
ఐటీ ఉద్యోగాలా? ల్యాండ్ పందేరమా?
కాగితాల్లో 65,000 ఉద్యోగాలు.. గ్రౌండ్‌లో పాత ఉద్యోగుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూన్ తర్వాత ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రాజధాని అమరావతి కాకుండా మిగిలిన జిల్లాల్లో సుమారు 1,11,000 ఎకరాల భూములను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టిందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ భూ కేటాయింపుల వెనుక ఉన్న అసలు గుట్టును గమనిస్తే, ఇందులో దాదాపు 98,000 ఎకరాలు (88%) సామాన్య ప్రజల ఆస్తులైన ప్రభుత్వ బంజరు భూములు, పేదలకు చెందిన అసైన్డ్ ల్యాండ్సే ఉన్నాయని అంచనా. విశాఖపట్నం మధురవాడ, భోగాపురం కారిడార్ వంటి అత్యంత డిమాండ్ గల ప్రాంతాలలో బహిరంగ మార్కెట్ ధర ఎకరానికి రూ. 8 కోట్ల నుండి ఏకంగా రూ. 20 కోట్ల వరకు పలుకుతున్న తరుణంలో, పారిశ్రామిక ప్రోత్సాహకాల ముసుగులో ఈ ప్రజా ఆస్తులను నామమాత్రపు ధరలకే అప్పగించడంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పోటీ పడాలనే ఏకైక సాకుతో 2025 ఆగస్టులో ప్రవేశపెట్టిన ‘లిఫ్ట్’ (LIFT 4.0) పాలసీ ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ విధానం కింద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కి 21.16 ఎకరాలు, కాగ్నిజెంట్ సంస్థకు 22.19 ఎకరాలు,రహేజా కార్పొరేషన్‌కు 27.10 ఎకరాల చొప్పున కోట్లాది రూపాయల విలువైన ప్రైమ్ ల్యాండ్స్‌ను ఏడాదికి ఎకరానికి కేవలం 99 పైసల లీజుకే కట్టబెట్టారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా ఈ వ్యూహాన్ని సమర్థిస్తున్నప్పటికీ, ఒక సామాన్య మధ్యతరగతి మనిషి తలదాచుకోవడానికి సెంట్ భూమి కొనాలన్నా లక్షల రూపాయలు అప్పులు చేయాల్సిన రాష్ట్రంలో, పారిశ్రామిక దిగ్గజాలకు వందల కోట్ల విలువైన ఆస్తులను దాదాపు ఉచితంగా రాసివ్వడం ప్రజల కోణం నుండి చూస్తే ముమ్మాటికీ భూ పందేరం లాగే కనిపిస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు.
ఈ సంస్థలకు భూములు ఇవ్వడం వెనుక 65,000 పైగా ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తామనేది ప్రభుత్వ వాగ్దానం. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలిస్తే, భూములు పొందిన సంస్థల శాశ్వత మెగా క్యాంపస్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభ లేదా కేవలం భూమి చదును చేసే ప్రాథమిక దశల్లోనే కాలక్షేపం చేస్తున్నాయి. ప్రజల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికి కంపెనీలు విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ వంటి పాత ప్రభుత్వ లీజు భవనాలలో తాత్కాలిక కేంద్రాలను తెరిచి, కార్యకలాపాలు ప్రారంభించినట్లు చూపిస్తున్నాయి. ప్రస్తుతం TCS లో 2,000 మంది, కాగ్నిజెంట్‌లో 1,000 మంది పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నా, అందులోని అసలు ట్విస్ట్ ఏంటంటే వీరిలో మెజారిటీ ఉద్యోగులు కొత్తగా రిక్రూట్ అయిన ఏపీ నిరుద్యోగులు కారని, ఇతర మెట్రో నగరాల నుండి బదిలీ అయి వచ్చిన పాత ఉద్యోగులే అనే విమర్శలు ఉన్నాయి. మరి కోట్ల విలువైన భూములు ఆవిరవుతున్నప్పుడు, స్థానిక యువతకు దక్కిన కొత్త ఉద్యోగాలెన్ని అనే దానికి పాలకుల దగ్గర స్పష్టమైన సమాధానం లేదు.
విచిత్రమేమిటంటే, ఈ భూ కేటాయింపుల వల్ల స్థానిక సామాన్యులకు లేదా భూములు కోల్పోయిన పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించాల్సిన అధికారులపైనే సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి పెంచుతున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూముల కేటాయింపు ఫైళ్లలో నిర్లక్ష్యం వద్దు, వేగంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించండి అని సీఎం కఠిన ఆదేశాలివ్వడం గమనార్హం. దీనిపై వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ వంటి కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నాయి. ఉద్యోగ కల్పన అనేది కేవలం ఒక కంటితుడుపు చర్య మాత్రమేనని, అసలు లక్ష్యం కార్పొరేట్ మిత్రులకు ప్రజా ఆస్తులను దారాదత్తం చేయడమేనని ప్రజల కోణం నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story

