ ప్లాన్. పవన్‌ను రాష్ట్ర బాధ్యతల నుండి కేంద్ర మంత్రివర్గంలోకి ప్రమోట్ చేయడం ద్వారా ఆయనకు కేంద్ర మంత్రి అనే అధికారిక ప్రోటోకాల్ హోదా వస్తుంది. ఆ అధికారిక హోదాతో ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చు.. అటు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు ఉంటూనే, ఇటు క్షేత్రస్థాయిలో బీజేపీ పొలిటికల్ మైలేజ్ పెంచేందుకు, 2028 కర్ణాటక, తెలంగాణ ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవచ్చు. ఇది పవన్‌కు జాతీయ స్థాయి ఇమేజ్ ఇస్తూనే, బీజేపీకి దక్షిణాదిలో దారి సుగమం చేస్తుంది.

ఒకవేళ పవన్ కల్యాణ్ కేంద్ర రాజకీయాల్లో లేదా దక్షిణాది ప్రచారాల్లో బిజీ అయి ఢిల్లీకి పరిమితమైతే.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పట్టు తప్పకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందుకోసమే పవన్ కల్యాణ్ స్థానంలో ఆయన సోదరుడు, పార్టీ కీలక నేత కొణిదెల నాగబాబును ఏపీ కేబినెట్‌లోకి తీసుకోవాలనే ప్రతిపాదన క్షేత్రస్థాయిలో చర్చకు వచ్చింది. పవన్ ఢిల్లీకి వెళ్తే ఆయన ప్రతినిధిగా నాగబాబు రాష్ట్ర మంత్రిగా ఉంటే.. క్షేత్రస్థాయి క్యాడర్‌కు, జనసైనికులకు ఒక బలమైన పొలిటికల్ అండ దొరుకుతుంది. ప్రభుత్వం నుండి పార్టీకి రావాల్సిన ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవడానికి, అలాగే టీడీపీతో కూటమి సమన్వయం ఎక్కడా దెబ్బతినకుండా పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టడానికి ఈ బ్రదర్ సెంటిమెంట్ వ్యూహం జనసేనకు ఒక సురక్షితమైన మార్గం కానుంది. అంతిమంగా, ఈ గ్లామర్ అండ్ గన్ స్ట్రాటజీ ద్వారా అటు ఏపీలో కూటమి స్థిరంగా ఉంటూనే, ఇటు దక్షిణాది మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనేది బీజేపీ మైండ్ గేమ్.

Read More
Next Story