ఎన్టీఆర్‌కు ’భారతరత్న‘ 3దశాబ్దాల డిమాండ్
x

ఎన్టీఆర్‌కు ’భారతరత్న‘ 3దశాబ్దాల డిమాండ్

నాలుగో సారి కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.


తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ’భారతరత్న‘ ఇవ్వాలనే డిమాండ్‌ మహానాడు వేదికగా మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై, వాటిని భావితరాలకు అందించడం అందరి బాధ్యతని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే పార్టీకి శాశ్వత మార్గదర్శకమని ఆయన కొనియాడారు. అయితే, ప్రతి మహానాడులోనూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానాలు చేయడం, ఆ తర్వాత అది కేవలం ప్రతిపాదనలకే పరిమితం కావడం వెనుక ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి.


కేంద్రంలో చక్రం తిప్పినా సాధ్యం కాని ’రత్న‘ పురస్కారం

ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇక్కడ విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. టీడీపీ కేంద్ర ప్రభుత్వాల్లో కీలక భాగస్వామిగా ఉన్నప్పుడు ఎందుకు ఈ డిమాండ్‌ను నెరవేర్చుకోలేకపోయారు?
వాజ్‌పేయి హయాంలో కింగ్‌మేకర్‌గా ఉన్నప్పుడు
గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ అత్యంత కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ మనుగడే చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉన్న ఆ రోజుల్లో, లోక్‌సభ స్పీకర్ పదవిని కూడా టీడీపీ సాధించుకుంది. కానీ, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించుకోవడంలో ఆనాటి వ్యూహాలు ఎందుకు ఫలించలేదన్నది ఇప్పటికీ మిస్టరీనే.

2014-2019 మధ్య కాలంలో
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ-1 ప్రభుత్వంలో కూడా టీడీపీ కేంద్ర క్యాబినెట్‌లో భాగస్వామిగా ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల సాధన వంటి అంశాలపైనే ఆనాడు ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల ఎన్టీఆర్ భారతరత్న అంశం వెనక్కి పోయిందా అనే చర్చ నడుస్తోంది.
బాలకృష్ణకు పద్మభూషణ్..ఎన్టీఆర్‌కు ఎప్పుడు?
ఇదే క్రమంలో నందమూరి కుటుంబానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ’పద్మభూషణ్‘ అవార్డును అందుకున్నారు. నటుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా ఆయన సేవలకు గానూ ఈ పురస్కారం దక్కింది. అయితే, బాలకృష్ణకు పద్మ పురస్కారం వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు, అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్టీఆర్ ’భారతరత్న‘ సాధనపై ఎందుకు అంతటి పట్టుదల ప్రదర్శించలేకపోయారనే విమర్శలు కూడా లేకపోలేదు.

తాజా మహానాడు తీర్మానం.. వ్యూహం ఏమిటి?
మహానాడు వేదికగా తాజాగా ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం కేవలం భావోద్వేగ అంశం మాత్రమే కాదు, దీని వెనుక బలమైన రాజకీయ అవసరం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే నారా లోకేశ్ మహిళలకు 33 శాతం సీట్ల ప్రకటన చేశారని చంద్రబాబు చెప్పడం ద్వారా.. పార్టీ మూల సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
2024లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దాదాపు 23 నెలల కాలంగా కేంద్రంలోని పెద్దలతో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లకు అత్యంత సాన్నిహిత్యం, ప్రత్యేక సానుకూలత ఉన్న మాట వాస్తవం. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో వీరు ఇద్దరూ తరచూ భేటీ అవుతూనే ఉన్నారు. అయితే, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను వీరు నేరుగా మోదీ, అమిత్ షాల వద్ద గట్టిగా ప్రస్తావించకపోవడం వెనుక వ్యూహాలు ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ప్రస్తుతం కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు కింగ్‌మేకర్‌గా అత్యంత కీలకమైన పాత్రలో ఉన్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ, తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్‌కు ఈ సారైనా భారతరత్న పురస్కారాన్ని సాధించి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠంపై సగర్వంగా నిలబెడతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
Read More
Next Story