ఏందయ్యా ఎమ్మెల్యే.. టోల్ ప్లాజా సిబ్బందిని మీ వాళ్లు ఇంతగా కొట్టాలా?
x
పీలేరు వద్ద టోెల్ ప్లాజా మేనేజర్ పై దాడి చేస్తున్న కల్యాణదుర్గం ఎమ్మెల్యే గన్ మన్

ఏందయ్యా ఎమ్మెల్యే.. టోల్ ప్లాజా సిబ్బందిని మీ వాళ్లు ఇంతగా కొట్టాలా?

పీలేరు వద్ద కల్యాణదుర్గం ఎమ్మెల్యే గన్ మాన్, అనుచరుల వీరంగం


పీలేరు వద్ద అనుచరులు, గన్ మాన్ వీరంగం

కారులో కూర్చని చోద్యం చూసిన కల్యాణదుర్గం ఎమ్మెల్యే..

టోల్ ప్లాజా సిబ్బందిపై యథేచ్ఛగా దాడి...

ఫిర్యాదు ఇవ్వలేదంటున్న వాల్మీకిపురం సీఐ


అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కారులో కూర్చుని ఉండగానే జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద గన్ మాన్లు, అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్ గేట్ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీపీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

"ఎమ్మెల్యే కారు, ఎస్కార్ట్ వాహనాన్ని ఆపుతారా? " అని ఎమ్మెల్యే గన్మెన్లు, నేషనల్ హైవే-71పై అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వీరవిహారం చేశారు. టోల్ ప్లాజా మేనేజర్ రవి, మహిళ ఉద్యోగులపై కూడా దాడికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. దాడి అనంతరం కూడా టోల్ ప్లాజా మేనేజర్ రవితో పాటు కొందరిని ఎమ్మెల్యే అనుచరులు తమ కారులో బలవంతంగా ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి పంచాయతీ పెట్టారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై వాహనాలు ఆగిపోయాయి. అందులోని వాహనదారులు కూడా నివ్వెరపోయారు.

తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్లే మార్గంలో పీలేరు దాటిన తర్వాత కలికిరి జేఎన్టీయూ కాలేజీ తర్వాత జాతీయ రహదారి 71 గండబోయినపల్లి వద్ద జరిగిన ఈ సంఘటన స్థానికులను నివ్వెర పోయేలా చేసింది.
మదనపల్లె అన్నమయ్య జిల్లా పీలేరుకు సమీపంలోని నాలుగు లేన్ల జాతీయ రహదారిపై గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బీభత్సం చోటుచేసుకుంది. ఈ సంఘటనను ఆద్యంతం కారులోనే కూర్చొని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చోద్యం చూడడం మినహా, తమ గన్మెన్లు అనుచరులను వారించిన సందర్భాలు కూడా కనిపించలేదని స్థానికుల నుంచి అందిన సమాచారం. ఈ సంఘటనపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రభుత్వానికి రిపోర్టు చేశారని విశ్వసనీయ సమాచారం.
"ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు కారులోనే కూర్చుని ఉన్నారు. కారు వద్దకు టోల్ ప్లాజా మహిళ ఉద్యోగి వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మాట్లాడారు" ఆ దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డయ్యాయి.
"ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు" అని వాల్మీకిపురం సిఐ రాఘవరెడ్డి శనివారం రాత్రి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.

టోల్ ప్లాజా వద్ద ఏం జరిగింది..


