
కర్ణాటకలో సీఎం మార్పుపై ఖర్గే క్లారిటీ
మీడియాతో మరిన్ని విషయాలు చెప్పిన ఏఐసీసీ చీఫ్..
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిలో ప్రస్తుతం ఎలాంటి మార్పు ఉండదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అయితే ఈ సమస్యకు తర్వలో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఖర్గే గురువారం (ఏప్రిల్ 30న) మీడియాతో మాట్లాడారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి మార్పు ప్రశ్నే లేదు. ఇక్కడ ఇప్పటికే ఒక ముఖ్యమంత్రి ఉన్నారు,” అని ఖర్గే అన్నారు.
“ఆ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి కొంత సమయం పడుతుంది,” అని పేర్కొన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్యంపై అప్పట్లో ఒప్పందం జరిగిందనే వార్తలు వచ్చాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025 నవంబర్ 20 నాటికి తన పదవీకాలంలో సగం పూర్తి చేసుకుంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీలో నాయకత్వ పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో శివకుమార్‌కు ఉన్నత పదవి ఇవ్వాలని ఆయన అనుచర గణం నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో, సుమారు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తున్నారని జేడీ(ఎస్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కూడా ఖర్గే స్పందించారు. “ఆ విషయంపై నాకు సమాచారం లేదు. వివరాలు ఆయననే అడగండి,” అని ఆయన అన్నారు.
ఖర్గే తనపై వచ్చిన వ్యాఖ్యలకూ స్పందించారు. ఖర్గే ముఖ్యమంత్రి కావచ్చని రాష్ట్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై.. “నేను ముఖ్యమంత్రి అవుతానని మీరు అంటున్నారు. కానీ నా విషయంలో తుది నిర్ణయం సోనియా గాంధీ తీసుకుంటారు,” అని తెలిపారు.
మొత్తానికి, కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం సీఎం మార్పు లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది.
అయితే, నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు, కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పార్టీ అంతర్గత విషయాలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

