డిఫెన్స్ లేదు.. ఓన్లీ అటాక్
x

డిఫెన్స్ లేదు.. ఓన్లీ అటాక్

ఏపీని షేక్ చేస్తున్న ’ముగ్గురు నేతల‘ త్రిముఖ దూకుడు రాజకీయం


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న ఈ భయంకరమైన త్రిముఖ అగ్రెసివ్ పాలిటిక్స్ కేవలం ఒక సాధారణ అధికార..ప్రతిపక్షాల విమర్శల స్థాయిని దాటిపోయి, నిరంతర యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది సాధారణంగా విపక్షాల విమర్శలను సాదాసీదాగా తిప్పి కొట్టడం కాకుండా, ఆత్మరక్షణ అంటే శత్రువుపై నిరంతరం దాడి చేయడమే అనే అగ్రెసీవ్, అటాక్ వార్ స్ట్రాటజీని అధికార పక్షాలు వాడుతున్నాయి. జగన్ ఒక నేరస్థుడని, వైసీపీ ఒక నేర పార్టీ, గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ చేస్తుంటే, వైసీపీ నేతలను రౌడీలతో పోల్చుతూ వారికి తొక్కి నార తీస్తా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ మాస్ వార్నింగ్స్ ఇస్తూ తమ శ్రేణులను నేరుగా ప్రతిపక్షంపై అటాక్ పెంచాలని డైరెక్ట్ చేయడం ఇక్కడి కొసమెరుపు. పాత కేసుల అస్త్రాలతో విపక్షాన్ని ఆర్థికంగా, నైతికంగా సంపూర్ణంగా అణచివేయడమే కూటమి వ్యూహం.



మరోవైపు, కేవలం 11 స్థానాలకే పరిమితమై, చుట్టూ కేసుల వలయం ఉన్నా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సైతం అధికార పక్షం ఎత్తుగడలకు ఏమాత్రం భయపడి లొంగడం లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు వైఫల్యాలు, నిరుద్యోగం, అమరావతి పేరుతో సాగుతున్న అంతర్గత అక్రమాలను అస్త్రాలుగా చేసుకుని కూటమిపై నేరుగా దండయాత్ర చేయాలంటూ తన క్యాడర్ దూకుడును ఆయన పెంచుతున్నారు.
అయితే, నేతలు వాడుతున్న ఈ దుర్మార్గమైన భాషను, నిరంకుశ ధోరణులను ప్రజలు నిశ్శబ్దంగా సహించడం వెనుక లోతైన సామాజిక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేసేది ఇదే కక్షసాధింపు రాజకీయం అనే రాజకీయ రోత వల్ల ప్రజల్లో తీవ్రమైన ఉదాసీనత పెరిగిపోయింది. దీనికి తోడు సమాజం కుల, రాజకీయ శ్రేణులుగా విడిపోవడం వల్ల సొంత నేత ఎంత అరాచక భాష వాడినా అభిమానులకు అది పవర్‌ఫుల్ పంచ్‌లాగే కనిపిస్తోంది. అకౌంట్లలో సంక్షేమ పథకాల డబ్బులు పడితే చాలు పైన నేతలు ఎంత కొట్టుకున్నా అనవసరం అనే భావన పేదల్లో రావడం, ప్రశ్నిస్తే ఏ కేసు పెడతారో అనే భయంతో ప్రజలు, మేధావులు సైలెంట్ అవ్వడం కూడా దీనికి కారణం. కానీ అంతిమంగా ఈ త్రిముఖ మైండ్ గేమ్ వల్ల రాష్ట్ర ప్రగతి, పారిశ్రామిక పెట్టుబడులు, నిరుద్యోగం లాంటి అసలైన ప్రజా సమస్యలు పూర్తిగా పక్కదారి పట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసమై ఆఖరికి సామాన్య ప్రజలే నిలువునా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.
Read More
Next Story