వైఎస్ విజయమ్మకు లోకేశ్ శుభాకాంక్షలు.. రాజకీయ ఎత్తుగడ ఇదేనా?
x

వైఎస్ విజయమ్మకు లోకేశ్ శుభాకాంక్షలు.. రాజకీయ ఎత్తుగడ ఇదేనా?


ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయాలకు అతీతంగా తన ఉదారతను చాటుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ’విజయమ్మ గారు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి‘ అని ఆకాంక్షిస్తూ నారా లోకేశ్ చేసిన ఈ మర్యాదపూర్వక ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విమర్శలు, ప్రతివిమర్శలతో నిత్యం వేడెక్కే రాజకీయ వాతావరణంలో, ప్రత్యర్థి కుటుంబానికి చెందిన పెద్దల పట్ల లోకేశ్ ప్రదర్శించిన ఈ గౌరవభావం ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచింది.

సోషల్ మీడియా వేదికగా హుందాతనమా
ఈ మేరకు ఆదివారం తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా మంత్రి లోకేశ్ స్పందించారు. ’వైఎస్ విజయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను‘ అంటూ ఆయన చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా వ్యక్తిగత సంబంధాలకు, పెద్దలకు ఇచ్చే విలువకు లోకేశ్ ప్రాధాన్యతనిచ్చిన తీరు ఆసక్తికరంగా మారింది.
రాజకీయ ఎత్తుగడ ఇదేనా?
అయితే, ఈ శుభాకాంక్షల వెనుక ఉన్న అసలు రాజకీయ ఎత్తుగడ ఏంటన్న చర్చ కూడా విశ్లేషకుల్లో మొదలైంది. వైఎస్ కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్న ఆస్తుల వివాదాలు, జగన్, షర్మిల మధ్య నడుస్తున్న పోరు నేపథ్యంలో.. లోకేశ్ నేరుగా విజయమ్మకు శుభాకాంక్షలు తెలపడం వ్యూహాత్మకమైన అడుగుగా కనిపిస్తోందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ, అదే సమయంలో రాజశేఖరరెడ్డి కుటుంబంలోని ఇతర సభ్యుల పట్ల సానుకూలత ప్రదర్శించడం ద్వారా వైసీపీని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం ఇందులో ఉందనే వాదన వినిపిస్తోంది. రాజకీయంగా ఇరు కుటుంబాల మధ్య తీవ్రమైన వైరం ఉన్నప్పటికీ, ఇలాంటి సంస్కారవంతమైన పోస్టుల ద్వారా తటస్థ ఓటర్లను, మహిళా ఓటర్లను ఆకట్టుకునే సాఫ్ట్ పాలిటిక్స్ ను లోకేశ్ అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటన్నారు.
అరుదైన దృశ్యం .. ఆసక్తికర పరిణామం
రాజకీయాలు అంటే కేవలం గొడవలే కాదని, మనుషుల మధ్య ఉండాల్సిన సంస్కారాన్ని లోకేశ్ చాటిచెప్పారంటూ ఒక వర్గం ప్రశంసిస్తుంటే.. దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందంటూ మరొక వర్గం విశ్లేషిస్తోంది. ఏది ఏమైనా, పార్టీలకు అతీతంగా విజయమ్మ పట్ల లోకేశ్ ప్రదర్శించిన ఈ హుందాతనం అటు గౌరవాన్ని, ఇటు రాజకీయ ఆసక్తిని ఒకేసారి పెంచింది. రాజకీయాల్లో పదునైన ఎత్తుగడలు వేస్తూనే, మర్యాదను పాటించడంలో లోకేశ్ అనుసరిస్తున్న ఈ సరికొత్త పంథా రాబోయే కాలంలో ఇంకెన్ని పరిణామాలకు బాటలు వేస్తుందో చూడాలి.

Read More
Next Story