జగన్ పరామర్శ యాత్ర : రూట్ మారింది..రాజకీయం వేడెక్కింది
x

జగన్ పరామర్శ యాత్ర : రూట్ మారింది..రాజకీయం వేడెక్కింది

పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్ తన రూట్ మ్యాప్‌ను మార్చుకున్నారు.


మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ పర్యటన రూట్ మ్యాప్ మారింది. తొలుత నిర్ణయించిన మార్గానికి పోలీసులు బ్రేక్ వేయడం, ప్రత్యామ్నాయ రూట్ సూచించడంతో తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు హైడ్రామా నడిచింది. భద్రత, ట్రాఫిక్ సమస్యలను పోలీసులు కారణాలుగా చూపగా.. ఇది కావాలని చేసిన కుట్ర అని వైసీపీ మండిపడింది.

వారధి వద్దు.. బైపాస్ ముద్దు

జగన్ తొలుత తన తాడేపల్లి నివాసం నుంచి కనకదుర్గ వారధి మీదుగా నగరం లోపలి నుంచి వెళ్లాలని భావించారు. అయితే, విజయవాడకు అత్యంత కీలకమైన వారధి మీదుగా ర్యాలీగా వెళ్తే నగరం మొత్తం స్తంభిస్తుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో గుంటూరు పర్యటనలో కేవలం 7 కిలోమీటర్ల దూరం దాటడానికి 7 గంటలు పట్టిందని, అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని పేర్కొంటూ జగన్ టీమ్‌కు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత ఉన్న నేత ఇరుకైన రోడ్ల గుండా వెళ్లడం ప్రమాదకరమని పోలీసులు వాదించారు.

మారిన రూట్ మ్యాప్.. బైపాస్ మీదుగా ప్రయాణం

పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్ తన రూట్ మ్యాప్‌ను మార్చుకున్నారు. తొలుత నిర్ణయించిన విధంగా విజయవాడ నగరం లోపలికి వెళ్లకుండా తాడేపల్లి నుంచి మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట, గుంటుపల్లి ద్వారా ఇబ్రహీంపట్నం చేరుకునేలా కొత్త ప్లాన్ ఖరారు చేశారు. పోలీసుల సూచనల మేరకు వెస్ట్ బైపాస్ మీదుగా జగన్ తన పరామర్శ పర్యటన కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.

కుట్రపూరిత చర్య అంటూ వైసీపీ ఫైర్

రూట్ మ్యాప్ మార్పుపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జగన్ పర్యటనకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది అని పార్టీ నేతలు ఆరోపించారు. చివరి నిమిషంలో నోటీసులు ఇచ్చి అడ్డంకులు సృష్టించడం జగన్‌ను ప్రజలకు దూరం చేసే కుట్ర అని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

పరామర్శ వెనుక నేపథ్యం

ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో జోగి రమేష్ నివాసం ధ్వంసం కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా నష్టపోయిన మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకే జగన్ ఈ పర్యటన చేపట్టారు. అయితే, పర్యటన 'రూట్ మ్యాప్' మార్పు వివాదం మాత్రం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More
Next Story