
బెంగాల్‌లో టీఎంసీపై మోదీ తీవ్ర విమర్శలు..
‘మా, మట్టి, మనుష్’ నినాదానికి ద్రోహం చేశారని మమతపై తీవ్ర విమర్శలు..
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సందర్బంగా రాజకీయ వేడి మరింత పెరిగింది. ఉత్తర 24 పరగణాలలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, ప్రజలను ఆకట్టుకున్న ‘మా, మట్టి, మనుష్’ నినాదానికే ద్రోహం చేసిందని ఆరోపించారు.
‘నినాదం ఉచ్చరిస్తే పాపాలు బయటపడతాయి’ – మోదీ
ర్యాలీలో ప్రసంగిస్తూ టీఎంసీ పాలనపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. “15 ఏళ్ల క్రితం ‘మా, మట్టి, మనుష్’ అంటూ అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు ఆ మాటలు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మాటలు పలికితే వారి పాపాలు బయటపడతాయి,” అని మోదీ అన్నారు.
“టీఎంసీ క్రూరత్వం ‘అమ్మ’ను ఏడ్పించింది, ‘మట్టి’ని సిండికేట్లు, చొరబాటుదారులకు అప్పగించింది, ‘మనుష్’ను బెంగాల్ నుంచి వెళ్లిపోయేలా చేసింది,” అని ఆయన ఆరోపించారు.
తొలి దశ పోలింగ్ టీఎంసీకి దెబ్బ..
మొదటి దశ పోలింగ్ ఫలితాలు అధికార పార్టీకి షాక్ ఇచ్చాయని మోదీ పేర్కొన్నారు. “మొదటి దశలోనే బెంగాల్ అద్భుతాలు సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ అహంకారానికి గట్టి దెబ్బ తగిలింది,” అని ఆయన అన్నారు. “ఇప్పుడు రెండో దశలో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతోంది,” అని ధీమా వ్యక్తం చేశారు.
టీఎంసీ విధానాలపై విమర్శలు
రాష్ట్రంలో ఉపాధి పరిస్థితులపై కూడా మోదీ తీవ్రంగా స్పందించారు.
“బెంగాల్ యువత చాలా ప్రతిభావంతులు. కానీ టీఎంసీ ప్రభుత్వం వారిని వ్యసనాల వైపు నెట్టింది,” అని ఆయన ఆరోపించారు. “యువత సృజనాత్మకతను ప్రోత్సహించడానికి బీజేపీ కంటెంట్ క్రియేషన్, ఆర్థిక అవకాశాలను పెంచుతుంది,” అని ఆయన హామీ ఇచ్చారు.
క్రీడా వ్యవస్థపై ‘సిండికేట్ రాజ్’ ప్రభావం
బెంగాల్ క్రీడా రంగం కూడా టీఎంసీ పాలనలో దెబ్బతిందని మోదీ విమర్శించారు. “సిండికేట్ రాజ్ కారణంగా బెంగాల్ క్రీడా వ్యవస్థ కుప్పకూలింది. ఇది ‘మహా జంగల్ రాజ్’ ఫలితం,” అని ఆయన అన్నారు.
“ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తాము,” అని ఆయన క్రీడాకారులకు హామీ ఇచ్చారు.
రెండో దశ పోలింగ్‌పై దృష్టి..
ఇక రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఫలితాలు ఎన్నికల తీరును నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుండగా, నేతల మాటల యుద్ధం ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది.

