
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు.. సీఎం సిద్దరామయ్య సంచలన నిర్ణయం
దావణగెరె సౌత్ ఉపఎన్నికల నేపథ్యంలో బయటపడ్డ విభేదాలు ..
కర్ణాటకలో దావణగెరె సౌత్ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించారు. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలే ఈ చర్యకు కారణంగా పేర్కొంటున్నారు.
దావణగెరె సౌత్ నియోజకవర్గంలో ఉపఎన్నికకు కారణం 94 ఏళ్ల ఎమ్మెల్యే శమనూర్ శివశంకరప్ప మరణం. ఆయన మనవడు సమర్థ శమనూర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. సమర్థ్, రాష్ట్ర గనులు, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి ఎస్.ఎస్. మల్లికార్జున్ కుమారుడు. అయితే, అభ్యర్థి ఎంపికతోనే పార్టీలో అసంతృప్తి మొదలైంది. ముఖ్యంగా ముస్లిం నాయకులు తమ వర్గానికి చెందిన అభ్యర్థిని కోరుకున్నారు. కానీ పార్టీ నిర్ణయం వేరుగా ఉండటంతో వారు ప్రచారానికి దూరంగా ఉన్నారని సమాచారం.
ఇదే సమయంలో తిరుగుబాటు అభ్యర్థిగా సాదిక్ పహిల్వాన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే సీఎం సిద్దరామయ్య జోక్యంతో ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ అసమ్మతి పూర్తిగా తగ్గలేదు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ ఇటీవల కేపీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతర్గత విభేదాలకు ఇది కూడా ఓ కారణం.
ముస్లిం నాయకులు అభ్యర్థి ఎంపికపై తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారని మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. దావణగెరె నియోజకవర్గంలో ముస్లిం జనాభా గణనీయంగా ఉండటంతో, తమ వర్గానికి టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మార్చి 20న జరిగిన సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని ఆయన వెల్లడించారు. అభ్యర్థి గెలవకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించినట్లు చెప్పారు.
నసీర్ అహ్మద్ తొలగింపుపై స్పందించిన ఖాన్.. ఆయన దావణగెరెకు వెళ్లకపోవడమే కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పేర్కొన్నారు.
మొత్తంగా దావణగెరె సౌత్ ఉపఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను మరింత స్పష్టంగా బయటపెట్టాయి. ఎన్నికల ఫలితంపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

