ఆఫీసులు వదలండి.. జనం లోకి వెళ్ళండి:సీఎం
x

ఆఫీసులు వదలండి.. జనం లోకి వెళ్ళండి:సీఎం

మంత్రులు, అధికారులకు చంద్రబాబు బాబు అల్టిమేటం


పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) అర్జీలు పరిష్కారం కాకపోవడానికి రాజకీయ నేతల జోక్యమే కారణమనే ఆరోపణల్లో కొంతవరకు వాస్తవం ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నలిగే భూవివాదాలు, రెవెన్యూ రికార్డుల సవరణలు, పోలీస్ స్టేషన్లలో ఉండే సివిల్ తగాదాలలో స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా కనిపిస్తుంటుంది. తమ అనుచరులకు లేదా ఓటు బ్యాంక్‌కు లబ్ధి చేకూర్చేందుకు, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల అనేక అర్జీలు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. మరి ముఖ్యంగా రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ తో పాటు హోం శాఖల్లో ఇలాంటి పరిష్కారానికి నోచుకోని, పెండింగ్ అర్జీలు అధికంగా ఉన్నాయి.


అయితే, ఈ జాప్యానికి కేవలం రాజకీయ నేతలను మాత్రమే బాధ్యులను చేయలేము. వ్యవస్థలోని అధికార యంత్రాంగం (బ్యూరోక్రసీ) లోపాలు కూడా అంతే ప్రధాన కారణం. చాలా సందర్భాలలో క్షేత్రస్థాయి అధికారులు ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూడకుండా, కేవలం ఒక కంప్యూటర్ టాస్క్ లాగా భావిస్తున్నారు. బాధితుడికి క్షేత్రస్థాయిలో అసలైన పరిష్కారం చూపకుండానే, పైఅధికారుల ఒత్తిడి లేదా టార్గెట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తును పరిష్కరించబడింది గా మార్చి క్లోజ్ చేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయన్న చర్చ కూడా ఉంది. దీనికి తోడు శాఖల మధ్య సమన్వయ లోపం సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.
ఈ రాజకీయ..అధికార లూప్‌హోల్స్‌ను గమనించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పొలిటికల్ లీడర్ల మేనేజ్‌మెంట్ ఎంత ముఖ్యమో, బ్యూరోక్రాట్ల వేగవంతమైన చర్యలు అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కేవలం కలెక్టరేట్లకే పరిమితం కాకుండా, ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు) అధికారులు సంయుక్తంగా కూర్చుని ప్రజల సమస్యలను పరిష్కరించాలని రూల్ పెట్టారు. దీని ద్వారా రాజకీయ నేతలకు జవాబుదారీతనం పెంచడంతో పాటు, టెక్నాలజీ, క్షేత్ర పర్యటనల ద్వారా సిస్టమ్‌ను ప్రక్షాళన చేయాలని సీఎం భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో పారదర్శకత, పోటీతత్వాన్ని పెంచడానికి మంత్రులు, కలెక్టర్ల పనితీరుకు ర్యాంకులు (Performance Rankings) కేటాయించే విధానాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేపీఐ (Key Performance Indicators) ల ఆధారంగా ఈ ర్యాంకులను లెక్కిస్తారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) అర్జీల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, క్షేత్రస్థాయి ప్రజా సంతృప్తి వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని అధికారుల, ప్రజాప్రతినిధుల పనితీరుకు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులను సిద్ధం చేస్తున్నారు.
మంత్రులు, కలెక్టర్లకు ఈ ర్యాంకింగ్ విధానం పెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం అధికార యంత్రాంగంలో ఉన్న ఉదాసీనతను తొలగించడమే. ఏ జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు, ఏ మంత్రి తన శాఖ పరిధిలో ఫైళ్లను లేకుండా క్లియర్ చేస్తున్నారనేది ఈ ర్యాంకుల ద్వారా బహిర్గతమవుతుంది.ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం ద్వారా మంత్రులు కేవలం సచివాలయాలకే పరిమితం కాకుండా నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ తమ ర్యాంకులను మెరుగుపరుచుకోవడానికి, అలాగే జిల్లాల్లో కలెక్టర్లు మరింత జవాబుదారీతనంతో పనిచేయడానికి ఈ ర్యాంకింగ్స్ ఒక గట్టి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయనేది సీఎం చంద్రబాబు విశ్వాసం.
Read More
Next Story