
ఏపీలో రేగిన ’కాపు‘ చిచ్చు
ముదురుతున్న కుల రాజకీయం?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన కాపు సామాజికవర్గం ఓట్లను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వేసిన ముందడుగు ఈ వివాదానికి కేంద్రబిందువైంది. జూన్ 21న కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో బొత్స, అంబటి, పేర్ని నాని వంటి సీనియర్ కాపు నేతలు ఆత్మీయ సమ్మేళనం పేరిట భేటీ అయ్యారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్‌కు నిధులు లేవని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హయాంలో కాపులకు ప్రాధాన్యత తగ్గడంపై క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా వైసీపీ ఒక బలమైన ఆ సమావేశంలో తీసుకున్నారు.
పంతం నానాజీ వివాదాస్పద వ్యాఖ్యలు
వైసీపీ వేసిన ఈ కాపు కార్డును అంతే వేగంగా, ఘాటుగా తిప్పికొట్టే క్రమంలో జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. గత ఐదేళ్ల జగన్ పాలనలో కాపులను నిర్వీర్యం చేసిన ఈ నేతలకు ఇప్పుడు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడుతూ.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్న వైసీపీ సీనియర్ నేతలను ఉద్దేశించి ఆయన కుక్కలతో పోల్చడం తీవ్ర వివాదాస్పదమైంది. కేవలం రాజకీయ విమర్శలతో ఆగకుండా, సాటి సామాజికవర్గ సీనియర్లను అంత హీనమైన పదజాలంతో దూషించడం, వైఎస్ జగన్‌కు బహిరంగ సవాల్ విసరడం ద్వారా నానాజీ ఈ వివాదాన్ని వ్యక్తిగత, కుల పోరాటంగా మార్చేశారు.
వైసీపీ కౌంటర్ .. ముదురుతున్న కుల రాజకీయం
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన కుక్కల వ్యాఖ్యలపై వైసీపీ కాపు శ్రేణులు బగ్గుమన్నాయి. ముఖ్యంగా కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత రంగంలోకి దిగి, తోటి సామాజికవర్గ సీనియర్లను కుక్కలతో పోల్చడం నిజమైన కాపు బిడ్డ మాట్లాడే మాటేనా? అని నిలదీస్తూ నానాజీ అహంకారాన్ని తప్పుపట్టారు. నానాజీ తక్షణమే కాపు సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే కాపు యువతే తగిన బుద్ధి చెబుతుందని వైసీపీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపు నేతల మధ్యే ఈ స్థాయి మాటల యుద్ధం జరగడం.. రాబోయే రోజుల్లో ఏపీలో కుల రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారబోతోందనే దానికి స్పష్టమైన సంకేతం.
Next Story

