కేరళ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించని కేంద్రం
x

కేరళ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించని కేంద్రం

నిబంధనలు పాటించకపోవడం వల్లేనంటున్న బీజేపీ నేతలు..


Click the Play button to hear this message in audio format

కేరళ(Kerala)లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (AIIMS)కు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, బీజేపీ(BJP) నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

కేంద్ర మంత్రి, త్రిస్సూర్ ఎంపీ సురేష్ గోపి ఎయిమ్స్ అంశాన్ని ఇటీవల మళ్లీ ప్రస్తావించడంతో చర్చ మళ్లీ ఊపందుకుంది. ఎయిమ్స్ ఏర్పాటుకు మొదట అలప్పుజను సూచించిన సురేష్..ఆ తర్వాత త్రిస్సూర్‌ను ప్రత్యామ్నాయంగా చూపడం రాజకీయ వాదోపవాదాలకు దారి తీసింది. అయితే అసలు వివాదానికి కారణం సురేష్ గోపి వ్యాఖ్యలు కాదని, కేంద్ర బడ్జెట్‌లో ఎయిమ్స్ ప్రస్తావన లేకపోవడమేనని పరిశీలకులు చెబుతున్నారు.

2024లో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. ఎయిమ్స్ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందని లేఖలో పేర్కొన్నారు. దీంతో త్వరలో బడ్జెట్‌లో కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఎటువంటి కేటాయింపు లేకపోవడం నిరాశకు గురిచేసింది.

ఈ నేపథ్యంలో బడ్జెట్ కేటాయించకపోవడంపై బీజేపీ నేతలు స్పందించారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు నిబంధనల ప్రకారం మూడు లేదా నాలుగు ప్రదేశాలు సూచించాల్సి ఉండగా.. కేరళ ఒక్క కినలూర్ స్థలాన్నే చూపారని ఆరోపించింది. 200 ఎకరాల భూమి బదులు కేవలం 151 ఎకరాలే చూపారని, హైవే కనెక్టివిటీ లేకపోవడంతో బడ్జెట్ కేటాయింపు జరగలేదని పేర్కొన్నారు.

అయితే కేరళ ప్రభుత్వం ఈ వాదనలను ఖండించింది. కేంద్రం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒకే స్థలం కోరారని, కొన్ని రాష్ట్రాల్లో భూ నిబంధన పట్టించుకోకుండా కేంద్రం అమోదించిందని వాదించింది. ఇదిలా ఉండగా కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రం నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఎయిమ్స్ డిమాండ్ పెండింగ్‌లో ఉందని, ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైనవన్నీ కేంద్రానికి చూపినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

సురేష్ గోపి వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. ఆయన ఎయిమ్స్ ఆవశ్యకతను బయటపెట్టినా.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర బీజేపీ నాయకత్వం పేర్కొనడం గమనార్హం.

మొత్తానికి కేరళలో ఎయిమ్స్ అంశం కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాకుండా కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై విశ్వాసానికి ప్రతీకగా మారింది.

Read More
Next Story