ఏపీలో కొత్త పార్టీలు?
x

ఏపీలో కొత్త పార్టీలు?

విజయ్ ఫార్ములాతో ఎన్టీఆర్, అల్లు అర్జున్?


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో మొదటిది, ’ఆలోచనా పరుల వేదిక‘ ద్వారా ప్రజా సమస్యలపై పోరాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV) నేతృత్వంలో దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక రెండవది, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చుట్టూ తిరుగుతోంది. తమిళ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించిన జూలై 18వ తేదీనే, ఏపీలో ఎన్టీఆర్ అభిమాన సంఘాలు భారీ ఎత్తున సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాబోయే మూడేళ్ల పాటు ఈ సేవా కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరవుతూ, తనకంటూ ఒక బలమైన రాజకీయ వర్గాన్ని కూడగట్టుకునే వ్యూహం ఇందులో దాగుందనే చర్చ నడుస్తోంది.



ఈ పరిణామాల వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్న సుదీర్ఘ రాజకీయ ఆవేదన, కుటుంబ అంతర్గత వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం తారక్ ఏపీవ్యాప్తంగా ప్రాణాలకు తెగించి ప్రచారం చేశారు, ఆ సమయంలోనే ఆయనకు తీవ్ర రోడ్డు ప్రమాదం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌ను రాజకీయంగా తెరపైకి తీసుకురావడంతో, జూనియర్ ఎన్టీఆర్‌ను క్రమంగా పక్కనబెట్టేశారు. హరికృష్ణ కుమారుడిగా పుట్టినప్పటికీ, సినిమా రంగంలో స్వశక్తితో ఎదిగే వరకు నందమూరి కుటుంబం కానీ, పార్టీ కానీ ఆయన్ను పట్టించుకోలేదనేది బహిరంగ రహస్యం. చివరకు బాబాయ్ బాలకృష్ణ ఇంట్లో జరిగిన శుభకార్యాలకు కూడా ఆహ్వానాలు ఇవ్వకుండా తారక్‌ను అవమానించిన ఉదంతాలు అభిమానులను, ఆయన మద్దతుదారులను తీవ్రంగా గాయపరిచాయి.
ఈ నేపథ్యంలోనే, టీడీపీలో తమకు ప్రాధాన్యత తగ్గుతోందని భావిస్తున్న కమ్మ సామాజిక వర్గంలోని ఒక బలమైన విభాగం జూనియర్ ఎన్టీఆర్‌ను సొంతంగా పార్టీ పెట్టాల్సిందిగా తీవ్రంగా ప్రోత్సహిస్తోంది. ప్రముఖ రియల్టర్, ఎన్టీఆర్ మామగారైన నార్నె శ్రీనివాసరావు ఆర్థిక, సామాజిక అండదండలు కూడా ఈ ప్రయత్నాలకు తోడవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఈ రాజకీయ వార్తలను అధికారికంగా ఖండించి, తమ ఫోకస్ సినిమాలపైనే ఉందని స్పష్టం చేసినప్పటికీ... ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం మద్దతుతో నవ్యాంధ్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడానికి తెరవెనుక ముమ్మర కసరత్తులు జరుగుతున్నాయనేది స్పష్టమవుతోంది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా తమిళ టాప్ హీరో దళపతి విజయ్ సినిమా కెరీర్ పీక్‌లో ఉండగానే రాజకీయ పార్టీ (TVK) పెట్టి సంచలనం సృష్టించిన తరహాలోనే, అల్లు అర్జున్ సైతం అదే బాటలో పయనించేలా ప్రణాళికలు రచిస్తున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల ఆయన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో రహస్యంగా భేటీ అయ్యారని, ఒక కొత్త ప్రాంతీయ పార్టీ స్థాపన, దానికి సంబంధించిన విధివిధానాలపై చర్చలు జరిపారనే వార్తలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ పీఆర్ (PR) టీమ్, ఆయన సన్నిహిత వర్గాలు అత్యంత వేగంగా స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పాయి. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లని, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం ’రాకా‘ (Raaka) తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాల వంటి ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారని, ఆయన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని స్పష్టం చేస్తూ ఈ పొలిటికల్ ఎంట్రీ ప్రచారానికి పూర్తి ముగింపు పలికాయి.
Read More
Next Story