పీలేరు నియోజకవర్గంలోని కలికిరికి సమీపంలోని జాతీయ రహదారి 71 పై ఉన్న గండ బోయినపల్లి వద్ద ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన రేంజ్ రోవర్ కారులో బయలుదేరారు. ముందు ఉన్న కారులో ఎస్కార్ట్ అనుచరులు ఉన్నారు. ఈ వాహనాలు గండబోయినపల్లి సమీపంలోని జాతీయ రహదారి71 ( National Highway 71) పై ఉన్న టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నాయి.
టోల్ ప్లాజాల వద్ద వాస్తవానికి ఏ వాహనమైన టోల్ ప్లాజా వద్దకు రాగానే, టోల్ ఫీజు కు సంబంధించి fostag కోడ్ స్కానింగ్ కాగానే టోల్ ప్లాజా వద్ద గేటు తెరుచుకుంటుంది. అలిమినేని సురేంద్రబాబు కూర్చుని ఉన్న వాహనం ముందు వెళ్తున్న కారు దగ్గరకు వెళ్లినా, గేటు తెరుచుకోని స్థితిలో ఎమ్మెల్యే గన్ మెన్ ఆగ్రహంతో ఊగిపోయారు.
గండబోయినపల్లె టోల్ గేట్ సిబ్బంది ఏమన్నారంటే..
"ఎమ్మెల్యే వాహనాన్ని నిలిపి టోల్ ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే వాహనాన్ని అనుమతిస్తాం" అని చెప్పారని తెలిసింది. దీనిపై ఎమ్మెల్యే అనుచరులు వాహనంలో ఎమ్మెల్యే ఉన్నారు. వాహనాన్ని వదలాలని కోరారు.
టోల్ గేట్ సిబ్బంది “లోకల్ ఎమ్మెల్యే గారికి మాత్రమే పాస్ ఉంది, ఇతరులు టోల్ చెల్లించాల్సిందే” అని సూచించారు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం ఎస్కార్ట్ వాహనంలోని సిబ్బంది కిందకు దిగి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అక్కడ ఉండాల్సిన హైవే పట్రోలింగ్ పోలీసులు ఏమయ్యారనేది కూడా తెలియడం లేదు.

గన్ మాన్ వీరంగం..
టోల్ ప్లాజా వద్ద గేటును బలవంతంగా తొలగించడానికి ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సిబ్బంది రావడంతో బూతులు తిడుతూ, గన్మెన్తోపాటు మిగతా ఎమ్మెల్యే అనుచరులు కూడా వారిపై ఇష్టానుసారంగా దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి.
ఈ దాడిలో టోల్ ప్లాజా రవి పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో టోల్ ప్లాజా ఉద్యోగి శ్రీలత పై కూడా దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. టోల్ ప్లాజా మేనేజర్ రవిని కొట్టుకుంటూ తీసుకువెళ్లే దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి.

పోలీస్ స్టేషన్లో పంచాయతీ..
గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద వీరంగం అనంతరం అక్కడి మేనేజర్ తోపాటు ఇద్దరు ఉద్యోగులను బలవంతంగా కారులో ఎక్కించుకుని సమీపంలోని వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి, అక్కడ పంచాయతీ పెట్టారని చెబుతున్నారు.
దాడికి పాల్పడింది. అధికార టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గన్ మాన్, ఆయన అనుచరులు. స్టేషన్ లోనే ఎమ్మెల్యే ఉన్నారు. పోలీసులు నిస్సహాయులయ్యారని పరిస్థితి చెప్పకనే చెబుతోంది. టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్న మాటలు కూడా పనిచేయని స్థితిలో అక్కడ కూడా సిబ్బందిపై దాడికి యత్నించినా పోలీసులు వారించి, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారని తెలిసింది.
"టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మా స్టేషన్ లో పంచాయతీ కూడా ఏమి జరగలేదు" అని సీఐ రాఘవరెడ్డి చెప్పారు.
మొత్తానికి టోల్ ప్లాజా సిబ్బందికి నచ్చజెప్పి, పరిస్థితి చేయిదాటకుండా, పంచాయతీలో రాజీ చేసి, పంపించారని సమాచారం.

నల్లారి రియాక్షన్ ఏమిటో..

గండబోయినపల్లె జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా పీలేరు నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ రహదారి పూర్తయ్యాక టోల్ ప్లాజాలో స్థానికులకు ఉద్యోగాల్లో నియమించడానికి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ చొరవ చూపించారు. దీంతో గండబోయినపల్లె గ్రామానికి చెందిన వారినే టోల్ ప్లాజాలో నియమించారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు సమక్షంలోనే తమ ప్రాంతం వారిపై ఇష్టానురాజ్యంగా దాడికి పాల్పడిన తీరుపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
"దాడికి గురయ్యాం. ఎమ్మెల్యేకు దండం పెట్టి వేడుకున్నాం. అయినా అవమానానికి గురైనా, గమ్మనే ఉండాల్సి వచ్చింది" అని బాధిత సిబ్బంది పోలీస్ స్టేషన్ వద్ద ఆవేదనకు గురయ్యారని చెబుతున్నారు.
అనంతపురం జిల్లాల ప్రధానంగా అనంతపురం, గుంతకల్లు నియోజవర్గాల తరువాత కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. పీలేరు వద్ద జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పోలీస్ గూఢచారవర్గాలు సమాచారం చేరవేశాయని తెలిసింది. దీనిపై రియాక్షన్ ఏమిటో చూడాల్సిందే..
Read More
Next Story