
పార్టీ సమావేశంలో నారా లోకేష్
జగన్ కి తల్లి అంటే ప్రేమా లేదు, దేశమంటే భక్తీ లేదు-లోకేశ్
రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను అడ్డుకోవడం జగన్ "రాక్షస మనస్తత్వానికి" నిదర్శనమని ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తారని, ఆయనకు కన్నతల్లిపై ప్రేమ లేదని, దేశం పట్ల భక్తి కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను అడ్డుకోవడం జగన్ "రాక్షస మనస్తత్వానికి" నిదర్శనమని ధ్వజమెత్తారు.
దేశ రక్షణ ముఖ్యం కాదా?
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే, అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తుంటే జగన్ అడ్డుకోవడంపై లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "దేశ రక్షణ కోసం పనిచేసే కంపెనీ వస్తే స్వాగతించాల్సింది పోయి, తరిమేస్తానని అనడం ఏంటి? జగన్ రెడ్డికి దేశం అంటే భక్తి లేదు, పైగా ద్వేషం పెంచుకున్నారు" అని విమర్శించారు.
మత్స్యకారుల పిల్లల ఉద్యోగాలపై సైకోయిజం
ఈ కంపెనీ ద్వారా స్థానిక మత్స్యకారుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వారు ఆర్థికంగా ఎదుగుతారని సంతోషించాల్సింది పోయి.. అడ్డుకుంటానని చెప్పడం ముమ్మాటికీ "సైకోయిజమే"నని లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ, ఉద్యోగాలు వస్తుంటే దానిని దోపిడీగా చిత్రీకరించడం జగన్ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
తల్లిని తరిమేసి.. చెల్లిని గెంటేసి..
జగన్ వ్యక్తిగత వైఖరిని ప్రస్తావిస్తూ లోకేశ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. "సొంత తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసిన జగన్‌కు దైవం అంటే భక్తి లేదు. ఆయన నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసం నిండి ఉన్నాయి. అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలను వెళ్లగొడతాం అనడం రాక్షస చేష్టలు కాక మరేమిటి?" అని ప్రశ్నించారు.
విధ్వంసమే జగన్ నైజం..
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్, ఇప్పుడు మళ్ళీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకు భవిష్యత్తు ఇస్తుంటే, జగన్ తన రాజకీయ ఉనికి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు.
Next Story

